డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. మలికిపురం మండలం ఇరుసుమండలో మోరి-5 ఓఎన్జీసీ బావిలో డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో భారీ శబ్దంతో అగ్నికీలలు విరుచుకుపడ్డాయి. గ్యాస్ లీక్ కారణంగా ఘటనా స్థలంలో మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. మంటలపై అగ్నిమాపక యంత్రాలతో నీటిని విరజిమ్మే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. బ్లోఅవుట్‌ను పూర్తిగా నియంత్రించేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లోఅవుట్ అంటే ఏంటి?.. అతిపెద్ద బ్లోఅవుట్ ప్రమాదాలు ఎక్కడ జరిగాయి?..
బ్లోఅవుట్ అంటే ఏంటి?.
బ్లోఅవుట్ అనే పదానికి వాడుకని బట్టి వేర్వేరే అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్లోఅవుట్ అంటే పేలుడు అనే అర్థం వస్తుంది.
గ్యాస్ లీక్ బ్లోఅవుట్: బ్లోఅవుట్ అగ్ని ప్రమాదం (Blowout Fire Accident) అనేది ఆయిల్ & గ్యాస్ పరిశ్రమలో అత్యంత ప్రమాదకర సంఘటనల్లో ఒకటి. ఇది వెల్‌లోని ప్రెషర్ నియంత్రణ తప్పిపోవడం వల్ల చమురు లేదా గ్యాస్ ఒక్కసారిగా బయటకు రావడం, ఆ తర్వాత అది మంటలు అంటుకోవడం ద్వారా జరుగుతుంది.
టైర్ బ్లోఅవుట్: వాహనం టైర్ అకస్మాత్తుగా పగిలిపోవడం లేదా గాలి ఒక్కసారిగా బయటకు రావడం. ఇది అధిక వేగం, అధిక ఉష్ణోగ్రత, లేదా టైర్‌లో లోపం వల్ల జరుగుతుంది. ప్రమాదకర పరిస్థితి, వాహనం నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది.
బ్లోఅవుట్‌కు కారణాలు..
ప్రెషర్ నియంత్రణ లోపం: డ్రిల్లింగ్ సమయంలో వెల్‌లోని ప్రెషర్‌ను సరైన విధంగా నియంత్రించకపోవడం
Blowout Preventer (BOP) విఫలం: వెల్‌ను మూసివేయడానికి ఉపయోగించే పరికరం పనిచేయకపోవడం.
సిమెంటింగ్ లోపాలు: వెల్‌లో గ్యాస్/ఆయిల్ లీక్ కాకుండా సిమెంట్ బారియర్ బలహీనంగా ఉండడం.
మానవ తప్పిదాలు: ఆపరేటర్లు సరైన పద్ధతిలో పరీక్షలు చేయకపోవడం లేదా అత్యవసర పరిస్థితిని గుర్తించకపోవడం.
బ్లోఅవుట్ ప్రభావం ఎలా..
మంటలు: వెల్‌హెడ్ వద్ద చమురు/గ్యాస్ మంటలు అంటుకోవడం.
మరణాలు/గాయాలు: కార్మికులు ప్రాణాలు కోల్పోవడం లేదా తీవ్ర గాయాలు పొందడం.
పర్యావరణ నష్టం: చమురు లీక్ వల్ల సముద్ర జీవులు, తీరప్రాంతాలు ప్రభావితం అవుతాయి.
ఆర్థిక నష్టం: కంపెనీలకు బిలియన్ల డాలర్ల నష్టం, శుభ్రపరిచే ఖర్చులు.
అతిపెద్ద బ్లోఅవుట్ ప్రమాదాలు..
పైపర్ ఆల్ఫా ప్రమాదం: పైపర్ ఆల్ఫా (Piper Alpha.. UK) ఘటన ప్రపంచంలోనే అతిపెద్ద బ్లోఅవుట్ ఘటన. ఇది చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఆఫ్‌షోర్ ఆయిల్ & గ్యాస్ ప్రమాదం. ఈ ఘటన యూకేలోని ఉత్తర సముద్రంలో 1988 జూలై 6న జరిగింది. ఈ ప్రమాదంలో గ్యాస్ లీక్, మంటల కారణంగా 167 మంది కార్మికులు మృతి చెందారు. 61 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. భారీ మొత్తంలో ఆర్థిక నష్టం జరిగింది. ఈ ప్రమాదం సందర్భంగా వరుసగా పేలుళ్లు జరిగి, రెండు గంటల్లోనే మొత్తం నిర్మాణం కూలిపోయింది. సముద్రంలో భారీగా చమురు, గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించాయి.
డీప్ వాటర్ హారిజాన్ ప్రమాదం: డీప్ వాటర్ హారిజాన్ ప్రమాదం అమెరికాలోని గల్ప్ ఆప్ మెక్సికో ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. ఈ ఘటన 20 ఏప్రిల్ 2010న చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 4.9 మిలియన్ బ్యారెల్స్ చమురు సముద్రంలోకి లీక్ అయింది. అనంతరం మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా పర్యావరణం, సముద్ర జీవులు మరణించాయి. తీరప్రాంత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన నష్టం జరిగింది.
దేశాన్ని వణికించిన పాశర్లపూడి బ్లోఅవుట్..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలం పాశర్లపూడిలో 1995 జనవరి 8వ తేదీన బ్లోఅవుట్ ఘటన చోటుచేసుకుంది. ఆనాడు ఓఎన్జీసీ వాళ్ళ చమురు అన్వేషణలో భాగంగా డ్రిల్లింగ్ జరుగుతున్న సమయంలో 19వ సెక్టార్‌లో జరిగిన చిన్న పొరపాటు భారీ ప్రమాదానికి దారి తీసింది. భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటల తాకిడికి కొబ్బరి చెట్లు అంటుకొని క్షణాల్లో అగ్నికి ఆహుతి అయిపోయాయి. బ్లోఅవుట్ కారణంగా చుట్టుపక్కల జనం ఇళ్లు వదిలి పారిపోయారు. ఊళ్లకు ఊళ్లు తరలించాల్సి వచ్చింది. రాత్రి పూట కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళను కూడా ఆ అగ్ని కీలలు కనబడుతూ భయపెట్టేవి. ఓఎన్జీసీ నిపుణులు ఈ బ్లోఅవుట్ ఆర్పటానికి శతవిధాలా ప్రయత్నించి చేతులెత్తేశారు. ఇక లాభం లేదని విదేశాల నుంచి నిపుణులను రప్పించారు. అలా 65 రోజుల తరువాత గాని బ్లోఅవుట్‌ను పూర్తిగా ఆర్పలేకపోయారు. అంటే మార్చి 15కు గాని పరిస్థితి అదుపులోకి రాలేదు.
నివారణ చర్యలు..
Blowout Preventer పరికరాలను తరచుగా పరీక్షించడం.
వెల్ డిజైన్, సిమెంటింగ్ ప్రమాణాలను కఠినంగా పాటించడం.
అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికలు సిద్ధంగా ఉంచడం.
సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, మాక్ డ్రిల్స్ నిర్వహించడం.


