కథాకళి: నాతిచరామి | Kathakali Funday Story | Sakshi
Sakshi News home page

కథాకళి: నాతిచరామి

Feb 15 2026 12:45 PM | Updated on Feb 15 2026 12:45 PM

Kathakali Funday Story

నా మిత్రుడు లీలాచరణ్‌ మందు మానేశాడని విని నేను నమ్మలేదు. అదే నిజమైతే అది ప్రపంచంలో ఎనిమిదో వింత అవుతుంది. లీలాచరణ్‌ భార్య, తల్లిదండ్రులు, స్నేహితులు, వాడితో పరిచయం ఉన్న ఎవరికైనా అది నమ్మలేని నిజమే. లీలాచరణ్‌ వయసు డెబ్బె ఏడు. వాడిని వాడు అంటున్నానంటే నా వయసుని మీరు ఊహించొచ్చు.నా కో–స్టూడెంట్‌గా పరిచయమయ్యే నాటికే లీలాచరణ్‌కి ఆల్కహాల్‌ అలవాటు ఉంది. అప్పుడే కొత్తగా ఆంధ్రాలో ప్రొహిబిషన్‌  తీసేశారు. ఓసారి మేథ్స్‌ టీచర్‌ వాడి నుంచి వాసన వస్తూంటే పట్టుకున్నప్పుడు మాకా సంగతి తెలిసింది. వాడి తండ్రి విద్యుత్‌ శాఖలో ఏదో కీలకమైన పోస్ట్‌లో ఉండడంతో పైసంపాదన చాలా వచ్చేది. పిల్లల మీద ప్రేమతో ఆయన వాళ్ళు అడిగినంత కాదనకుండా ఇస్తూండేవారు. 

లీలాచరణ్‌ తను తాగడమే కాక, కంపెనీకి మమ్మల్ని తన వెంట తీసుకెళ్ళి మా డ్రింక్‌ ఖర్చు కూడా తనే భరించేవాడు. నేను, మా క్లాస్‌లో చాలామంది మొదటిసారి మందు తాగింది లీలాచరణ్‌తోనే. ఆ కారణంగా లీలాచరణ్‌ మిత్రబృందం ఓ మందలా ఉండేది. కాలేజ్‌లో కూడా లీలాచరణ్‌ నా క్లాస్‌మేట్‌. వయసు పెరిగే కొద్దీ వాడిలో మందు అలవాటు కూడా పెరగసాగింది. లీలాచరణ్‌ తాగుడికి పరాకాష్ట గురించి చెప్పడానికి రెండు మూడు సంఘటనలని ఉదహరిస్తే చాలు. పెళ్ళిరోజున వాడు ఇంట్లోంచి మాయమయ్యాడు. మా మిత్రబృందం రైలు పట్టాల దగ్గర కూర్చుని తాగుతున్నవాడిని వెతికి తెచ్చాం.‘‘ఒరేయ్‌. బార్‌లో ఉంటే నన్ను పట్టుకుంటారని ఇక్కడికి వస్తే ఇక్కడా తగలడ్డారా మిత్రద్రోహుల్లారా!’’ దారిలో వాపోయాడు.

ఈ కాలం పెళ్ళికూతుళ్లయితే ‘వాడికి నాకంటే మందు ముఖ్యమా? ఆ సీసాకి తాళి కట్టమనండి’ అని కోపంగా అరిచి వెళ్ళిపోయేవాళ్ళు. కాని 1970లలోని ఆడపిల్లల పరిస్థితి వేరు.వాడి తాగుబోతుతనాన్ని ఉదహరించదగ్గ రెండో సంఘటన. లీలాచరణ్‌ ఆ రాత్రి పన్నెండున్నరైనా ఇంటికి రాలేదని, వెతకమని మా ఇంటివారికి ఫోన్‌  చేసి నాకు చెప్పమని అతని భార్య చెప్పింది. నేను వెంటనే చెప్పులు తొడుక్కుని వెతకడానికి బయలుదేరాను. వాడు వెళ్ళే అన్ని బార్లకి వెళ్ళాను. ఓ బార్‌లోని వాళ్ళు చెప్పారు.‘‘మీవాడు చాలా తాగాడండి. ఎంత తాగాడంటే ఒంటి మీది లుంగీ ఊడిపోయిందని కూడా చూసుకోకుండా వెళ్ళిపోయాడు.’’నేను రోడ్లన్నీ తిరుగుతూంటే ఒంటి మీద కేవలం చొక్కా మాత్రమే ఉన్న, అండర్‌వేర్‌ కూడా లేని లీలాచరణ్‌ ఓచోట లైట్‌ స్తంభంతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు.

