●నీళ్ల సీసా రూ.130 | - | Sakshi
Sakshi News home page

●నీళ్ల సీసా రూ.130

Feb 25 2026 9:01 AM | Updated on Feb 25 2026 9:01 AM

●నీళ్

●నీళ్ల సీసా రూ.130

ఈ ఏడాది జనవరి 30న అనంతపురంలో మున్సిపల్‌ కమిషనర్ల ప్రాంతీయ సమీక్షా సమవేశం నిర్వహించారు. అందులో అధికారులు నీళ్లు తాగేందుకు ఉపయోగించిన గాజు సీసాల కోసం ఏకంగా రూ.రూ. 26,019 మేర బిల్లు (నంబర్‌: 470862/111–2026) పెట్టారు. మొత్తంగా 200 సీసాలు తెస్తే ఒక్కో సీసా రూ.130 వరకు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి హాజరైన వారికి భోజనాలు, హాలు అద్దె, అధికారులు బస చేసిన లాడ్జీలు, అధికారులకు ఇచ్చిన బొకేలు, పూలమొక్కలకు సంబంధించి మరో రూ.30 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.

ఇలా వెలుగులోకి వచ్చినవి కొన్నే. ఇలా చేయని పనులతో పాటు చేసిన పనులకు వెచ్చించిన దానికన్నా అదనపు మొత్తాలు వేసి బిల్లులు పెట్టుకున్నారు. అడిగేవారు లేరని నగరపాలక సంస్థ ఖజానా నుంచి సీ బిల్లుల మాటున దోపిడీ చేసేస్తున్నారు.

వాహనం అద్దె కి.మీ రూ.3 వేలు!

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభి గత నెలలో అనంతపురం పర్యటనకు వచ్చారు. ఆయన సొంత వాహనంలోనే గుత్తిరోడ్డులోని డంపింగ్‌ యార్డుకు వెళ్లారు. నగరపాలక సంస్థ నుంచి డంపింగ్‌ యార్డు 5 కి.మీ లోపు ఉంటుంది. కానీ పట్టాభి డంపింగ్‌యార్డు వరకు వెళ్లి వచ్చేందుకు ప్రత్యేకంగా వాహనం వినియోగించినట్లు బిల్లు రూ. 29,760 (బిల్‌ నంబర్‌ 470854/104–2026) పెట్టారు. ఈ లెక్కన సదరు వాహనానికి కిలో మీటర్‌కు రూ.3 వేల చొప్పున చెల్లించినట్లు సీ బిల్లులు పెట్టుకుని నిధులు కాజేశారు. అదే రోజు పట్టాభి వెంట వచ్చిన సిబ్బంది కోసం మరో వాహనం ఏర్పాటు చేసినట్లు రూ.24,450 బిల్లు (నంబర్‌ 470855/105–2026) డ్రా చేసుకున్నారు.

అనంతపురం క్రైం: నగరపాలక సంస్థలో పందికొక్కులు పడ్డాయి. అడ్డూఅదుపు లేకుండా బిల్లులు పెట్టి భారీ మొత్తంలో ఖజానాకు కన్నం వేస్తున్నాయి. అనంతపురాన్ని సుందరంగా తీర్చిదిద్ది, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని అధికార కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రజలకు సౌకర్యాల మాటేమిటో కానీ కొందరు అధికారులను అడ్డుపెట్టుకుని సంస్థను ఎలా లూటీ చేయాలో అన్ని విధాలాగా చేసేస్తున్నారు. ఇటీవల స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభి నగర పర్యటన, మున్సిపల్‌ కమిషనర్ల ప్రాంతీయ సమీక్ష సమావేశం సందర్భంగా పెట్టిన బిల్లులు చూస్తే షాక్‌ కొడుతున్నాయి. దీన్నిబట్టి నిధుల దోపిడీకి పక్కా వ్యూహం పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకోసం నగరపాలక సంస్థలో ఒక వర్గం ప్రత్యేకంగా పనిచేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈఈ హోదా కలిగిన అధికారి ఏకంగా తన లాగిన్‌ పాస్‌వర్డ్‌ను తన సామాజికవర్గానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌కు తెలిపినట్లు.. ఆయన తనకు కావలసిన బిల్లులు అప్‌లోడ్‌ చేసినట్లు సమాచారం.

అడ్డగోలు దోపిడీ..

చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక అనంతపురం నగరపాలక సంస్థపై అధికార పార్టీ నేతల పెత్తనం పెరిగిపోయింది. సంస్థ పరిపాలనా విభాగంలోనూ చొచ్చుకుపోతున్నారు. అందులో భాగంగానే అధికార పార్టీకి చెందిన పలువురు కాంట్రాక్టర్ల అవతారమెత్తి.. సంస్థ తరఫున ప్రతి పనినీ అందిపుచ్చుకుంటున్నారు. చేసేది కొంత.. దోచేది కొండంత అన్న చందంగా బిల్లులు పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. అత్యవసర పనుల పేరిట పెట్టే ‘సీ బిల్లులు’ వారి పాలిట కల్పతరువుగా మారాయి. ‘సాక్షి’ సేకరించిన బిల్లులను పరిశీలిస్తే అడ్డగోలు వ్యవహారాలు నివ్వెర పరుస్తున్నాయి.

● నగరపాలక సంస్థ కమిషనర్‌ బాలస్వామి అద్దె ఇంట్లో ఉండేవారు. ఆయన నివాసానికి మరమ్మతులు చేయించినందుకు, విద్యుత్‌ సామగ్రి అమర్చినందుకు గాను రూ.35,341 బిల్లు (నంబర్‌:471016/130–2026) పెట్టుకున్నారు.

● ముద్రణ యంత్రం జిరాక్స్‌ మిషన్‌, సామగ్రి కోసం రూ.14,862 బిల్లు (నంబర్‌ 471026/136–2026) పెట్టారు.

● గత జనవరిలో ఆప్రాన్లు, గ్లౌజ్‌లు, మాస్క్‌ల పేరిట రూ.26,786తో బిల్లు (నంబర్‌: 470852/102–2026), మరొక బిల్లు రూ. 28,037 అప్‌లోడ్‌ చేశారు.

● నగర పాలక సంస్థ గడిచిన రెండున్నర నెలల వ్యవధిలో కమిషనర్‌ చాంబర్‌కు పెయింట్‌ వేయించలేదు. అయినా వేసినట్లు రూ.33,040 బిల్లు (నంబర్‌: 471017/131–2026) కాజేశారు.

విచారణ చేస్తే మరిన్ని వెలుగులోకి..

నగర పాలక సంస్థ ద్వారా ఇబ్బడిముబ్బడిగా బిల్లులు అప్‌లోడ్‌ చేయడం.. వీటికి అధికారికంగా ఆమోదం లభించడం అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. పరిశీలనలు, అభ్యంతరాలు ఏవీ ఉండటం లేదు. పెట్టినంత బిల్లు.. మంజూరు చేయించి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు కానీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కానీ ఈ బిల్లులపై విచారణ చేస్తే దోపిడీ తీరు వెలుగులోకి వస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నగరపాలక సంస్థ ఖజానాకు చిల్లు

ఇష్టారాజ్యంగా సీ బిల్లులు

కూటమి నేతలకు అధికారుల అండ

ఖజానాను కొల్లగొడుతున్నా పట్టని ఉన్నతాధికారులు

●నీళ్ల సీసా రూ.130 
1
1/1

●నీళ్ల సీసా రూ.130

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement