breaking news
konasema
-
బ్లోఅవుట్ అంటే.. అతిపెద్ద ప్రమాదం ఎక్కడంటే?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. మలికిపురం మండలం ఇరుసుమండలో మోరి-5 ఓఎన్జీసీ బావిలో డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో భారీ శబ్దంతో అగ్నికీలలు విరుచుకుపడ్డాయి. గ్యాస్ లీక్ కారణంగా ఘటనా స్థలంలో మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. మంటలపై అగ్నిమాపక యంత్రాలతో నీటిని విరజిమ్మే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. బ్లోఅవుట్ను పూర్తిగా నియంత్రించేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లోఅవుట్ అంటే ఏంటి?.. అతిపెద్ద బ్లోఅవుట్ ప్రమాదాలు ఎక్కడ జరిగాయి?.. బ్లోఅవుట్ అంటే ఏంటి?.బ్లోఅవుట్ అనే పదానికి వాడుకని బట్టి వేర్వేరే అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్లోఅవుట్ అంటే పేలుడు అనే అర్థం వస్తుంది. గ్యాస్ లీక్ బ్లోఅవుట్: బ్లోఅవుట్ అగ్ని ప్రమాదం (Blowout Fire Accident) అనేది ఆయిల్ & గ్యాస్ పరిశ్రమలో అత్యంత ప్రమాదకర సంఘటనల్లో ఒకటి. ఇది వెల్‌లోని ప్రెషర్ నియంత్రణ తప్పిపోవడం వల్ల చమురు లేదా గ్యాస్ ఒక్కసారిగా బయటకు రావడం, ఆ తర్వాత అది మంటలు అంటుకోవడం ద్వారా జరుగుతుంది.టైర్ బ్లోఅవుట్: వాహనం టైర్ అకస్మాత్తుగా పగిలిపోవడం లేదా గాలి ఒక్కసారిగా బయటకు రావడం. ఇది అధిక వేగం, అధిక ఉష్ణోగ్రత, లేదా టైర్లో లోపం వల్ల జరుగుతుంది. ప్రమాదకర పరిస్థితి, వాహనం నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది.బ్లోఅవుట్‌కు కారణాలు.. ప్రెషర్ నియంత్రణ లోపం: డ్రిల్లింగ్ సమయంలో వెల్‌లోని ప్రెషర్‌ను సరైన విధంగా నియంత్రించకపోవడంBlowout Preventer (BOP) విఫలం: వెల్‌ను మూసివేయడానికి ఉపయోగించే పరికరం పనిచేయకపోవడం.సిమెంటింగ్ లోపాలు: వెల్‌లో గ్యాస్/ఆయిల్ లీక్ కాకుండా సిమెంట్ బారియర్ బలహీనంగా ఉండడం.మానవ తప్పిదాలు: ఆపరేటర్లు సరైన పద్ధతిలో పరీక్షలు చేయకపోవడం లేదా అత్యవసర పరిస్థితిని గుర్తించకపోవడం.బ్లోఅవుట్ ప్రభావం ఎలా.. మంటలు: వెల్‌హెడ్ వద్ద చమురు/గ్యాస్ మంటలు అంటుకోవడం.మరణాలు/గాయాలు: కార్మికులు ప్రాణాలు కోల్పోవడం లేదా తీవ్ర గాయాలు పొందడం.పర్యావరణ నష్టం: చమురు లీక్ వల్ల సముద్ర జీవులు, తీరప్రాంతాలు ప్రభావితం అవుతాయి.ఆర్థిక నష్టం: కంపెనీలకు బిలియన్ల డాలర్ల నష్టం, శుభ్రపరిచే ఖర్చులు.అతిపెద్ద బ్లోఅవుట్ ప్రమాదాలు..పైపర్ ఆల్ఫా ప్రమాదం: పైపర్ ఆల్ఫా (Piper Alpha.. UK) ఘటన ప్రపంచంలోనే అతిపెద్ద బ్లోఅవుట్ ఘటన. ఇది చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఆఫ్‌షోర్ ఆయిల్ & గ్యాస్ ప్రమాదం. ఈ ఘటన యూకేలోని ఉత్తర సముద్రంలో 1988 జూలై 6న జరిగింది. ఈ ప్రమాదంలో గ్యాస్ లీక్, మంటల కారణంగా 167 మంది కార్మికులు మృతి చెందారు. 61 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. భారీ మొత్తంలో ఆర్థిక నష్టం జరిగింది. ఈ ప్రమాదం సందర్భంగా వరుసగా పేలుళ్లు జరిగి, రెండు గంటల్లోనే మొత్తం నిర్మాణం కూలిపోయింది. సముద్రంలో భారీగా చమురు, గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించాయి.డీప్ వాటర్ హారిజాన్ ప్రమాదం: డీప్ వాటర్ హారిజాన్ ప్రమాదం అమెరికాలోని గల్ప్ ఆప్ మెక్సికో ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. ఈ ఘటన 20 ఏప్రిల్ 2010న చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 4.9 మిలియన్ బ్యారెల్స్ చమురు సముద్రంలోకి లీక్ అయింది. అనంతరం మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా పర్యావరణం, సముద్ర జీవులు మరణించాయి. తీరప్రాంత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన నష్టం జరిగింది.దేశాన్ని వణికించిన పాశర్లపూడి బ్లోఅవుట్..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలం పాశర్లపూడిలో 1995 జనవరి 8వ తేదీన బ్లోఅవుట్ ఘటన చోటుచేసుకుంది. ఆనాడు ఓఎన్జీసీ వాళ్ళ చమురు అన్వేషణలో భాగంగా డ్రిల్లింగ్ జరుగుతున్న సమయంలో 19వ సెక్టార్లో జరిగిన చిన్న పొరపాటు భారీ ప్రమాదానికి దారి తీసింది. భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటల తాకిడికి కొబ్బరి చెట్లు అంటుకొని క్షణాల్లో అగ్నికి ఆహుతి అయిపోయాయి. బ్లోఅవుట్ కారణంగా చుట్టుపక్కల జనం ఇళ్లు వదిలి పారిపోయారు. ఊళ్లకు ఊళ్లు తరలించాల్సి వచ్చింది. రాత్రి పూట కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళను కూడా ఆ అగ్ని కీలలు కనబడుతూ భయపెట్టేవి. ఓఎన్జీసీ నిపుణులు ఈ బ్లోఅవుట్ ఆర్పటానికి శతవిధాలా ప్రయత్నించి చేతులెత్తేశారు. ఇక లాభం లేదని విదేశాల నుంచి నిపుణులను రప్పించారు. అలా 65 రోజుల తరువాత గాని బ్లోఅవుట్ను పూర్తిగా ఆర్పలేకపోయారు. అంటే మార్చి 15కు గాని పరిస్థితి అదుపులోకి రాలేదు.నివారణ చర్యలు.. Blowout Preventer పరికరాలను తరచుగా పరీక్షించడం.వెల్ డిజైన్, సిమెంటింగ్ ప్రమాణాలను కఠినంగా పాటించడం.అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికలు సిద్ధంగా ఉంచడం.సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, మాక్ డ్రిల్స్ నిర్వహించడం. -
వేధింపుల పర్వం.. ‘వెలుగు’ వీఓఏ ఆత్మహత్యాయత్నం..
సఖినేటిపల్లి/మలికిపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలో డీఆర్డీఏ వెలుగు విభాగం వీఓఏ తాండాల ఆదిలక్ష్మి ఆత్మహత్యా యత్నం చేశారు. తమ విభాగంలో వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగారు. అపస్మారక స్థితికి వెళ్లిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు మలికిపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలోని ఒక గ్రామైక్య సంఘానికి ఆరేళ్లుగా ఆదిలక్ష్మి వీఓఏగా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గెడ్డం సులోచన ఆ సంఘానికి అధ్యక్షురాలిగా, ఆఫీసు బేరర్ (ఓబీ)గా ఉన్నారు. ఆమె గతంలో ఓబీగా పనిచేస్తూ మధ్యలో మానేసి, తిరిగి ఇటీవల ఆ బాధ్యతలు చేపట్టారు. పాలనాపరమైన అంశాలు, రుణాలకు సంబంధించిన నగదు విషయంలో సులోచన, ఆదిలక్ష్మి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల ఇవి తీవ్రరూపం దాల్చి తరచూ మాటామాటా పెరుగుతుండడంతో కలత చెందిన ఆదిలక్ష్మి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అకారణంగా వేధిస్తున్నారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదిలక్ష్మి శనివారం మాట్లాడుతూ.. కొంతకాలంగా వెలుగులో వేధింపులు అధికమయ్యాయని వాపోయారు. సమాఖ్య నిధుల విషయంలో తన తప్పులేకపోయినా, రికార్డులు, బ్యాంకు అకౌంట్లు సక్రమంగా ఉన్నప్పటికీ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆలస్యంగా వచ్చే జీతాల చెక్కులను పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెడితేనేగానీ ఇవ్వడంలేదని, అకారణంగా దూషిస్తున్నారని ఆదిలక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. గ్రూపుల వద్దకు వెళ్తే తిడుతున్నారని ఆర్నెల్లుగా చెబుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యలు పరిష్కరించకుంటే పనిచేయలేనని లేఖ కూడా రాశానని తెలిపారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆత్మహత్యాయత్నం దురదృష్టకరం.. ఈ ఘటనపై వెలుగు ఏపీఎం అజయ్ స్పందిస్తూ.. సులోచన, ఆదిలక్ష్మి మధ్య వివాదాలను సామరస్య ధోరణిలో పరిష్కరించేందుకు ప్రయతి్నస్తున్నామని చెప్పారు. వారిద్దరినీ ఇటీవల కార్యాలయానికి పిలిపించి మాట్లాడామన్నారు. ఆ సందర్భంగా ఒకరిపై మరొకరు కేకలు వేసుకోవడంతో చర్చలు వాయిదా వేశామన్నారు. ఈ దశలో వీఓఏ ఆదిలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం దురదృష్టకరమని అజయ్ అన్నారు. -
నా కుమారుడి అరెస్ట్ అక్రమం: మాజీ మంత్రి విశ్వరూప్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు మాజీ మంత్రి పినేపి విశ్వరూప్. కోనసీమలో కక్ష రాజకీయాలకు కూటమి సర్కార్ ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. రాజకీయ కక్షతో తన కుమారుడిని హత్య కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి విశ్వరూప్ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. కావాలనే నా కుమారుడిని హత్య కేసులో ఇరికించారు. హత్య కేసుతో నా కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు. చనిపోయిన వ్యక్తి మా పార్టీ కార్యకర్తే. ఎఫ్ఐఆర్లో నా కొడుకు పేరు ఎక్కడా లేదు. అక్రమంగా నా కుమారుడిని అరెస్ట్ చేశారు. రాజకీయ కక్షతో నిందితులతో నా కొడుకు పేరు చెప్పించి తప్పుడు కేసు పెట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. కోనసీమలో కక్ష రాజకీయాలకు ఆజ్యం పోస్తోంది. మధురై ఆలయ సందర్శనకు వెళ్లి వస్తున్న సమయంలో నా కుమారుడిని అరెస్టు చేశారు అని చెప్పారు. -
ఆయ్.. ఇంకా పట్టా‘లెక్కలేదండి’
సాక్షి, అమలాపురం: కోనసీమ రైలు బండి ఇంకా పట్టాలెక్కలేదు. కోనసీమ వాసుల చిరకాల స్వప్నం కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి గ్రహణం వీడటం లేదు. రెండు పుష్కరాలు దాటుతున్నా ప్రతిపాదనలు కొలిక్కి రాలేదు. తొలి పన్నెండేళ్లు నిధుల కేటాయింపు జరక్కపోగా.. తరువాత పన్నెండేళ్లు నిధులు కేటాయిస్తున్నా పనుల వేగం పుంజుకోలేదు.దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలోని ఎంపీలతో శుక్రవారం విజయవాడలో రైల్వే అధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఇబ్బందులు, నిధులు కేటాయింపులపై చర్చ జరగాలని జిల్లా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అడ్డు తగులుతున్న టీడీపీ నేతలుగౌతమి గోదావరి పాయ వద్ద 41 పిల్లర్లపై గడ్డర్ల నిర్మాణ పనులకు గత నవంబర్‌లో టెండర్లు ఖరారయ్యాయి. 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటికీ మొదలు కాలేదు. వైనతేయ, వశిష్ట గోదావరి పాయలపై గడ్డర్ల నిర్మాణాలు జరిగితే గాని ట్రాక్ నిర్మాణం చేయలేరు. చంద్రబాబు అధికారంలో ఉన్న 2014–19 సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 25 శాతం వాటాలో కేవలం రూ.2 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేయగా.. ఆ నిధులూ ఇవ్వలేదు. తిరిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత రెండో అలైన్‌మెంట్‌కు సంబంధించి రెవెన్యూ అధికారులు చేపట్టిన భూసేకరణకు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు అడ్డు తగులుతుండటం గమనార్హం.సహస్రాబ్దిలో శంకుస్థాపన కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం మీదుగా నరసాపురం వరకూ రైల్వే లైన్ నిర్మాణానికి 2000 నవంబర్ 16న శంకుస్థాపన జరిగింది. మొత్తం 102.507 కిలోమీటర్ల పొడవైన కాకినాడ–నరసాపురం రైల్వే లైన్లో కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ 45.30 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం గతంలోనే పూర్తయ్యింది. కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ 57.207 కిలోమీటర్లు నిరి్మంచాల్సి ఉండగా.. ఇందులో కోటిపల్లి నుంచి భట్నవిల్లి వరకూ 12.05 కిలోమీటర్ల మేర భూసేకరణ జరిగింది. భట్నవిల్లి నుంచి నరసాపురం వరకూ సుమారు 45.157 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయాలి. దీనికి అప్పట్లో రూ.400 కోట్లు అవసరమని అంచనా వేయగా.. పనులు ఆలస్యం కావడంతో అంచనా వ్యయం ఏకంగా రూ.2,120.16 కోట్లకు పెరిగింది. పనులు ఇంకా ఆలస్యమైతే అంచనాలు మరింత పెరగనున్నాయి.త్వరగా పూర్తయ్యేలా నిర్ణయం ఉండాలి కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు నిధులు విడుదలైనా భూసేకరణ, ట్రాక్ పనుల విషయంలో జాప్యం జరుగుతోంది. కోనసీమలో త్వరితగతిన రైలు పరుగులు పెట్టేలా ఎంపీల సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. భూసేకరణ, ట్రాక్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి. – డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, కన్వీనర్, కోనసీమ రైల్వే సాధన సమితి, అమలాపురం గడ్డర్ల పనులకు టెండర్లు పిలవాలి వైనతేయ, వశిష్ట నదులపై వంతెనలకు గడ్డర్ల నిర్మాణాలకు టెండర్లు పిలవాలి. దీనిపై ఎంపీల సమావేశం నిర్ణయం తీసుకుని టెండర్ల ప్రక్రియ త్వరగా చేపట్టేలా చర్యలు చేపట్టాలి. మొక్కుబడి సమావేశంగా కాకుండా రానున్న నాలుగేళ్లలో కోనసీమలో రైలు నడిచేలా అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్ కృషి చేయాలి. – బండారు రామ్మోహనరావు, కన్వీనర్, కోనసీమ జేఏసీ, అమలాపురంనేడు ఏపీ ఎంపీలతో సమావేశం రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్ట్‌లకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ రాష్ట్ర ఎంపీలతో శుక్రవారం సమావేశం కానున్నారు. విజయవాడలోని ఈటీటీసీ (ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్)లో ఉదయం 10.30 గంటలకు సమావేశం మొదలవుతుంది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్ట్‌ల పురోగతి, కొత్త రైల్వేలైన్లు, విశాఖ రైల్వేజోన్ తదితర అంశాలపై చర్చిస్తారు. -
Chinta Chiguru: కిలో రూ.500.. అయినా తగ్గేదేలే!
సాక్షి, అమలాపురం: ‘ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా!.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా!.. అడ్డ విస్తరిలో ఆరు రుచులు ఉండగా.. బతుకు పండగ చేయరా’ అని ఒక సినిమా పాటలో అన్నట్టు మానవ జీవితంలో ‘రుచి’ని మించిన మాధుర్యం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే రుచికి ఇచ్చే ప్రాధాన్యం శుచికి కూడా ఇవ్వరన్నది విదితమే. అందులోనూ ఆతిథ్యానికి పేరొందిన కోనసీమలో రుచికరమైన వంటలకు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. రకరకాల రుచికరమైన కూరల కోసం ఆస్తులు కూడా అమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదేమో. కోనసీమ వాసులకు పులసకే కాదు.. సాధారణంగా గోదారికి ఎదురీదే పులసలకు ప్రసిద్ధి కోనసీమ. కానీ దానితో పాటు సీజన్ వారీగా దొరికే పలు రకాల ఆహార ఉత్పత్తులపై కోనసీమ వాసులకు ఆసక్తి ఎక్కువే. దాని ఖరీదు ఎంతైనా వెనకాడరు. ఈ సీజన్లో దొరికే ‘చింత చిగురు (వాడుక భాషలో చింతాకు)’ ఒకటి. దీనితో చేసే శాకాహార, మాంసాహార వంటలకు దాసోహం కానివారంటూ ఉండరు. వివిధ రకాల కూరలకు సరిపడినంత కంటే కొంచెం అదనంగా పులపునిచ్చే చింతాకుకు ఫిదా కానివారు ఉండరు. అందుకే గుప్పెడు చింతాకు రూ.25 అన్నా వెనుకాడరు. ప్రస్తుత మార్కెట్లో వంద గ్రాముల చింత చిగురు ధర రూ.50 వరకు ఉంది. అంటే కిలో రూ.500 అన్నమాట. వారపు సంతలు, రోజువారీ సంతలు, ఇళ్లకు వచ్చేవారి వద్ద చింతాకు ఎగబడి కొంటున్నారు. చింత చిగురు పప్పు, చింతాకు కూర (ఉల్లిపాయలు వేసి), చింత చిగురు పనస పిక్కల కూర శాకాహారల జిహ్వ చాపల్యాన్ని తీర్చేవే. మాంసాహార వంటల్లో చింత చిగురు ఇచ్చే రుచి మరింత స్పైసీగా ఉంటుంది. చింత చిగురు పచ్చిరొయ్యలు, ఎండు రొయ్యల రుచి ఆస్వాదించాల్సిందే తప్ప వర్ణించతరం కాదు. కోనసీమ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని బంధు, మిత్రులకు కూరలు తయారు చేసి పంపేవారున్నారిక్కడ. ఇక మేక బోటీని చింతచిగురుతో కలిపి తింటే జీవితాంతం ఆ రుచి మనసుని వదలిపోదంటే నమ్మండి! ముద్ద నోటిలో పెట్టుకుంటే వేడివేడి అన్నంలో వెన్నపూసలా నమలకుండానే కరిగిపోతోందని మాంసప్రియులు లొట్టలు వేస్తూ గొప్పలు చెబుతారు. ఇవే కాకుండా చింతాకు మాంసం, చింత చిగురు మదుళ్లు (చిన్న రకం చేపలు), చింత చిగురు కొతుకు పరిగి (చేప పిల్లలు) కూరలు సైతం పుల్లపుల్లగా లాగించేవారెందరో..! చైత్రమాసం దాటిన వెంటనే చింతచెట్టు చిగురు సేకరించి విక్రయిస్తుంటారు. అయితే ఒకప్పుడు వచ్చినట్టు ఇప్పుడు చింతాకు మార్కెట్‌కు రావడం లేదు. చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో పాటు దీనిని సేకరించడం పెద్ద ప్రయాసగా మారింది. చెట్టు చివరి భాగంలో ఉండే లేత చిగురు చెట్లు ఎక్కి కోసేవారు తగ్గడం వల్ల చింతాకుకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. మేము ఎక్కువ ధర పెట్టి కొంటాం చింతాకు కోసేవారి నుంచి మేము ఎక్కవ ధర పెట్టి కొంటున్నాం. రేటు తక్కువ ఉన్నప్పుడు సంతలకు పట్టుకుని వెళితే రోజుకు రూ.300 మిగిలేది. ఇప్పుడు రేటు పెరిగినా అంతే ఆదాయం వస్తోంది. వచ్చే వారం మాకు చింతాకు కావాలని ముందుగా చెప్పి కొనేవారు ఎక్కువ మంది ఉన్నారు. – అనంతలక్ష్మి, గంగలకుర్రు, అంబాజీపేట మండలం సీజన్లో తినాల్సిందే సీజన్లో చింతాకుతో తయారు చేసే కూరలు ఒకసారైనా తినాల్సిందే. చింతాకుతో చేసిన ఎటువంటి కూరైనా ఇష్టమే. మాకు హైదరాబాద్‌లో విరివిరిగా చింతాకు దొరుకుతోంది. అయితే మా ఇంటి వద్ద నుంచి వండి పంపించిన చింతాకు కూరల రుచేవేరు. – పి.రాజేష్, కఠారులంక, పి.గన్నవరం మండలం -
కోన సీమకు మొండిచేయి
జెడ్పీ పదవుల కేటాయింపుల్లో వివక్ష మెట్టసీమకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు సమతూకమెక్కడని పార్టీ నేతల ప్రశ్న ఫిరాయింపు నేత కోసం సంప్రదాయాలకు తూట్లు అసంతృప్తిలో టీడీపీ శ్రేణులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీలో మరో లొల్లి మొదలైంది. ఫిరాయింపు నేత కోసం ప్రాంతీయ చిచ్చు రేగింది. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో ప్రాంతీయ వివక్ష చోటుచేసుకుందని పార్టీలో చర్చ జరుగుతోంది. రెండు పదవులూ మెట్టసీమకే కట్టబెట్టి, కోనసీమను విస్మరించారన్న ఆవేదన నేతల్లో వ్యక్తమవుతోంది. ఆయారాం గయారం కోసం కోనసీమకు మొండి చేయి చూపడం ఎంతవరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది. . ఫిరాయింపు నేత కోసం మోకరిల్లిన అధిష్టానం పార్టీ ఫిరాయించిన నేత కోసం టీడీపీ అదిష్టానం మోకరిల్లితోంది. ఎంతో ఖర్చు పెట్టి, ఎన్నికల్లో కష్టపడి గెలిచి, జెడ్పీ చైక్మన్ అయిన నామన రాంబాబును తొలగించి అనేక పార్టీలు మారిన జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్‌కు ఆ పదవి కట్టబెడుతోంది. క్రమశిక్షణతో పనచేసి సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందించిన నేతలను విస్మరించి జంప్ జిలానీలే తమకు ఎక్కువని చెప్పకనే అధిష్టానం సందేశం పంపించింది. నాటకీయ పరిణామాల మధ్య జ్యోతుల నవీన్‌కు లైన్ క్లియర్ చేసింది. అటు చైర్మన్, ఇటు వైస్ చైర్మన్లను రాజీనామా చేయించి, తాత్కాలిక చైర్మన్‌గా నవీన్‌ను గద్దెనెక్కించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేయించింది. ఇప్పుడా ఉత్తర్వుల మేరకు శనివారం తాత్కాలిక చైర్మన్‌గా నవీన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతానికి తాత్కాలికమే అయినప్పటికీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తర్వాత అధికారిక చైర్మన్‌గా ఎంపిక చేయనుంది. ఇక ఆపద్ధర్మ ఛాన్స్ దక్కనివ్వకుండా ఉద్దేశ పూర్వకంగా రాజీనామా చేయించిన వైస్ చైర్మన్‌కు మళ్లీ అదే పదవి కట్టబెడతామని పార్టీ పెద్దలు ప్రకటించడంతో నళినీకాంత్ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో అంతా సద్దుమణిగిందని అగ్రనేతలు సేదదీరుతున్నారు. కానీ ఇప్పుడే వారికి అసలు సిసలైన రాజకీయం ఎదురవుతోంది. . రెండూ మెట్ట మకేనా? టీడీపీ ఆవిర్భావం రాజకీయాల్లో ఒక సంప్రదాయం కొనసాగుతోంది. చైర్మన్ ఒక ప్రాంతానికిస్తే, వైస్ చైర్మన్ మరో ప్రాంతానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ టీడీపీలో మాత్రం జెడ్పీ సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారు. 2001లో తూర్పు డెల్టా ప్రాంతానికి చెందిన దున్నా జనార్థనరావును చైర్మన్ చేయగా...అదే ప్రాంతానికి చెందిన చింతపల్లి వీరభద్రరావును వైస్ చైర్మన్ చేశారు. అప్పట్లో దీనిపై వివాదం చోటుచేసుకుంది. కొందరు నేతలు అభ్యంతరం చెప్పడమే కాకుండా అలక పూనారు. మళ్లీ ఇప్పుడదే సీన్ పునరావృతమయింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు రెండూ ఒకే ప్రాంతానికి కట్టబెట్టడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అది కూడా అనేక పార్టీలకు వెన్నుపోటు పొడిచిన నేత కోసం ఒక ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. కొత్తగా చైర్మన్ అవుతున్న జ్యోతుల నవీన్‌కుమార్, మరోసారి వైస్ చైర్మన్ అవుతున్న నళినీకాంత్ మెట్టసీమకు చెందిన వారని, ఈ విషయంలో కోనసీమకు మొండి చేయి చూపుతున్నారని వాపోతున్నారు. మొన్నటివరకు సమతూకంగా ఉండేదని, ఫిరాయింపు నాయకుడి కోసం సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఒక ప్రాంతాన్ని విస్మరించడం బాధాకరమని, భవిష్యత్తులో పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉండటంతో బయటపడలేకపోతున్నామని...సమయం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తామంటూ చిర్రుబుర్రులాడుతున్నారు.


