‘‘అమ్మా, నాకేం తెలీదు.. నువ్వు రేపు నాన్నతో కలిసి లిటరరీ ఫెస్టివల్‌కు వెళ్తున్నావంతే’’ అంటూ స్వర తన అంతిమ తీర్పును చెప్పేసింది. ఆ ఇంట్లో ఆమె చిన్నదైనా, తల్లిదండ్రుల ఏకైక గారాలపట్టి కావడంతో, తన మాట ఎలాగైనా నెగ్గేలా చేసుకోవడం ఆమెకు కొట్టిన పిండి! ‘‘స్వరా, ప్లీజ్! ఈ విషయంలో నువ్వు నన్ను బలవంతం చెయ్యొద్దు. నేనెందుకు పానకంలో పుడకలా? అదంతా మీ నాన్న ఫ్రెండ్ ఒకరి పుస్తకావిష్కరణ వేడుక. ఆ రచనకు మీ నాన్న ముందుమాట రాశారు. ఆ పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. దాంతో పాటు ఉపన్యాసాలు, చర్చా కార్యక్రమాలు, కవిసమ్మేళనాలు, కథాగోష్ఠులు ఉన్నాయి. అక్కడ మీ నాన్నలాగే గొప్ప గొప్ప కవులు వచ్చుంటారు. ఇంకా కొంతమంది సాహిత్యాభిమానులు ఉపన్యాసం వినడానికి, కవితలు ఆస్వాదించడానికి వచ్చి ఉంటారు. నేను ఆ రెండు గుంపుల్లోనూ చేరని దాన్ని.
అలాంటప్పుడు నేనెందుకు ఆ కార్యక్రమానికి వెళ్లి నా టైమ్ వేస్ట్ చేసుకోవాలి చెప్పు? నాకక్కడ చాలా అసౌకర్యంగా ఉంటుంది. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్’’ అంటూ అరగంట నుంచి తనను బతిమాలుతున్న కూతురి ఒత్తిడికి లొంగడానికి ఇష్టపడని సౌదామిని తన మనసులో మాటను కూతురికి చెప్పింది.‘‘అమ్మా, కొన్నిసార్లు మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం తప్పనిసరి అవుతుంది. ఇది కూడా అలాగే అనుకో.’’కూతురి మాటల ధోరణి సౌదామినికి వింతగా అనిపించింది! ఈ అమ్మాయి ఎందుకింత మొండిగా పట్టుబట్టి కూర్చుంది? ‘అమ్మను కవి సమ్మేళనానికి రమ్మని ఒప్పించు’ అని తన భర్తేమైనా దీనికి చెప్పి ఉంటారా అనే చిన్న అనుమానం ఆమెను వేధించినా, ఆయనకు తాను రావాలని ఉంటే, ఆయనే స్వయంగా చెప్పేవారు. కూతురి ద్వారా ఎందుకు చెప్పిస్తారు అనుకుని, తన ఆలోచనకు నవ్వుకుంది సౌదామిని.
‘‘నాకు చాలా పని ఉంది. ఇటు చూడు, ఎవరో మీ నాన్న ఫ్రెండ్ ఇంత పెద్ద పనసపండు ఇచ్చి వెళ్లారు. దాని తొనలు తీసి సాయంత్రం కొంచెం పాఠోళీ చేయాలి. మిగిలిన దానిలో రేపు ఉదయం పనసపండు ఆవిరి కుడుములు చేయాలి. మీ నాన్నకు పనసపండు, ఇంకా దాని వంటకాలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. రేపు మీ నాన్న పుస్తకావిష్కరణ వేడుకకు వెళ్లేటప్పుడు ఆయనతో పాటు కారులో ఆయన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. అందుకే దారిలో తినడానికి ఏవైనా చిరుతిళ్లు చేయాలి. పోయినసారి చక్కిలాలు చేసిచ్చాను. అందరూ చాలా రుచిగా ఉందని ఇష్టపడి తిన్నారట. ఈసారి కొంచెం కారప్పూస చేస్తాను. ఇన్ని పనుల టెన్షన్‌లో నేనుంటే నువ్వు నాకు నక్షత్రకుడిలాగా తగులుకున్నావేమిటే?’’ అని విసుక్కుంది సౌదామిని.
