అనంతపురం సెంట్రల్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఎంత వేదన అనుభవించిందో తెలియదు కానీ.. కన్న కుమారుడు వద్దని వారిస్తున్నా... వినకుండా ఆ తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనతో బాలుడి ఒక్కసారిగా చేష్టలుడిగి చూస్తుండిపోయాడు. విషాదకరమైన ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామానికి చెందిన సాయిప్రసాద్ కుమార్తె లలిత (30)కు ఆత్మకూరు మండలానికి చెందిన మోహన్‌కృష్ణతో పదేళ్ల క్రితం వివాహమైంది. పోలీసు కానిస్టేబుల్ కావడంతో అప్పట్లో 15 తులాల బంగారం, రూ.5 లక్షలు నగదును వరకట్నంగా ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి తొమ్మిదేళ్ల వయసున్న కుమారుడు ధర్మయోగి ఉన్నాడు. మోహన్ కృష్ణ ప్రస్తుతం నగరంలోని నివాసముంటూ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
ఎస్పీ దృష్టికి వేధింపులు
పైళ్లైన తొలినాళ్లలో వీరి సంసారం సజావుగా సాగినా... ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఆజాద్ నగర్‌లోని సొంతమింట్లో కుమారుడితో కలసి లలిత నివాసముంటోంది. అదే ఇంట్లో వేరే గదిలో మోహన్ కృష్ణ నివాసముండేవాడు. పలుమార్లు పోలీసు స్టేషన్‌లలో కౌన్సిలింగ్ ఇచ్చినా మోహన్ కృష్ణ తీరు మారలేదు. తాజాగా డీపీఓలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ జగదీస్‌ను లలిత కలసి తన దీన స్థితిని విన్నవించుకుంది. న్యాయం చేయాలని వేడుకుంది. అదే రోజు సాయంత్రం దిశ పీఎస్‌లో దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరినీ ఇంటికి పంపారు. లలిత తల్లిదండ్రులు కూడా రాత్రి కుమార్తె నివాసంలోనే ఉన్నారు. మంగళవారం ఉదయం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. వారు మార్గమధ్యంలో ఉండగానే ఉదయం 8 గంటల సమయంలో మనవడు ధర్మయోగి ఫోన్ చేసి తాతా.. అమ్మ ఉరి వేసుకుందని తెలిపాడు. వారొచ్చే సమయానికి ఉరికి విగతజీవిగా వేలాడుతూ లలిత కనిపించింది.
మనిషి కాదు రాక్షసుడు
‘తొమ్మిదేళ్లుగా తమ కుమార్తెకు నరకం చూపించాడు. వాడు మనిషి కాదు.. రాక్షసుడు’ అంటూ లలిత తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వివాహేతర సంబంధాల మోజులో తమ కుమార్తెను నిత్యం వేధించాడని వాపోయారు. అతన్ని ఉరి తీస్తేనే తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుందని విజప్తి చేశారు. అదనపు కట్నం కోసం వేధించేవాడని, తనకు లవర్ ఉందని, ఆమెతోనే జీవిస్తానంటూ మాటలతోనే హింసించేవాడని వివరించారు. తనకు అందుతున్న పింఛన్ సొమ్ముతోనే కుమార్తె, మనవడిని పోషిస్తున్నట్లు తెలిపారు. మోహన్‌కృష్ణపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఘటనపై నాల్గో పట్టణ సీఐ జగదీష్ మాట్లాడుతూ.. దంపతుల మద్య మనస్పర్థలు ఉన్నాయని, ఇరువురూ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.


