breaking news
irusumanda Blowout
-
పచ్చని సుక్షేత్రమే కానీ.. పిన్ను పీకేసిన గ్రనేడ్..
సైరన్ వినిపించినా.. టముకు శబ్దం చెవిని తాకినా.. హఠాత్తుగా కరెంటు ఆపేసినా.. అక్కడ జనం వణికిపోతారు.. తట్టాబుట్టాతో పిల్లాజెల్లాతో బంధువుల ఇళ్లకు బయల్దేరతారు.. కోనసీమలోని 316 గ్రామాలలోని పరిస్థితి ఇది. కోనసీమ అంటే.. అఖండ గోదావరి ఏడు పాయలుగా విచ్చుకున్న సుందరప్రదేశం.. గలగలపారే కాలువల నడుమ వరిపైర్లు.. కొబ్బరితోటలు.. అరటివనాలతో ఆహ్లాదాన్ని పంచే అందమైన ప్రాంతం. కానీ.. అందరికీ తెలియని కోనసీమ మరొకటుంది. చిన్న శబ్దానికే చిగురుటాకులా వణికిపోయే ప్రాంతం అది.. దానికి కారణం చమురు, సహజవాయువు నిక్షేపాలు.. ఆ సంపదను ఒడిసిపట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు.. అందుకే కోనసీమ అంటే.. పిన్ను పీకేసిన గ్రనేడ్.. అది ఏ క్షణంలో ఎక్కడ పేలుతుందో ఎక్కడ మండుతుందో.. ఇరుసుమండలో మండుతున్న ఓఎన్జీసీ బావి తాజా దృష్టాంతం.. అది ఓ సజీవ సాక్ష్యం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీకి చెందిన మోరి–5వ నంబర్ బావి వద్ద ఈ నెల 5న భారీ బ్లోఅవుట్ సంభవించింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో చుట్టుపక్కల భీతావహ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. మంటల తీవ్రత తగ్గినప్పటికీ బ్లోఅవుట్ ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ముందుజాగ్రత్తగా ఇరుసుమండ, లక్కవరం గ్రామాలను ఖాళీ చేయించారు. మంటలు అదుపులోకి రావడానికి వారం రోజులు పడుతుందని అంచనా.కోనసీమ కాదు బ్లో అవుట్ల సీమ.. కోనసీమలో చమురు, సహజవాయు సంస్థ ఓఎన్జీసీ జరుపుతున్న తవ్వకాలలో భాగంగా నిత్యం ఏదో ఒకమూల చిన్నపాటి బ్లోఅవుట్లు, గ్యాస్ లీక్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కానీ ఓఎన్జీసీ నిపుణులు వెంటనే అరికట్టేస్తుం టారు. అందువల్ల వాటి గురించి జనబాహు ళ్యానికి పెద్దగా తెలియదు. రికార్డులకూ ఎక్కవు. భారీ బ్లోఅవుట్ అయితేనే ప్రపంచానికి తెలుస్తుంది. అలాంటివాటిలో కొన్ని..తొలి బ్లోఅవుట్ కొమరాడలో..1993 మార్చిలో మామిడికుదురు మండలం కొమరాడలోని ఓఎన్జీసీ సైట్లో బ్లోఅవుట్ సంభవించింది. లీకైన గ్యాస్ బురద నీటిలో కలిసింది.. ఆ ప్రాంతంలో పలుచోట్ల మంటలు ఎగసిపడి, కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. కొన్ని రోజుల తర్వాత లీక్ అదుపులోకొచ్చింది..ప్రపంచంలోనే పెద్దది.. పాశర్లపూడి బ్లోఅవుట్1995 జనవరి 8న మామిడికుదురు మండలం పాశర్లపూడిలో పెద్దఎత్తున గ్యాస్ లీకైంది. పాశర్లపూడిృ19 బావి వద్ద డ్రిల్లింగ్ సమయంలో ఏర్పడిన గ్యాస్ లీక్‌కు నిప్పురవ్వ తోడవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దాదాపు 65 రోజులపాటు కొనసాగాయి. ప్రమాదం సంభవించిన రిగ్గుకు రెండు కిలోమీటర్ల పరిధిలోని ఏడు గ్రామాలలో దాదాపు 5వేలకుపైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. ఓఎన్జీసీ అంతర్జాతీయ నిపుణులను సంప్రదించింది. చివరకు స్థానిక నిపుణుల బృందమే బావిని మూసివేయగలిగింది. మార్చి 15న మంటలు అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీకి రూ.16 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రమాద ప్రదేశంలో ధ్వంసమైన రిగ్గు ఖరీదు రూ.9కోట్లు. రూ.7 కోట్ల విలువైన ఇతర పరికరాలు ధ్వంసమయ్యాయి. వీటికి క్రైసిస్ మేనేజ్మెంట్ ఖర్చులు అదనం. ప్రపంచంలోనే పెద్ద బ్లోఅవుట్‌గా పేరు తెచ్చుకున్న ఈ ప్రమాదంలో రోజుకు వంద క్యూబిక్ మిలియన్ల గ్యాస్ వృథాగా మండిపోయింది. బ్లో అవుట్ జరిగేది ఇలా.. భూగర్భంలో ఉండే విపరీతమైన గ్యాస్ ఒత్తిడిని నియంత్రించలేని పరిస్థితుల్లో గ్యాస్బావిలోని పైప్లైన్లు లేదా ఇతర పరికరాల రాపిడి వల్ల నిప్పురవ్వలు ఏర్పడి మంటలు చెలరేగుతాయి. బావులు తవ్వుతున్నప్పుడు ఓఎన్జీసీ సిబ్బంది పైపులను దింపడం.. అవసరమైతే పైకి తీయడం చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలోనే నిప్పురవ్వలు రాజుకుంటాయి. గ్యాస్ బావుల తవ్వకంలో సాంకేతిక లోపాలు, పైప్లైన్ల నిర్వహణలో లోపాలు లేదా తుప్పుపట్టడం వంటి పరిస్థితులు బ్లోఅవుట్లకు కారణమవుతాయని నిపుణులంటున్నారు. పాశర్లపూడి గ్యాస్ బావి నుంచి పైపులను పైకి తీస్తున్న సమయంలో ఒక పరికరం జారి బోర్‌వెల్‌లో ఇరుక్కుపోయింది. అది పైపులకు అడ్డుపడగా.. అవి ఎక్కడికక్కడ బిగుసుకుపోయాయి. వీటిని బయటకు తీయటానికి లాగే క్రమంలో ఒరిపిడికి పుట్టిన నిప్పు రవ్వలతో గ్యాస్ అంటుకుంది. ఆ మంట బోర్వెల్లోకి దూసుకెళ్తున్న సమయంలో పాశర్లపూడి ప్రాంతంలో భూమి పెద్దగా కంపించింది. బోర్‌వెల్‌లో ఉన్న పైపులు పెద్ద శబ్దంతో పైకి ఎగిరి కొన్ని కిలోమీటర్ల దూరంలో పడ్డాయి. ప్రాణాలు పోతాయనుకున్నా డ్వాక్రా సంఘం డబ్బులు రూ.30 వేలు మోటార్ సైకిల్ బ్యాగులో పెట్టుకుని బ్యాంకులో కట్టేందుకు సిద్ధమవుతున్నాను. ఇంతలో గ్యాస్ ఎగజిమ్మి శబ్దం రావడంతో గ్రామంలో యువకులు హెచ్చరించారు. ఆందోళనతో మోటార్ సైకిల్ స్టార్ట్ చేయలేక కట్టుబట్టలతో పారిపోయా. పరుగెడుతుండగానే ప్రాణాలు పోతానుకున్నా. ఇలా బతికి వస్తాననుకోలేదు. మోటార్ సైకిల్‌ను దొంగలు పట్టుకుపోతుంటే యువకులు అడ్డుకుని నాకు తెచ్చి ఇచ్చారు. – వలవల సత్యనారాయణ, ఇరుసుమండభయంతో పారిపోయా.. బ్లో అవుట్ భయంతో ఇల్లు విడిచి పారిపోయాను. వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఏ వస్తువులు పోయాయో చూసుకుంటున్నాను. ఎవరు సాయం చేస్తారో తెలియడం లేదు. ఇంకా ఆ భయం వీడడం లేదు. చుట్టూ ఓఎన్జీసీ బావులే ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి మా ప్రాణాలకు రక్షణ కలి్పంచాలి. – చేట్ల రామలక్ష్మి, ఇరుసుమండబతుకుతామనుకోలేదు ఇంట్లో పని చేసుకుంటున్నాను. ఇంతలో భారీ శబ్దం వచ్చింది. బయటకు వచ్చేసరికి గ్యాస్ ఎగదన్నుతోందని పక్కవాళ్లు చెప్పారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. పెద్ద శబ్దం వచ్చేసరికి ఇంటికి తాళం వేసే ధైర్యం కూడా చేయలేకపోయాను. అందరూ పరుగులు తీస్తుండడంతో నేనూ అడ్డదారిలో పరుగులు పెట్టాను. బతుకుతామనుకోలేదు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. – ముగ్గు లక్ష్మి, ఇరుసుమండవారం రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతాం ఇరుసుమండ ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి ఎగసిపడుతున్న మంటల్ని పూర్తిగా అదుపు చేసేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మంటల తీవ్రత చాలావరకు తగ్గింది. మా సిబ్బంది బావికి దగ్గరగా చేరుకోగలిగారు. అక్కడి నుంచి శిధిలాలు తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. బావికి మరింత సమీపంగా చేరుకున్నాక పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం క్యాప్ ఎలా బిగించాలి అనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. హైడ్రో కార్బన్స్ మండేటప్పుడు దాని తీవ్రత అడుగున ఉన్న గ్యాస్ నిల్వలపైన ఆధారపడి ఉంటుంది. నిపుణులైన సిబ్బందిని, అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నాం. – విక్రం సక్సేనా, శాంతనూర్‌దాస్, ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు -
బ్లోఅవుట్ అంటే.. అతిపెద్ద ప్రమాదం ఎక్కడంటే?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. మలికిపురం మండలం ఇరుసుమండలో మోరి-5 ఓఎన్జీసీ బావిలో డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో భారీ శబ్దంతో అగ్నికీలలు విరుచుకుపడ్డాయి. గ్యాస్ లీక్ కారణంగా ఘటనా స్థలంలో మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. మంటలపై అగ్నిమాపక యంత్రాలతో నీటిని విరజిమ్మే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. బ్లోఅవుట్ను పూర్తిగా నియంత్రించేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లోఅవుట్ అంటే ఏంటి?.. అతిపెద్ద బ్లోఅవుట్ ప్రమాదాలు ఎక్కడ జరిగాయి?.. బ్లోఅవుట్ అంటే ఏంటి?.బ్లోఅవుట్ అనే పదానికి వాడుకని బట్టి వేర్వేరే అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్లోఅవుట్ అంటే పేలుడు అనే అర్థం వస్తుంది. గ్యాస్ లీక్ బ్లోఅవుట్: బ్లోఅవుట్ అగ్ని ప్రమాదం (Blowout Fire Accident) అనేది ఆయిల్ & గ్యాస్ పరిశ్రమలో అత్యంత ప్రమాదకర సంఘటనల్లో ఒకటి. ఇది వెల్‌లోని ప్రెషర్ నియంత్రణ తప్పిపోవడం వల్ల చమురు లేదా గ్యాస్ ఒక్కసారిగా బయటకు రావడం, ఆ తర్వాత అది మంటలు అంటుకోవడం ద్వారా జరుగుతుంది.టైర్ బ్లోఅవుట్: వాహనం టైర్ అకస్మాత్తుగా పగిలిపోవడం లేదా గాలి ఒక్కసారిగా బయటకు రావడం. ఇది అధిక వేగం, అధిక ఉష్ణోగ్రత, లేదా టైర్లో లోపం వల్ల జరుగుతుంది. ప్రమాదకర పరిస్థితి, వాహనం నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది.బ్లోఅవుట్‌కు కారణాలు.. ప్రెషర్ నియంత్రణ లోపం: డ్రిల్లింగ్ సమయంలో వెల్‌లోని ప్రెషర్‌ను సరైన విధంగా నియంత్రించకపోవడంBlowout Preventer (BOP) విఫలం: వెల్‌ను మూసివేయడానికి ఉపయోగించే పరికరం పనిచేయకపోవడం.సిమెంటింగ్ లోపాలు: వెల్‌లో గ్యాస్/ఆయిల్ లీక్ కాకుండా సిమెంట్ బారియర్ బలహీనంగా ఉండడం.మానవ తప్పిదాలు: ఆపరేటర్లు సరైన పద్ధతిలో పరీక్షలు చేయకపోవడం లేదా అత్యవసర పరిస్థితిని గుర్తించకపోవడం.బ్లోఅవుట్ ప్రభావం ఎలా.. మంటలు: వెల్‌హెడ్ వద్ద చమురు/గ్యాస్ మంటలు అంటుకోవడం.మరణాలు/గాయాలు: కార్మికులు ప్రాణాలు కోల్పోవడం లేదా తీవ్ర గాయాలు పొందడం.పర్యావరణ నష్టం: చమురు లీక్ వల్ల సముద్ర జీవులు, తీరప్రాంతాలు ప్రభావితం అవుతాయి.ఆర్థిక నష్టం: కంపెనీలకు బిలియన్ల డాలర్ల నష్టం, శుభ్రపరిచే ఖర్చులు.అతిపెద్ద బ్లోఅవుట్ ప్రమాదాలు..పైపర్ ఆల్ఫా ప్రమాదం: పైపర్ ఆల్ఫా (Piper Alpha.. UK) ఘటన ప్రపంచంలోనే అతిపెద్ద బ్లోఅవుట్ ఘటన. ఇది చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఆఫ్‌షోర్ ఆయిల్ & గ్యాస్ ప్రమాదం. ఈ ఘటన యూకేలోని ఉత్తర సముద్రంలో 1988 జూలై 6న జరిగింది. ఈ ప్రమాదంలో గ్యాస్ లీక్, మంటల కారణంగా 167 మంది కార్మికులు మృతి చెందారు. 61 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. భారీ మొత్తంలో ఆర్థిక నష్టం జరిగింది. ఈ ప్రమాదం సందర్భంగా వరుసగా పేలుళ్లు జరిగి, రెండు గంటల్లోనే మొత్తం నిర్మాణం కూలిపోయింది. సముద్రంలో భారీగా చమురు, గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించాయి.డీప్ వాటర్ హారిజాన్ ప్రమాదం: డీప్ వాటర్ హారిజాన్ ప్రమాదం అమెరికాలోని గల్ప్ ఆప్ మెక్సికో ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. ఈ ఘటన 20 ఏప్రిల్ 2010న చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 4.9 మిలియన్ బ్యారెల్స్ చమురు సముద్రంలోకి లీక్ అయింది. అనంతరం మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా పర్యావరణం, సముద్ర జీవులు మరణించాయి. తీరప్రాంత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన నష్టం జరిగింది.దేశాన్ని వణికించిన పాశర్లపూడి బ్లోఅవుట్..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలం పాశర్లపూడిలో 1995 జనవరి 8వ తేదీన బ్లోఅవుట్ ఘటన చోటుచేసుకుంది. ఆనాడు ఓఎన్జీసీ వాళ్ళ చమురు అన్వేషణలో భాగంగా డ్రిల్లింగ్ జరుగుతున్న సమయంలో 19వ సెక్టార్లో జరిగిన చిన్న పొరపాటు భారీ ప్రమాదానికి దారి తీసింది. భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటల తాకిడికి కొబ్బరి చెట్లు అంటుకొని క్షణాల్లో అగ్నికి ఆహుతి అయిపోయాయి. బ్లోఅవుట్ కారణంగా చుట్టుపక్కల జనం ఇళ్లు వదిలి పారిపోయారు. ఊళ్లకు ఊళ్లు తరలించాల్సి వచ్చింది. రాత్రి పూట కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళను కూడా ఆ అగ్ని కీలలు కనబడుతూ భయపెట్టేవి. ఓఎన్జీసీ నిపుణులు ఈ బ్లోఅవుట్ ఆర్పటానికి శతవిధాలా ప్రయత్నించి చేతులెత్తేశారు. ఇక లాభం లేదని విదేశాల నుంచి నిపుణులను రప్పించారు. అలా 65 రోజుల తరువాత గాని బ్లోఅవుట్ను పూర్తిగా ఆర్పలేకపోయారు. అంటే మార్చి 15కు గాని పరిస్థితి అదుపులోకి రాలేదు.