కట్టుకున్నవాడే యముడయ్యాడు.. | Vizag Women Incident | Sakshi
Sakshi News home page

కట్టుకున్నవాడే యముడయ్యాడు..

Feb 25 2026 11:24 AM | Updated on Feb 25 2026 12:05 PM

Vizag Women Incident

విశాఖపట్నం: ఆరిలోవ ప్రాంతంలో మరో దారుణం జరిగింది. దుర్గానగర్‌లో 14 రోజుల కిందట ఓ మహిళ దారుణ హత్యకు గురైన విషయం మరువక ముందే.. తాజాగా బాలాజీనగర్‌లో మరో హత్య చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 11వ వార్డు పరిధిలోని బాలాజీనగర్‌ సాయిబాబా ఆలయం సమీపంలో బి.దేవుడు, దుర్గ (33) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ సిరిపురంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న దేవుడు.. తరచూ ఇంట్లో ఆమెతో గొడవ పడేవాడు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇంట్లోనే దుర్గను చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె మెడకు ఉరితాడు బిగించి, ఇంటికి లోపలి నుంచి గడియ పెట్టి దాక్కున్నాడు. ఉదయం డ్యూటీకి వెళ్లాల్సిన దుర్గ.. తొమ్మిది గంటలైనా బయటకు రాకపోవడం, తలుపులు తెరవకపోవడంతో పెదగదిలికి చెందిన ఆమె స్నేహితురాలు పలుమార్లు ఫోన్‌ చేసింది. ఆమె స్పందించకపోవడంతో వెంటనే దుర్గ తండ్రికి సమాచారం ఇచ్చింది. ఆయన అక్కడికి చేరుకుని చూడగా తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నాయి. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి.. ఆమె మెడకు తాడు బిగించి, కింద పడి ఉంది. 

దుర్గ ఉరి వేసుకుందని భావించిన తండ్రి.. స్థానికుల సాయంతో ఆమెను విమ్స్‌ ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్‌ఐలు కృష్ణ, వరహాలు నాయుడు సాయంత్రం తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి బయట బైక్, లోపల సెల్‌ఫోన్‌ ఉండి, ఆ సమయంలో భర్త కనిపించకుండా పోవడంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. ఇంట్లో క్షుణ్ణంగా గాలించగా.. ఫ్రిజ్‌ వెనుక నక్కిన దేవుడు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, భార్యపై అనుమానంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement