ఆర్డీటీ పరిరక్షణకు పోస్టు కార్డు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

ఆర్డీటీ పరిరక్షణకు పోస్టు కార్డు ఉద్యమం

Feb 25 2026 9:01 AM | Updated on Feb 25 2026 9:01 AM

ఆర్డీటీ పరిరక్షణకు పోస్టు కార్డు ఉద్యమం

ఆర్డీటీ పరిరక్షణకు పోస్టు కార్డు ఉద్యమం

మార్చి 10న కుందుర్పిలో లాంఛనంగా ప్రారంభం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, సమన్వయకర్త రంగయ్య డిమాండ్‌

అనంతపురం: పేదలకు ఇతోధికంగా సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థ సేవలు కొనసాగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్ధరించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యతో కలిసి అనంత మీడియాతో మాట్లాడారు. ఆర్డీటీ పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మార్చి 10న కుందుర్పిలో పోస్టుకార్డు ఉద్యమం లాంఛనంగా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆర్డీటీ వరం లాంటిదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల అభ్యున్నతి, విద్య, వైద్యం, క్రీడలు, మహళా సాధికారతలో ఆర్డీటీ సేవలు అందించిందని తెలిపారు. కేంద్రం ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్‌ చేయకపోవడంతో గతంలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రతి కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ మద్దతుగా నిలవడమే కాకుండా భాగస్వామ్యం కూడా అయ్యిందని గుర్తు చేశారు. ఓ వైపు ఉద్యమాలు జరుగుతుంటే మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంతో మాట్లాడామని స్వయంగా మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారన్నారు. గతంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, సత్యకుమార్‌ కూడా ఆర్డీటీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని తెలిపారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం ఎమ్మెల్యేలు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లామని, న్యాయం జరుగుతుందని హామీలు ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సానుకూలతా రాలేదన్నారు.

మూతపడే స్థితిలో ఆర్డీటీ

ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్స్‌ కాకపోవడంఓత ఆర్డీటీ సంస్థ మూతపడే స్థితిలో ఉందని కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య తెలిపారు. ఆర్డీటీ అనేది ఒక కులం, మతానికి సంబంధించిదని కాదని.. ఇక్కడి ప్రజలకు సంబంధించినదని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉందని... మంత్రులు సత్యకుమార్‌, పయ్యావుల కేశవ్‌, అహుడా చైర్మన్‌ ఉన్నా ఎందుకు నచ్చజెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. మార్చి 10న కుందుర్పిలో ‘సేవ్‌ ఆర్డీటీ’ పేరుతో నాలుగు భాషల్లో ప్రధాని మోదీకి లక్ష పోస్టుకార్డులు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్‌ నేత చామలూరు రాజగోపాల్‌, జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, శెట్టూరు, బ్రహ్మసముద్రం కన్వీనర్లు హనుమంతరాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆర్‌అండ్‌బీ డివిజన్‌ను తరలించొద్దు

కళ్యాణదుర్గంలోని ఆర్‌అండ్‌బీ డివిజన్‌ కార్యాలయాన్ని శ్రీసత్యసాయి జిల్లాకు తరలించడం తగదని వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ తలారి రంగయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ఆర్‌అండ్‌బీ డివిజన్‌ కార్యాలయాన్ని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్‌అండ్‌బీతో పాటు కళ్యాణదుర్గం కేంద్రంగా డీఎస్పీ, ఆర్డీఓ కార్యాలయాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. పీఏబీఆర్‌ నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర నియోజకవర్గాలకు శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని తెచ్చి ప్రజల దాహార్తి తీర్చామని గుర్తుచేశారు. అప్పట్లో తాను ఎంపీగా, రఘువీరారెడ్డి మంత్రిగా ఉన్నామని పేర్కొన్నారు. వీలైతే కొత్త డివిజన్‌ను తీసుకురావాలే కానీ.. ఉన్న వాటిని తరలించడం తగదన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్‌, రాయదుర్గం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్‌అండ్‌బీ డివిజన్‌ కార్యాలయం కళ్యాణదుర్గం నుంచి తరలిపోకుండా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement