
కొంతకాలంగా వేధింపులు ఎక్కువయ్యాయని బాధితురాలి ఆవేదన
అన్నీ సక్రమంగా ఉన్నా అకారణంగా దూషిస్తున్నారని ఆరోపణ
సఖినేటిపల్లి/మలికిపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలో డీఆర్‌డీఏ వెలుగు విభాగం వీఓఏ తాండాల ఆదిలక్ష్మి ఆత్మహత్యా యత్నం చేశారు. తమ విభాగంలో వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగారు. అపస్మారక స్థితికి వెళ్లిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు మలికిపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
గ్రామస్తుల కథనం ప్రకారం.. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలోని ఒక గ్రామైక్య సంఘానికి ఆరేళ్లుగా ఆదిలక్ష్మి వీఓఏగా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గెడ్డం సులోచన ఆ సంఘానికి అధ్యక్షురాలిగా, ఆఫీసు బేరర్ (ఓబీ)గా ఉన్నారు. ఆమె గతంలో ఓబీగా పనిచేస్తూ మధ్యలో మానేసి, తిరిగి ఇటీవల ఆ బాధ్యతలు చేపట్టారు. పాలనాపరమైన అంశాలు, రుణాలకు సంబంధించిన నగదు విషయంలో సులోచన, ఆదిలక్ష్మి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల ఇవి తీవ్రరూపం దాల్చి తరచూ మాటామాటా పెరుగుతుండడంతో కలత చెందిన ఆదిలక్ష్మి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
అకారణంగా వేధిస్తున్నారు..
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదిలక్ష్మి శనివారం మాట్లాడుతూ.. కొంతకాలంగా వెలుగులో వేధింపులు అధికమయ్యాయని వాపోయారు. సమాఖ్య నిధుల విషయంలో తన తప్పులేకపోయినా, రికార్డులు, బ్యాంకు అకౌంట్లు సక్రమంగా ఉన్నప్పటికీ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆలస్యంగా వచ్చే జీతాల చెక్కులను పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెడితేనేగానీ ఇవ్వడంలేదని, అకారణంగా దూషిస్తున్నారని ఆదిలక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. గ్రూపుల వద్దకు వెళ్తే తిడుతున్నారని ఆర్నెల్లుగా చెబుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యలు పరిష్కరించకుంటే పనిచేయలేనని లేఖ కూడా రాశానని తెలిపారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆత్మహత్యాయత్నం దురదృష్టకరం..
ఈ ఘటనపై వెలుగు ఏపీఎం అజయ్ స్పందిస్తూ.. సులోచన, ఆదిలక్ష్మి మధ్య వివాదాలను సామరస్య ధోరణిలో పరిష్కరించేందుకు ప్రయతి్నస్తున్నామని చెప్పారు. వారిద్దరినీ ఇటీవల కార్యాలయానికి పిలిపించి మాట్లాడామన్నారు. ఆ సందర్భంగా ఒకరిపై మరొకరు కేకలు వేసుకోవడంతో చర్చలు వాయిదా వేశామన్నారు. ఈ దశలో వీఓఏ ఆదిలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం దురదృష్టకరమని అజయ్ అన్నారు.