‘‘అమ్మా, కొంచెం నీ వంటగది ప్రపంచం నుంచి బయటికి రా. నువ్వు రేపు ఉదయం కుడుములు, గిడుములు అంటూ లేనిపోని పనులన్నీ నెత్తిన వేసుకుని కూర్చోకు. నాన్న తొందరగా బయలుదేరతారు. అందుకే నువ్వు ఆయనతో పాటు త్వరగా సిద్ధమై బయలుదేరు. రేపొక్క రోజుకు నేనే మ్యాగీ చేస్తాను. దట్స్ ఆల్!’’ అని స్వర చిరాకుగా చెప్పింది.‘‘స్వరా, నేను వెళ్ళను. నువ్వు నన్ను బలవంతం చేయకు. కొన్నిసార్లు నువ్వు కూడా, నేను ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్దాం పద అంటే ‘నేను రాను, నాకు అక్కడ డిస్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది’ అంటూ తప్పించుకుంటావు కదా. నాకూ అలాగే ఉంటుంది. ఈ కవి సమ్మేళనం, సాహిత్య సంబరం, పుస్తకావిష్కరణ అంటూ నన్ను లాగొద్దు. మీ నాన్నతో ఇరవై ఐదు సంవత్సరాలు సంసారం చేశాను.
మా ఇంట్లో జరిగిన గోష్ఠి తప్ప ఇప్పటివరకు ఆయనతో ఒక్క కవి సమ్మేళనంలోగాని, ఆయన పుస్తకావిష్కరణ వేడుకలోగాని నేను పాల్గొనలేదు. ఆయనా దాన్ని ఎక్స్‌పెక్ట్ చేయరు కూడా’’ సౌదామిని తల అడ్డంగా తిప్పుతూ, పనసతొనలు తీయడంలో లీనమైంది.‘‘అమ్మా, ఇన్నాళ్లు నువ్వు వెళ్లకపోయి ఉండవచ్చు. కాని, ఇక నువ్వు ఇలాగే కిచెన్ క్వీన్ అంటూ ఇంట్లోనే కూర్చుంటే, ఆ తర్వాత అంతే... నేను నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.’’‘‘ఏంటది, ఏదో చెప్పాలనుకుంటున్నావు. దాన్ని చెప్పడానికి ఇంతలా కష్టపడుతున్నావు? టెల్ మీ వాట్స్ ద మ్యాటర్?’’ ఇప్పుడు సౌదామినికీ ఏదో అనుమానం మొదలైంది.‘‘అమ్మా, విషయం ఇంకా చిన్నగానే ఉంది. కాని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అంటారే, ఇదీ కొంచెం అలాగే. నువ్వు ఏడ్చి గోల చేయనంటే చెబుతాను.’’ స్వర మరింత చిక్కుగా చెప్పింది.‘‘నువ్వు ఇంత సస్పెన్స్‌లో పెడితే ఎలా? నా గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది చూడు,’’ అని కొంచెం కలవరపడినట్లు పలికింది సౌదామిని.
‘‘అమ్మా, అదీ నేను ఈ రోజు నాన్న స్నానానికి వెళ్ళినప్పుడు, నా మొబైల్‌లో చార్జ్ లేదని గూగుల్‌లో ఏదో సెర్చ్ చేయడానికి అని నాన్న మొబైల్ తీసుకున్నాను. సరిగ్గా అప్పుడే ఆయన వాట్సప్‌కి మానసగంగ అనే వారి నుంచి మెసేజ్ వచ్చింది. కుతూహలం ఆపుకోలేక చెక్ చేశాను... నీకు తెలుసా మానసగంగ ఎవరో?’’‘‘ఊ, ఎప్పుడో ఒకసారి మన ఇంటికి వచ్చినట్లుంది. హా! ఆ రోజు మీ నాన్న బర్త్‌డేకి మన ఇంట్లోనే కవి సమ్మేళనం ఉన్నప్పుడు చూశాను. నువ్వు అప్పుడు బెంగళూరులో ఇంజినీరింగ్ చేస్తున్నావు. యాక్చువల్‌గా ఆమె పేరు మానసగంగ కాదు, ఆమె పేరు సావిత్రి అంట. ఆ పేరు ఆమెకి ఇష్టం లేదంట, ఓల్డ్ ఫ్యాషన్డ్ అంట. ఆ పేరుతో కవిత రాస్తే ఎవరూ మెచ్చుకోరంట... అందుకే మానసగంగ అని కలంపేరు పెట్టుకున్నానని ఆ రోజే చెప్పింది. మీ నాన్నే తనకు కవిత రాయడానికి గురువు, స్ఫూర్తి అని కూడా చెప్పింది. ఆమె మీ నాన్నకు ఏం మెసేజ్ చేసింది?’’ సౌదామిని కనుబొమ్మలు ముడిచి అడిగింది.
‘‘నాన్న మొబైల్‌లో ఆమె ఫోటో చూశాను. చాలా పిచ్చిగా ఉంది. ఎదురుగా ఎలా ఉంది?’’ స్వర కుతూహలంతో అడిగింది.‘‘చాలా ముద్దుగా ఉంది. అంతే బాగా మేకప్ వేసుకుని, స్టైల్‌గా చీర కట్టుకుని ఉంది. ఏదో కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా వర్క్ చేస్తోందంట. ఎమ్మే చదివేటప్పుడే తన లెక్చరర్ ఒకరిని లవ్ చేసి పెళ్లి చేసుకుందంట. ఆ పెళ్లి రెండు సంవత్సరాలు కూడా నిలవలేదంట... అదంతా ఆ రోజు కవి సమ్మేళనానికి వచ్చిన ఆడవాళ్లలో కొంతమంది గుసగుస లాడుకున్నారు. ఆ రోజు ఆమెనే కార్యక్రమం యాంకరింగ్ చేసింది. ఆమె యాంకరింగ్ స్టైల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. అక్కడ సభలో కూర్చున్న ఎవరో ‘ఆహా, వగలాడి. అదేం స్టైలో, అదేం మేకప్పో, ఎవరినైనా మాటలతో లోబరచుకునే కళ ఈమెకు ఎంత బాగా అబ్బిందో చూడు’ అని తన పక్కన కూర్చున్న వారికి చెబుతున్నారు.
దానికి పక్కనున్న ఆవిడ ‘ఏం చేస్తే ఏం లాభం? తన సంసారాన్ని నిలబెట్టుకోలేకపోయింది పాపం! ఈమె పంచవన్నెల చిలక అని తెలియగానే అతను ఈమెను వదిలేసి ఉంటాడు’ అని కిసుక్కున నవ్వింది. నాకు అయ్యో అనిపించింది. ఒక ఆడది ముందుకు వస్తే జనం ఎలా ఆమె గురించి లేనిపోనివన్నీ ఆడుకుంటారే అని చాలా చిరాకు కలిగింది. అదంతా సరే, నువ్వెందుకు ఆమె గురించి అడుగుతున్నావు? అలాంటిదేం మెసేజ్ పంపింది మానసగంగ, ఐ మీన్ సావిత్రి...’’‘‘అమ్మా, ఆమె నాన్నతో ఫ్లర్ట్ చేస్తోంది. నాన్నకు ఏవేవో మెసేజ్‌లు పంపింది. నాన్న కూడా దానికి అంతే రసికత్వంతో సమాధానమిచ్చారు. ఆమె పాత మెసేజ్‌లను కూడా నాన్న డిలీట్ చేయలేదు. నేను అదంతా స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్‌కు ఫార్వర్డ్ చేసుకుని ఆ తర్వాత నిదానంగా చదివాను. ఐ వాస్ ఇన్ ఎ షాక్. ఇద్దరూ కొంచెం ఎక్కువే క్లోజ్ అయినట్లుంది.’’ స్వర తన గొంతు తగ్గించి పలికింది. నాన్న గురించి తన తల్లి ముందు ఇలా చెప్పడానికి ఆమె మనసు కాస్త వెనుకంజ వేస్తోంది.
‘‘ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి ఉందా నీకు? కేవలం సెక్స్, క్రైమ్, అనైతిక సంబంధాల చుట్టూనే అల్లిన సినిమాలను ఓటీటీల్లో చూడటం తగ్గించు. అప్పుడు ఇలా అందరిపై అనుమానం రావడం తగ్గుతుంది. ఆయన మీ నాన్న అన్న విషయం మర్చిపోయావా ఏంటి? ఈ మాట నీ బదులు వేరే ఎవరైనా చెప్పి ఉంటే, వాళ్ల నాలుకను కోసి ఇంటి గుమ్మానికి తోరణం కట్టి ఉండేదాన్ని!’’ సౌదామిని పనస తొనలు తీసే పనిని అక్కడితో ఆపి, చెంగున కత్తిపీట మీది నుంచి లేచి కోపంతో కూతురి వైపు చూసింది.‘‘ఆయన కేవలం నీకు భర్త మాత్రమే కాదు. నాకు నాన్న కూడా. అందుకే ఆయన గురించి చెప్పడానికి ముందు వందసార్లు ఆలోచించాను. వాళ్లిద్దరి చాటింగ్‌ల స్క్రీన్ షాట్ నీ మొబైల్‌కు పంపిస్తాను. నిదానంగా కూర్చుని చదువు.’’ అంటూ ఒక పనస తొనను నోట్లో వేసుకున్నది. కాని, ఎందుకో అది చేదుగా అనిపించి, దాన్ని ఊయడానికి వాష్ బేసిన్ వైపు వెళ్ళింది.
∙∙
సౌదామిని భర్త శేషగిరి ఒక పెద్ద కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్. అనేక విషయాలపై ఆసక్తి, జీవితం పట్ల అనురక్తి కలిగిన వ్యక్తి అతను. విమర్శకుడు, కవి, కథకుడు, అనేక మంది వర్ధమాన రచయితలకు మార్గదర్శకుడు. ఏ విషయం గురించి అయినా సభికులకు విసుగు రాకుండా రసవత్తరంగా ఉపన్యాసం ఇవ్వగలిగే వాక్చతురుడు! అతనితో పాటు పనిచేసే సై లెక్చరర్లందరూ కాలేజీ ముగిసిన తర్వాత, అలాగే వేసవి సెలవుల్లో కోచింగ్ సెంటర్‌కు వెళ్లి పాఠం చెప్పి జీతంతో పాటు ఎక్స్‌ట్రా ఇ¯Œ కమ్ సంపాదించడంలో మునిగి ఉన్నా, ఇతనికి కూడా చాలామంది అలాంటి సలహా ఇచ్చినా, శేషగిరికి లక్ష్మి కంటే సరస్వతియే ఎక్కువ ప్రియమైనదై, కథలు, కవితలు, వ్యాసాలు రాసి పుస్తకాలు ప్రచురించడంలోనే ఎక్కువ ఆసక్తి చూపించాడు.
సాహితీవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. ఏ లాబీయింగూ లేకుండానే కొన్ని అవార్డులు కూడా గెలుచుకున్నాడు. కాని, తానే మెచ్చి పెళ్లి చేసుకున్న సౌదామిని మాత్రం దానికి పూర్తి విరుద్ధం! ఎక్కువగా మాట్లాడని మౌనగౌరి ఆమె! కథలైనా కొంచెం చదివేదేమో కాని, కవితలంటే ఆమెకు అలర్జీ! పెళ్లైన కొత్తల్లో భార్యకు తన కవితలను చదివి వినిపించే అలవాటు శేషగిరికి ఉండేది. కాని, తాను కవితలు చదివి వినిపించేటప్పుడు భార్య మౌనంగా కళ్లు పెద్దవి చేసి చూసి, చివరకు ‘బాగుంది’ అని భావరహితంగా చెప్పడం చూసి, ఆమెకు దానిపై ఆసక్తి లేదని అర్థం చేసుకోవడానికి అతనికి ఎక్కువ కాలం పట్టలేదు. అందుకే నెమ్మదిగా అతను తన రచన గురించి భార్య ముందు చెప్పడమే మానేశాడు.
సౌదామిని కూడా దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా, తన పనిలో తాను నిమగ్నమై తన పతివ్రతా ధర్మాన్ని ఏమాత్రం తప్పకుండా పాటిస్తూ పోయింది. విపరీతమైన జిహ్వచాపల్యం ఉన్న భర్త అవసరాలన్నీ అర్థం చేసుకుని, అతని కోరిక తీర్చడంలోనే తన జీవితానికి ఒక సార్థకత ఉందని ఆమె భావించింది.శేషగిరి కాలేజీ ముగించి ఇంటికి వచ్చి భార్య చేసి ఇచ్చిన అల్పాహారం తిని, కాఫీ తాగి తన లైబ్రరీ గదిలోకి వెళితే అంతే. చదవడం, రాయడంలోనే లీనమైపోయేవాడు. గోడపై ఉన్న పాతకాలం పెండ్యూలమ్ గడియారం తొమ్మిదిసార్లు కొట్టినప్పుడే బయటికి వచ్చేవాడు! భోజనం తర్వాత కూడా ఏవైనా సగం చదివిన పుస్తకాలు ఉంటే, పూర్తి చేసే పడుకునేవాడు.
ఎన్ని పుస్తకాలు చదివి, విమర్శలు రాశాడో అతనికే లెక్క లేదు. ఆ విమర్శాత్మక వ్యాసాలన్నింటినీ సేకరించి కొన్ని విమర్శా గ్రంథాలను వెలువరించాడు. అనేక కథా సంకలనాలు, కొన్ని కవితా సంకలనాలు, మూడు జీవిత చరిత్రలు ఇలా శేషగిరి ఒకటి రెండు రచనలైనా ప్రతి సంవత్సరం విడుదల అవుతూనే ఉండేవి. ఈ మధ్య స్మార్ట్‌ఫోన్ వచ్చాక కవులతో అతని స్నేహం మరింత పెరిగింది. వేరే వేరే ఊర్లలో జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమాలకు అతిథిగా కూడా వెళ్లేవాడు. కాని, కవితల లోకంలో మునిగి ఉన్న తన భర్త, మానసగంగ అనే కవయిత్రితో రహస్యంగా చాటింగ్ చేస్తున్నాడనే చిన్న అనుమానం కూడా సౌదామినికి రాలేదు. దానికి కారణం వారిద్దరి మధ్య ఉన్న వయస్సు అంతరం! మానసగంగకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు, శేషగిరికి యాభై రెండు!
∙∙
కూతురు తన మొబైల్‌కు పంపిన అన్ని మెసేజ్‌లను చదివిన తర్వాత, సౌదామినికి భర్తపై అంతులేని కోపం వచ్చింది. తానేం తక్కువ చేశానని తన భర్త ఇలా ఆమెతో సరస సల్లాపాలు మొదలుపెట్టాడో ఆమెకు అర్థం కాలేదు. తనకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేసే ఇరవై మూడు సంవత్సరాల కూతురు ఉన్నా, తాను ఇంకా అందాన్ని కోల్పోలేదు. ఇప్పటికీ నాజూకైన తీగలా సన్నగా, తెల్లగా, లక్షణంగా ఉన్న తాను తన భర్త దృష్టిలో పాతబడిపోయానా? లేదా ఆ మానసగంగ అంతలా మార్చివేసిందా? చాటింగ్ మొదలుపెట్టింది ఆమెనే. తన కవితలను కొన్ని పంపి ‘ఎలా ఉన్నాయో చూడండి సర్’ అని పెట్టింది. శేషగిరి వాటి లోటుపాట్లను సరిచేసి పంపినప్పుడు, దాన్ని పత్రికలకు పంపి పేరు సంపాదించుకుంది.
అలా ప్రచురించబడిన కవితలను మళ్లీ శేషగిరికి పంపి ‘దీని క్రెడిట్ మీకే చెందాలి’ అని ఒక హృదయం ఎమోజీ పెట్టింది.శేషగిరికి మరో అలవాటు ఉండేది. ఇంటర్నెట్‌లో దొరికే అందమైన అమ్మాయిల ఫొటోలకు, ప్రకృతి ఫొటోలకు తగిన కవిత రాసి దాన్ని తన స్టేటస్‌లో, వాట్సప్ గ్రూప్‌లో పెట్టే అలవాటు! కాని, ఈ మానసగంగ అతని కవిత్వానికి సవాలు విసిరినట్లు, మరులుగొలిపే అందమైన చీర కట్టుకున్న, జుట్టు వదిలేసిన, పెదవులకు రంగు అద్దుకున్న, ఆకర్షణీయమైన భంగిమల్లో తన ఫోటోలు పంపి ‘దీనిపై ఒక కవిత రాయండి చూద్దాం’ అని మెసేజ్ చేసినప్పుడు, శేషగిరి బుద్ధిమంతుడైన విద్యార్థిలా ఆ ఫొటోలన్నింటికీ ఆమె సౌందర్యాన్ని కొంచెం ఎక్కువే అనిపించేంతగా పొగిడి, శృంగారమయంగా కవితలు రాసి ఆమెకు పంపాడు.
ఆ కవితలను చదివిన సౌదామిని గుండెలో అగ్నిపర్వతం బద్దలయ్యింది.సౌదామిని కన్నీళ్లు కారుస్తూ, స్వర రూమ్‌కు వచ్చి మంచంపై కుప్పకూలి కూర్చుంది. ‘‘నేను మీ నాన్నను దేవుడి లాంటి మనిషి అని నమ్మడం పెద్ద పొరపాటైంది. ఈ రోజు ఆయన ఇంటికి రానివ్వు. చెప్తాను. ఆయనకు. ఇరవై ఐదు సంవత్సరాలు నిష్ఠతో ఆయనతో సంసారం చేసినందుకు ఆయన నాకు మంచి బహుమతినే ఇచ్చారు. కవి సమ్మేళనం పేరుతో ఆమెతో సరసాలాడటానికి వెళ్తున్నారని నాకు ఈ రోజు తెలిసింది. అదీ నువ్వు చెప్పిన తర్వాత...’’ అని వెక్కివెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది.
‘‘ఏడవొద్దమ్మా, అలాంటిదేం జరగలేదు...’’‘‘ఇంకేం జరగాలి...? ఆమె ఫొటోలన్నింటికీ అంత శృంగారమయమైన కవితలు రాశారు మీ నాన్న... ఇంకొన్ని రోజులు పోతే నన్ను కూడా ఇంటి నుంచి బయటికి తరిమేస్తుందేమో వగలాడి. ఆ రోజు ఆ ఆడవాళ్లు ఈమె గురించి ఆడిన మాటలు అబద్ధం కాదు...’’ సౌదామిని పళ్లు కొరుకుతూ చెప్పింది.‘‘అమ్మా, వాళ్లిద్దరి మధ్య అలాంటిదేం జరగలేదు. డోంట్ వర్రీ. నువ్వు నాన్న హృదయంలో ఖాళీగా వదిలిన స్థలాన్ని ఆమె ఆక్రమించింది అంతే. ప్రతి మనిషికి తన భావాలకు స్పందించే, తనను మెచ్చుకునే ఒక సోల్ మేట్ అవసరం ఉంటుంది. కళాకారులకు, కవులకు అలాంటి ఒక ఆత్మసఖుడు లేదా ఆత్మసఖి అవసరం ఎక్కువగా ఉంటుంది. కాని నువ్వు నాన్న కవితలను మెచ్చుకోలేదు, ఆయనలోని భావాలకు విలువ ఇవ్వలేదు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచో దాని గురించి లోలోపల బాధపడి ఉండాలి.
అలాంటి సమయంలో మానసగంగ ఆయన కవితలను మెచ్చి, అప్పుడప్పుడు గిలిగింతలు పెట్టే మెసేజ్‌లు చేస్తూ ఆయనకు దగ్గరైంది. కాని ఒక మాట మాత్రం నిజం. ఆమెతో చాటింగ్ చేసినప్పుడు బహుశా నాన్న మనసుకు ఏదో రిలాక్స్ ఫీల్ అవుతూ ఉండవచ్చు. అది తప్ప నాన్న ఆమెకు ఎక్కడా అశ్లీలంగా మెసేజ్ చేయలేదు... దాన్ని నువ్వు మర్చిపోవద్దు.’’‘‘ఊ, అదీ నిజమే. నేను ఆయనను అర్థం చేసుకోవాల్సింది. ఇప్పటికైనా నేను ఆయనకు ఒక ఫ్రెండ్‌గా అయ్యే, ఆయన తమ ఫీలింగ్స్‌ను పంచుకోవాలనుకునే ఆత్మసఖిగా అయ్యే ప్రయత్నం చేస్తాను. రేపు మీ నాన్నతో సాహిత్య కార్యక్రమానికి వెళ్తాను. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ నాన్న కవితలను, కథలను చదువుతాను. పాపం, ఊరంతా పొగిడే ఆయనను నేను ఒక్క రోజు కూడా మెచ్చుకోలేదు, పొగడలేదు...’’ సౌదామిని మనస్ఫూర్తిగా బాధపడుతూ పలికింది.
‘‘నాన్నా, మీకు ఒక సర్‌ప్రైజ్. రేపు విజయవాడ లిటరరీ ఫెస్టివల్‌కు మీతో పాటు అమ్మ కూడా వస్తుందంట...’’ భోజనం చేస్తూ స్వర చెప్పినప్పుడు శేషగిరి నవ్వుతూ, ‘‘మీ అమ్మ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడానికి వస్తుండాలి. ఆమెకు నా కవితల గురించి ఆసక్తి ఎక్కడుంది?’’ అన్నాడు.‘‘అయ్యో లేదులెండి, ఈ రోజు మీ బుక్ షెల్ఫ్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మీదొక కవితా సంకలనం దొరికింది. కొన్ని కవితలు చదివినప్పుడు చాలా ఇష్టమైంది... అందుకే నేను రేపు వద్దాం అని...’’ చెప్పింది సౌదామిని.శేషగిరి తనతో పాటు వచ్చే మరో ఇద్దరు కవులకు, మానసగంగకు తాను భార్య, కూతురితో కలిసి విజయవాడకు వస్తున్నానని, వారు వేరే కారు ఏర్పాటు చేసుకోవాలని మెసేజ్ చేశాడు.
కారు వెనుక సీట్లో కూర్చున్న స్వర, ల్యాప్‌టాప్‌లో ఏదో వెబ్ సిరీస్ చూడటంలో లీనమైంది. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న శేషగిరి తన పక్కన కూర్చున్న సౌదామిని మిరుమిట్లుగొలిపే సౌందర్యాన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఈ రోజు సౌదామిని, తాను కట్టుకున్న ఆకాశనీలం రంగు డిజైనర్ చీరలో, కూతురు ఆసక్తిగా చేసిన మేకప్‌లో శేషగిరి కళ్లకు అతిలోక సుందరిగా కనిపించింది.
పుస్తకావిష్కరణ, ఉపన్యాసం ముగిసిన తర్వాత, కవి సమ్మేళనంలో శేషగిరి భార్యపై ఒక అందమైన ఆశుకవిత వినిపించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. కార్యక్రమం చివర్లో ‘మేడమ్, శేషగిరిగారు ప్రణయ కవులు. మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది, ఇంత అందమైన భార్య ఉన్నప్పుడు ఆయన ప్రేమ కవితలు రాయకుండా ఉంటారా’ అని ఒకరిద్దరు పొగిడినప్పుడు సౌదామిని సిగ్గుపడింది. అయితే శేషగిరి ‘నిజం. నేను పెళ్లైన కొత్తల్లో ప్రచురించిన మూడు కవితా సంకలనాలు నా భార్య గురించే’ అన్నప్పుడు అవాక్కవడం సౌదామిని వంతు అయ్యింది.
∙∙
ఇప్పుడు సౌదామినికి తీరికే లేదు. ఆమె ఇప్పుడు భర్తతో పాటు సాహిత్యానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ వెళ్తుంది. ఆసక్తిగా ఫొటోలు తీస్తుంది, అతని ఉపన్యాసం వీడియో చేసి తన ఫ్యామిలీ గ్రూప్‌కు షేర్ చేస్తుంది. నెమ్మదిగా ఆమెకు కూడా ఇప్పుడు సాహిత్యంపై ఆసక్తి మొదలైంది. భార్యలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పు శేషగిరిలో మరింత హుషారును నింపింది.మొన్న మొన్ననే తెనాలిలో జరిగిన నెలనెలా వెన్నెల కార్యక్రమానికి వెళ్లిన సౌదామిని కళ్లు మానసగంగ కోసం వెతికాయి. ఊహూ! ఆమె రాలేదు. అంతేకాదు, సౌదామిని భర్తకు తెలియకుండా ఆయన మొబైల్ కూడా చెక్ చేసి చూసింది. విజయవాడ కవి సమ్మేళనం తర్వాత మానసగంగ శేషగిరికి మళ్లీ మెసేజ్ చేయలేదు. ‘కవిత రాయండి’ అని తన అందమైన ఫోటో కూడా పంపడం మానేసింది.