మరో సంఘటన, స్కూటర్ని నడుపుతూ దాన్ని ఓ లారీ కిందకి పోనించాడు. వాడి అదృష్టం, స్కూటర్‌ పిప్పి పిప్పి అయింది కాని వాడికి ఏం కాలేదు. వాడు ఇంటికి శంషాద్‌ బేగం పాట ‘తుమ్హారీ యాద్‌ సతాతీ హై’ అని పాడుతూ చేరుకున్నాడు.అతని భార్య సాధ్వి అనే పదానికి సరైన నిర్వచనం. నాతిచరామి అనే వాగ్దానానికి వాడు కట్టుబడి లేడు. వాడిని తాగద్దు అంటే మండిపడతాడని గ్రహించిన ఆవిడ పెళ్ళైన మూడో నెల నించే ఆ మాటని మానుకుంది.  ‘‘మిత్రమా. నాకు రమ్మంటే ప్రాణమా లేక నా భార్యంటే ప్రేమా అన్నది తెలుసుకోలేకపోతున్నాను. 

ఆ రెంటిలో ఏది లేకపోయినా జీవించలేను.’’ తాగనప్పుడు ఓసారి నాకు చెప్పాడు.అలాంటి లీలాచరణ్‌ మందు మానేశాడని, అది నిజమని తెలిశాక నేను వాడి ఇంటికి వెళ్ళాను.‘‘నా నుంచి ఎప్పటిలా ఏ సువాసనలు రానందుకు మన్నించు మిత్రమా.’’ నన్ను చూసి నవ్వుతూ చెప్పాడు.‘‘నిజమేనన్న మాట?’’ అడిగాను.‘‘చిత్తం. నా చిత్తాన్ని కత్తితో నరికి పారేశాను.’’‘‘ఇంత కాలానికి ఆ కత్తి ఎలా దొరికింది?’’ ప్రశ్నించాను.‘‘ఓసారి అన్నా గుర్తుందా, నాకు ఆ రెంటిలో దేని మీద ఎక్కువ ప్రేమో తెలీడం లేదని? ఇప్పుడు తెలిసింది. నా భార్య అంటేనే ప్రేమ.’’ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.‘‘నీ తాగుడు ఆమెకి ఇష్టం లేదని ఇంత కాలానికి గ్రహించి మానేశావంటే నమ్మను. డాక్టర్‌ ఇంకా ఎన్ని రోజులని చెప్పారు?’’ నవ్వుతూ అడిగాను.‘‘ఆరోగ్యం చెడింది నాకు కాదు. 

మా ఆవిడకి. తనకి బ్రెయిన్‌  స్ట్రోక్‌ వచ్చింది. ఆ సమయంలో నేను తాగిన మత్తులో ఉండడంతో గోల్డెన్‌  అవర్‌లో కాక, ఆలస్యంగా మర్నాడు మధ్యాహ్నం హాస్పిటల్‌కి తీసుకెళ్ళబట్టి కాళ్ళు చచ్చుపడ్డాయి. వెంటనే తేవాల్సిందని డాక్టర్‌ మందలించాడు. ప్రతి రాత్రి మూడు దాటాక ఆవిడని బాత్రూంకి తీసుకువెళ్ళాలి. మనిషి సహాయం లేకుండా నడవలేదు. కాబట్టి మేలుకుని ఉండాలని మందు మానేశాను.’’‘అయ్యో’ అనకుండా ఉండలేకపోయాను.‘‘దేవదాసు, రోమియోలని మించిన ప్రేమ నీది.’’ మనస్ఫూర్తిగా చెప్పాను.

‘‘నాది కాదురా పిచ్చి వెధవా. పార్వతీ, జూలియట్లని మించిన ప్రేమ మా ఆవిడది. చాలాకాలం క్రితం ఆవిడకి అనారోగ్యం వచ్చినప్పుడు, డాక్టర్‌ ప్రతి రాత్రి తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పిన మాత్రని నా మీద ప్రేమతో వేసుకోవడం మానేసింది. ఆ మాత్రలో నిద్రని కలిగించే లక్షణం ఉంది. నేను తాగినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఇంటికి వస్తానో, అసలు వస్తానో, రానో ఆ సమయంలో తను మెలకువగా ఉండాలని దాన్ని వేసుకోవడం మానేసింది. దాంతో డాక్టర్‌ హెచ్చరించినట్లుగానే ఆవిడ రోగం ఇంత దూరం వచ్చింది. ఆ సంగతి నాకు చెప్పి ఉంటేనా...’’నవ్వుతూ చెప్పినా లీలాచరణ్‌ కళ్ళల్లో తడిని స్పష్టంగా చూశాను. 

∙మల్లాది వెంకట కృష్ణమూర్తి  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement