సైరన్ వినిపించినా.. టముకు శబ్దం చెవిని తాకినా.. హఠాత్తుగా కరెంటు ఆపేసినా.. అక్కడ జనం వణికిపోతారు.. తట్టాబుట్టాతో పిల్లాజెల్లాతో బంధువుల ఇళ్లకు బయల్దేరతారు.. కోనసీమలోని 316 గ్రామాలలోని పరిస్థితి ఇది. కోనసీమ అంటే.. అఖండ గోదావరి ఏడు పాయలుగా విచ్చుకున్న సుందరప్రదేశం.. గలగలపారే కాలువల నడుమ వరిపైర్లు.. కొబ్బరితోటలు.. అరటివనాలతో ఆహ్లాదాన్ని పంచే అందమైన ప్రాంతం. కానీ.. అందరికీ తెలియని కోనసీమ మరొకటుంది. చిన్న శబ్దానికే చిగురుటాకులా వణికిపోయే ప్రాంతం అది.. దానికి కారణం చమురు, సహజవాయువు నిక్షేపాలు.. ఆ సంపదను ఒడిసిపట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు.. అందుకే కోనసీమ అంటే.. పిన్ను పీకేసిన గ్రనేడ్.. అది ఏ క్షణంలో ఎక్కడ పేలుతుందో ఎక్కడ మండుతుందో.. ఇరుసుమండలో మండుతున్న ఓఎన్‌జీసీ

బావి తాజా దృష్టాంతం.. అది ఓ సజీవ సాక్ష్యం..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్‌జీసీకి చెందిన మోరి–5వ నంబర్ బావి వద్ద ఈ నెల 5న భారీ బ్లోఅవుట్ సంభవించింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో చుట్టుపక్కల భీతావహ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. మంటల తీవ్రత తగ్గినప్పటికీ బ్లోఅవుట్ ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ముందుజాగ్రత్తగా ఇరుసుమండ, లక్కవరం గ్రామాలను ఖాళీ చేయించారు. మంటలు అదుపులోకి రావడానికి వారం రోజులు పడుతుందని అంచనా.
కోనసీమ కాదు బ్లో అవుట్ల సీమ..
కోనసీమలో చమురు, సహజవాయు సంస్థ ఓఎన్‌జీసీ జరుపుతున్న తవ్వకాలలో భాగంగా నిత్యం ఏదో ఒకమూల చిన్నపాటి బ్లోఅవుట్లు, గ్యాస్ లీక్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కానీ ఓఎన్‌జీసీ నిపుణులు వెంటనే అరికట్టేస్తుం టారు. అందువల్ల వాటి గురించి జనబాహు ళ్యానికి పెద్దగా తెలియదు. రికార్డులకూ ఎక్కవు. భారీ బ్లోఅవుట్ అయితేనే ప్రపంచానికి తెలుస్తుంది. అలాంటివాటిలో కొన్ని..
తొలి బ్లోఅవుట్ కొమరాడలో..
1993 మార్చిలో మామిడికుదురు మండలం కొమరాడలోని ఓఎన్జీసీ సైట్‌లో బ్లోఅవుట్ సంభవించింది. లీకైన గ్యాస్ బురద నీటిలో కలిసింది.. ఆ ప్రాంతంలో పలుచోట్ల మంటలు ఎగసిపడి, కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. కొన్ని రోజుల తర్వాత లీక్ అదుపులోకొచ్చింది..
ప్రపంచంలోనే పెద్దది.. పాశర్లపూడి బ్లోఅవుట్
1995 జనవరి 8న మామిడికుదురు మండలం పాశర్లపూడిలో పెద్దఎత్తున గ్యాస్ లీకైంది. పాశర్లపూడిృ19 బావి వద్ద డ్రిల్లింగ్ సమయంలో ఏర్పడిన గ్యాస్ లీక్‌కు నిప్పురవ్వ తోడవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దాదాపు 65 రోజులపాటు కొనసాగాయి. ప్రమాదం సంభవించిన రిగ్గుకు రెండు కిలోమీటర్ల పరిధిలోని ఏడు గ్రామాలలో దాదాపు 5వేలకుపైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. ఓఎన్‌జీసీ అంతర్జాతీయ నిపుణులను సంప్రదించింది. చివరకు స్థానిక నిపుణుల బృందమే బావిని మూసివేయగలిగింది. మార్చి 15న మంటలు అదుపులోకి వచ్చాయి. ఓఎన్‌జీసీకి రూ.16 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రమాద ప్రదేశంలో ధ్వంసమైన రిగ్గు ఖరీదు రూ.9కోట్లు. రూ.7 కోట్ల విలువైన ఇతర పరికరాలు ధ్వంసమయ్యాయి. వీటికి క్రైసిస్ మేనేజ్‌మెంట్ ఖర్చులు అదనం. ప్రపంచంలోనే పెద్ద బ్లోఅవుట్‌గా పేరు తెచ్చుకున్న ఈ ప్రమాదంలో రోజుకు వంద క్యూబిక్ మిలియన్ల గ్యాస్ వృథాగా మండిపోయింది.

బ్లో అవుట్ జరిగేది ఇలా..
భూగర్భంలో ఉండే విపరీతమైన గ్యాస్ ఒత్తిడిని నియంత్రించలేని పరిస్థితుల్లో గ్యాస్‌బావిలోని పైప్‌లైన్లు లేదా ఇతర పరికరాల రాపిడి వల్ల నిప్పురవ్వలు ఏర్పడి మంటలు చెలరేగుతాయి. బావులు తవ్వుతున్నప్పుడు ఓఎన్‌జీసీ సిబ్బంది పైపులను దింపడం.. అవసరమైతే పైకి తీయడం చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలోనే నిప్పురవ్వలు రాజుకుంటాయి. గ్యాస్ బావుల తవ్వకంలో సాంకేతిక లోపాలు, పైప్‌లైన్ల నిర్వహణలో లోపాలు లేదా తుప్పుపట్టడం వంటి పరిస్థితులు బ్లోఅవుట్లకు కారణమవుతాయని నిపుణులంటున్నారు. పాశర్లపూడి గ్యాస్ బావి నుంచి పైపులను పైకి తీస్తున్న సమయంలో ఒక పరికరం జారి బోర్‌వెల్‌లో ఇరుక్కుపోయింది. అది పైపులకు అడ్డుపడగా.. అవి ఎక్కడికక్కడ బిగుసుకుపోయాయి. వీటిని బయటకు తీయటానికి లాగే క్రమంలో ఒరిపిడికి పుట్టిన నిప్పు రవ్వలతో గ్యాస్ అంటుకుంది. ఆ మంట బోర్‌వెల్‌లోకి దూసుకెళ్తున్న సమయంలో పాశర్లపూడి ప్రాంతంలో భూమి పెద్దగా కంపించింది. బోర్‌వెల్‌లో ఉన్న పైపులు పెద్ద శబ్దంతో పైకి ఎగిరి కొన్ని కిలోమీటర్ల దూరంలో పడ్డాయి.
ప్రాణాలు పోతాయనుకున్నా
డ్వాక్రా సంఘం డబ్బులు రూ.30 వేలు మోటార్ సైకిల్ బ్యాగులో పెట్టుకుని బ్యాంకులో కట్టేందుకు సిద్ధమవుతున్నాను. ఇంతలో గ్యాస్ ఎగజిమ్మి శబ్దం రావడంతో గ్రామంలో యువకులు హెచ్చరించారు. ఆందోళనతో మోటార్ సైకిల్ స్టార్ట్ చేయలేక కట్టుబట్టలతో పారిపోయా. పరుగెడుతుండగానే ప్రాణాలు పోతానుకున్నా. ఇలా బతికి వస్తాననుకోలేదు. మోటార్ సైకిల్‌ను దొంగలు పట్టుకుపోతుంటే యువకులు అడ్డుకుని నాకు తెచ్చి ఇచ్చారు.
– వలవల సత్యనారాయణ, ఇరుసుమండ
భయంతో పారిపోయా..
బ్లో అవుట్ భయంతో ఇల్లు విడిచి పారిపోయాను. వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఏ వస్తువులు పోయాయో చూసుకుంటున్నాను. ఎవరు సాయం చేస్తారో తెలియడం లేదు. ఇంకా ఆ భయం వీడడం లేదు. చుట్టూ ఓఎన్‌జీసీ బావులే ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి మా ప్రాణాలకు రక్షణ
కలి్పంచాలి.
– చేట్ల రామలక్ష్మి, ఇరుసుమండ
బతుకుతామనుకోలేదు
ఇంట్లో పని చేసుకుంటున్నాను. ఇంతలో భారీ శబ్దం వచ్చింది. బయటకు వచ్చేసరికి గ్యాస్ ఎగదన్నుతోందని పక్కవాళ్లు చెప్పారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. పెద్ద శబ్దం వచ్చేసరికి ఇంటికి తాళం వేసే ధైర్యం కూడా చేయలేకపోయాను. అందరూ పరుగులు తీస్తుండడంతో నేనూ అడ్డదారిలో పరుగులు పెట్టాను. బతుకుతామనుకోలేదు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు.
– ముగ్గు లక్ష్మి, ఇరుసుమండ
వారం రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతాం
ఇరుసుమండ ఓఎన్‌జీసీ గ్యాస్ బావి నుంచి ఎగసిపడుతున్న మంటల్ని పూర్తిగా అదుపు చేసేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మంటల తీవ్రత చాలావరకు తగ్గింది. మా సిబ్బంది బావికి దగ్గరగా చేరుకోగలిగారు. అక్కడి నుంచి శిధిలాలు తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. బావికి మరింత సమీపంగా చేరుకున్నాక పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం క్యాప్ ఎలా బిగించాలి అనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. హైడ్రో కార్బన్స్ మండేటప్పుడు దాని తీవ్రత అడుగున ఉన్న గ్యాస్ నిల్వలపైన ఆధారపడి ఉంటుంది. నిపుణులైన సిబ్బందిని, అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నాం.
– విక్రం సక్సేనా, శాంతనూర్‌దాస్, ఓఎన్‌జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు


