నేనేం చేశాను ‘పాప’ం?
ముక్కుపచ్చలారలేదు..
మూడు రోజులైనా నిండనూ లేదు..
అమ్మ ఒడిలో ఒదగాల్సిన పసి గుడ్డు..
ప్లాస్టిక్ సంచిలో కనిపించింది
ఆ తల్లికి ఏమైందో..
ఆడ పిల్లనుకుందో..అప్పుడే భారమైందో..
అత్తింటి ఆరళ్లు పొత్తిళ్ల నుంచి విడదీశాయో.. తప్పు ఎవరిదని ప్రశ్నించలేని తనం..
నేనేం చేశానని నిలదీయలేని హృదయం..
నేనెవరినని చెప్పుకోలేక..
నన్నెందుకు వదిలేస్తున్నారని నిలదీయలేక .. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో..
ముళ్లపొదలే ఇల్లయిన వేళ..
గుక్కపట్టి ఏడుస్తుంటే.. అటుగా వెళ్లేవారు చూసి అయ్యో పాపమని అక్కున చేర్చుకున్నారు.
– బొమ్మనహాళ్:
నేమకల్లులో సంచిలో దొరికిన పసికందు
బొమ్మనహాళ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాప
బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో ముళ్లపొదల్లోంచి మంగళవారం ఓ పసికందు అరుపులు వినిపించాయి. అటుగా వెళ్తున్న స్థానికులకు ఓ సంచి కనిపించింది. తెరిచి చూడగా మట్టు ఆరని మరకలతో ఉన్న ఆడ శిశువును చూసి చలించిపోయారు. సంచిలో నుంచి శిశువును చేరదీసి వైద్యసిబ్బందికి సమాచారం అందించారు. ఆరోగ్య కార్యకర్త చెన్నమ్మ తక్షణమే అక్కడకు చేరుకొని శిశువును బొమ్మనహాళ్ పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. శిశువు ఆరోగ్యంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో శిశువు సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు.
నేనేం చేశాను ‘పాప’ం?