నివారణ చర్యలు.. Blowout Preventer పరికరాలను తరచుగా పరీక్షించడం.వెల్ డిజైన్, సిమెంటింగ్ ప్రమాణాలను కఠినంగా పాటించడం.అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికలు సిద్ధంగా ఉంచడం.సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, మాక్ డ్రిల్స్ నిర్వహించడం. -
ఆరని బ్లో అవుట్ చిచ్చు
సాక్షి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మలికిపురం మండలం ఇరుసుమండ ఓఎన్జీసీ మోరి బావి నంబరు ఐదులో సంభవించిన బ్లో అవుట్ కొనసాగుతోంది. భూగర్భం నుంచి వచ్చే గ్యాస్ ఒత్తిడి తగ్గడం వల్ల మంటల తీవ్రత మంగళవారం మధ్యాహా్ననికి చాలా వరకూ తగ్గింది. అయితే గ్యాస్ ఒత్తిడి పెరిగినప్పుడు మళ్లీ మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఈ బావికి పూర్తి స్థాయిలో వెల్ క్యాపింగ్ (మూసేయడం) చేయడంపై అధికారులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు.పన్నెండేళ్ల క్రితం కూడా ఇలాగే డ్రిల్లింగ్ సమయంలో గ్యాస్ ఒత్తిడి నిలకడగా లేక ఇబ్బంది పడిన ఇంజినీర్లు ఈ బావిని అప్పట్లో మూసివేశారు. ఇప్పుడు కూడా నిలకడ లేకుండా గ్యాస్ ఉబికి వస్తుండటంతో వారు తలలు పట్టుకుంటున్నారు.రాజమహేంద్రవరం, నరసాపురం, తూర్పుపాలెం గ్యాస్ కలెక్షన్ స్టేషన్ల (జీసీఎస్) నుంచి విపత్తు నివారణ బృందాలు ఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. గ్యాస్, చమురు కలిసి మండుతున్నందున మంటల తీవ్రత, చుట్టూ అలముకున్న వేడిని తగ్గించేందుకు ఫైర్ ఇంజిన్ల ద్వారా నీటిని జల్లుతున్నారు.మంటల తీవ్రతకు బావి వద్ద రిగ్ పడిపోవడంతో పాటు, పైపులూ కరిగిపోయాయి. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అధికారులు, ఇంజినీర్లు దూరం నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఈ బావిలో సుమారు 40 వేల మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉందని భావిస్తున్నారు. భూగర్భంలో పరిస్థితిని అంచనా వేయడంలో ఇంజినీరింగ్ నిపుణులు నిమగ్నమయ్యారు. ఎన్ని మీటర్ల లోతు నుంచి పైప్‌లైన్ దెబ్బ తిందనే దానిపై అంచనా వేస్తున్నారు. ఈలోపు ప్రత్యేక జాకెట్లతో నిపుణులు మంటల్లోనే బావి వద్దకు వెళ్లే అవకాశం ఉంది. బావి వద్ద కరిగిపోయిన ఐరన్ పైపులు, రిగ్ మెటీరియల్ తొలగించి, వెల్‌కు సరిపడే క్యాప్ డిజైన్ చేయాల్సి ఉంది. దీనికి అణుగుణంగా ఘటన స్థలానికి వెల్‌క్యాప్, భారీ క్రేన్లను తరలించారు.ఒకేసారి అదుపు చేయడం వల్ల ఇబ్బందులు ఒకేసారి మంటలు అదుపు చేయడం వల్ల శాస్త్రీయంగా, పర్యావరణపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ నేపథ్యంలో క్రమక్రమంగా నాలుగు రోజుల్లో మంటలను అదుపు చేయనున్నట్టు ఓఎన్జీసీ వర్గాలు చెబుతున్నాయి. బోరు బావికి వారం రోజుల్లో క్యాపింగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పేర్కొంటున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రత్యేక నిపుణులతో కూడిన గ్యాస్ లీకేజీ నియంత్రణ బృందాలు రెండు ముంబై నుంచి డ్రిల్లింగ్ ప్రాంతానికి చేరుకున్నాయి.పునరావాస కేంద్రాల్లోనే రెండు గ్రామాల ప్రజలు మరోవైపు సమీపంలోని రెండు గ్రామాల ప్రజలు చాలా మంది ఇంకా పునరావాస కేంద్రాల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసుకుని వస్తే రాత్రి దొంగలు పడి దోచేశారని ఒకరు, తమ పెంపుడు మేకలను దొంగలు ఎత్తుకు పోయారని మరొకరు చెప్పారు. ప్రాణాలు అర చేతుల్లో పట్టుకుని కట్టుబట్టలతో వస్తే పునరావాస కేంద్రాల్లో అరకొర సౌకర్యాలు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. బ్లో అవుట్ జరిగిన ప్రాంతాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలోని బృందం పరిశీలించింది. బ్లో అవుట్ జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకుంది. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), పార్టీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.ప్రైవేట్ కంపెనీలతోనే ముప్పుఓఎన్జీసీ పరిధిలోని బావుల డ్రిల్లింగ్‌ను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం వల్లే తరచూ కోనసీమలో బ్లో అవుట్లు చోటుచేసుకుంటున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇరుసుమండ ఓఎన్జీసీ మోరి బావి–5లో జరిగిన ప్రమాదంతో ఈ వాదన తెర మీదకు వచి్చంది. ఇక్కడ డ్రిల్లింగ్ పనులను గుజరాత్‌కు చెందిన డీప్ ఇండస్ట్రీకి ఓఎన్జీసీ అప్పగించింది. ప్రమాదం జరిగే అవకాశముందని పన్నెండేళ్ల క్రితం మూసివేసిన ఈ బావిలో తిరిగి డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో భయపడినట్టుగానే మంటలు ఎగసిపడ్డాయి. గతంలో కాట్రేనికోన మండలం ఉప్పూడిలోనూ కోల్‌కతాకు చెందిన పీఎఫ్‌హెచ్ సంస్థ లీజుకు తీసుకుని డ్రిల్లింగ్ చేస్తున్న బావి వద్దనే బ్లో అవుట్ చెలరేగింది.48 గంటల పాటు శ్రమిస్తేనే కానీ మంటలను అదుపు చేయలేకపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఓఎన్జీసీ సంస్థ బావుల్లో సుమారు 2,600 మీటర్ల వరకూ డ్రిల్లింగ్ చేసి, ఆ పరిధిలో ఉన్న చమురు, సహజ వాయువులు వెలికితీస్తోంది. ఆ తరువాత వాటిని మూసివేస్తోంది. కొంత కాలం తరువాత వాటిని ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇస్తోంది. పెద్దగా అనుభవం లేని ఆ సంస్థలు మరింత లోతుగా డ్రిల్లింగ్ చేపడుతున్న సమయంలో సాంకేతిక కారణాల వల్ల బ్లో అవుట్లతో మంటలు రేగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.


