కరాచీలోని ఇస్లామిక్ యూనివర్సిటీ జామియా ఉలూమ్–ఉల్–ఇస్లామియా నుంచి జీహాదీ గ్రూప్ హర్కత్ ఉల్ అన్సారీలోకి వెళ్లిన ముహమ్మద్ మసూద్ అజర్ అల్వీ చివరకు హర్కత్ ఉల్ ముజాహిదీన్‌లో (హెచ్‌యూఎం) చేరాడు. హర్కత్–ఉల్–జిహాద్ అల్–ఇస్లామీ, హర్కత్–ఉల్– ముజాహిదీన్ గ్రూపుల మధ్య తారస్థాయికి చేరిన విభేదాలను సెటిల్ చేయడానికి 1994లో భారత్ వచ్చి పట్టుబడ్డాడు. అజర్‌తో పాటు అతడిని విడిపించడానికి ప్రయత్నించిన అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, శ్రీనగర్‌లో చిక్కిన మరో ఉగ్రవాది అహ్మద్ జర్గర్... ముగ్గురూ ఢిల్లీలోని తీహార్ జైలుకు చేరారు. అక్కడే వీరికి కిడ్నాపింగ్ గ్యాంగ్ నిర్వాహకుడు ఆఫ్తాబ్ అన్సారీతో పరిచయం ఏర్పడింది. ఇదే పార్థప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్‌కు కారణమైంది. ఇతడి కుటుంబీకుల నుంచి వసూలు చేసిన మొత్తం నుంచి రూ.కోటి అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్‌గా చేరాయి. అదెలాగంటే?
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఆఫ్తాబ్ అన్సారీ ముంబైలో ఉంటూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన నేరగాళ్లతో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకునే అన్సారీ కిడ్నాప్‌లు, స్మగ్లింగ్ చేస్తూ ధనార్జనే ధ్యేయంగా బతికేవాడు. ప్రస్తుతం అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఉన్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని సైతం అన్సారీ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అప్పుడప్పుడే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న గౌతమ్ అదానీ 1998 జనవరిలో తన స్నేహితుడు శాంతిలాల్ పటేల్‌తో కలిసి అహ్మదాబాద్‌లోని కర్ణావతి క్లబ్ నుంచి బయటకు వస్తుండగా, అన్సారీ ఆదేశాల మేరకు అక్కడే కాపు కాసిన అతడి అనుచరులు ఫజల్ ఉర్ రెహ్మాన్, భోగీలాల్ దర్జీ తుపాకీతో బెదిరించి కారులో అపహరించారు. వారి విడుదల కోసం రూ.15 కోట్లు డిమాండ్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య అదే రోజు సాయంత్రం అదానీ, పటేల్ ఇరువురూ విడుదలయ్యారు. ఇలాంటి ఎన్నో నేరాలు చేసిన అన్సారీ అప్పటి వరకు ఓ నేరగాడు మాత్రమే. కోల్‌కతాకు చెందిన ఆసిఫ్ రజా ఖాన్... అన్సారీ గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరించేవాడు. ఓ కేసులో ఢిల్లీ పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేయడంతో తీహార్ జైలుకు చేరారు.
ఆ జైలు అధికారులు అజర్, ఒమర్‌లతో పాటు అన్సారీ, ఆసిఫ్‌లను ఒకే హై సెక్యూరిటీ ప్రిజన్‌లో ఉంచారు. అన్సారీ గ్యాంగ్, అతడి కార్యకలాపాలు తెలుసుకున్న ఆ ఉగ్రద్వయం అతడితో పాటు ఆసిఫ్‌కు బ్రెయిన్ వాష్ చేసి, ఇకపై జీహాద్ కోసం నేరాలు చేసేలా ప్రేరేపించింది. ప్రతి నేరం నుంచి కొంత మొత్తం జీహాదీ కార్యకలాపాలకు విరాళం ఇచ్చేలా వారిని ఒప్పించింది. ఇదిలా ఉండగా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 814 విమానం 1999 డిసెంబర్ 24న నేపాల్ రాజధాని కఠ్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తూ హైజాక్ అయింది. ఇది తమ పనేనంటూ పాకిస్తాన్‌కు చెందిన హర్కతుల్ ముజాహిదీన్ ప్రకటించుకున్నా, కేవలం అజర్ కుటుంబీకులు, ఐఎస్‌ఐ మద్దతుతో చేశారని నిఘా వర్గాలు చెప్పుకున్నాయి. అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ విమానాశ్రయంలో ఈ విమానాన్ని నిలిపిన ఉగ్రవాదులు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, వారం రోజుల తర్వాత అజర్, జర్గర్, ఒమర్‌లను విడుదల చేయించారు. తనను విడిపించడంలో హర్కతుల్ ముజాహిదీన్ స్పందన నచ్చని అజర్ తానే సొంతంగా జైషే మహ్మద్ సంస్థను స్థాపించాడు.
పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన అజర్... అల్ కాయిదాలో చేరిన ఒమర్... అక్కడ ఉన్న అన్సారీ, అసిఫ్‌లతో సంబంధాలు కొనసాగించారు. అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేస్తూ ఇక్కడ పలు నేరాలు చేయించారు. అందులో ఒకటే ఖాదిమ్స్ సంస్థ యజమాని, అప్పట్లో దానికి వైస్ చైర్మన్‌గా ఉన్న పార్థ ప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్. అమెరికాలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్న అల్ కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ దానికి అవసరమైన నిధులు సమీకరించే బాధ్యతలు అనేక మందికి అప్పగించాడు. ఆ ఫండ్ రైజర్స్‌లో ఒమర్ కూడా ఒకడు కావడంతో అన్సారీ, ఆసిఫ్ తెరపైకి వచ్చారు. అమెరికాలో భారీ ఆపరేషన్ చేయనున్నామని, అందుకు విరాళం కావాలంటూ ఒమర్ ఇచ్చిన ఆదేశాలతో అన్సారీ, ఆసిఫ్‌లు 2001 జూలై 25న బర్మన్‌ను కిడ్నాప్ చేశారు.
అప్పటికే దుబాయ్‌కి మకాం మార్చేసిన ఆఫ్తాబ్ అక్కడ నుంచే ఆసిఫ్ గ్యాంగ్‌తో కథ నడిపించాడు. బర్మన్ కోల్‌కతాలోని తిల్జాలాలో ఉన్న తన కంపెనీ గోదాముకు వెళ్తుండగా ఆసిఫ్ గ్యాంగ్ అపహరించింది. అతడిని విడుదల చేయడానికి రూ.5 కోట్లు డిమాండ్ చేయగా, రూ.3.75 కోట్లకు బేరం కుదిరింది. ఈ మొత్తం హవాలా ద్వారా హైదరాబాద్ చేరింది. ఇక్కడ నుంచి రూ.కోటి దుబాయ్ వెళ్లగా, మిగిలిన మొత్తం కోల్‌కతా చేరింది. దుబాయ్ వెళ్లిన రూ.కోటి అక్కడ నుంచి బెల్జియం మీదుగా అమెరికాలో ఉన్న అల్ కాయిదా అనుచరులకు అందింది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 2001 సెప్టెంబర్ 11న జరిగిన ‘9/11 ఎటాక్స్’కు ఈ నగదు కూడా వినియోగించినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేన్ (ఎఫ్‌బీఐ) విచారణలో తేలింది. ఈ కారణంగానే బర్నన్ కిడ్నాప్ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా సాక్షిగా ఉన్నాడు.
ఐఎంగా ఏఆర్‌సీఎఫ్!
(ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పూర్తిగా ఉగ్రవాద బాటపట్టిన ఆసిఫ్ రజా ఖాన్ 2002లో కోల్‌కతాలో ఉన్న అమెరికన్ కల్చరల్ సెంటర్‌పై దాడి చేశాడు. ఆపై రాజ్‌కోట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. దీనికి ప్రతీకారంగా ఆసిఫ్ సోదరుడు అమీర్ రజా ఖాన్ ఏర్పాటు చేసిన ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) కాలక్రమంలో దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మారింది. అదెలా..? దీని ఘాతుకాలు ఏంటి? పార్ట్–3లో...)


