breaking news
Gas leak explosions
-
పచ్చని సుక్షేత్రమే కానీ.. పిన్ను పీకేసిన గ్రనేడ్..
సైరన్ వినిపించినా.. టముకు శబ్దం చెవిని తాకినా.. హఠాత్తుగా కరెంటు ఆపేసినా.. అక్కడ జనం వణికిపోతారు.. తట్టాబుట్టాతో పిల్లాజెల్లాతో బంధువుల ఇళ్లకు బయల్దేరతారు.. కోనసీమలోని 316 గ్రామాలలోని పరిస్థితి ఇది. కోనసీమ అంటే.. అఖండ గోదావరి ఏడు పాయలుగా విచ్చుకున్న సుందరప్రదేశం.. గలగలపారే కాలువల నడుమ వరిపైర్లు.. కొబ్బరితోటలు.. అరటివనాలతో ఆహ్లాదాన్ని పంచే అందమైన ప్రాంతం. కానీ.. అందరికీ తెలియని కోనసీమ మరొకటుంది. చిన్న శబ్దానికే చిగురుటాకులా వణికిపోయే ప్రాంతం అది.. దానికి కారణం చమురు, సహజవాయువు నిక్షేపాలు.. ఆ సంపదను ఒడిసిపట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు.. అందుకే కోనసీమ అంటే.. పిన్ను పీకేసిన గ్రనేడ్.. అది ఏ క్షణంలో ఎక్కడ పేలుతుందో ఎక్కడ మండుతుందో.. ఇరుసుమండలో మండుతున్న ఓఎన్జీసీ బావి తాజా దృష్టాంతం.. అది ఓ సజీవ సాక్ష్యం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీకి చెందిన మోరి–5వ నంబర్ బావి వద్ద ఈ నెల 5న భారీ బ్లోఅవుట్ సంభవించింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో చుట్టుపక్కల భీతావహ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. మంటల తీవ్రత తగ్గినప్పటికీ బ్లోఅవుట్ ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ముందుజాగ్రత్తగా ఇరుసుమండ, లక్కవరం గ్రామాలను ఖాళీ చేయించారు. మంటలు అదుపులోకి రావడానికి వారం రోజులు పడుతుందని అంచనా.కోనసీమ కాదు బ్లో అవుట్ల సీమ.. కోనసీమలో చమురు, సహజవాయు సంస్థ ఓఎన్జీసీ జరుపుతున్న తవ్వకాలలో భాగంగా నిత్యం ఏదో ఒకమూల చిన్నపాటి బ్లోఅవుట్లు, గ్యాస్ లీక్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కానీ ఓఎన్జీసీ నిపుణులు వెంటనే అరికట్టేస్తుం టారు. అందువల్ల వాటి గురించి జనబాహు ళ్యానికి పెద్దగా తెలియదు. రికార్డులకూ ఎక్కవు. భారీ బ్లోఅవుట్ అయితేనే ప్రపంచానికి తెలుస్తుంది. అలాంటివాటిలో కొన్ని..తొలి బ్లోఅవుట్ కొమరాడలో..1993 మార్చిలో మామిడికుదురు మండలం కొమరాడలోని ఓఎన్జీసీ సైట్లో బ్లోఅవుట్ సంభవించింది. లీకైన గ్యాస్ బురద నీటిలో కలిసింది.. ఆ ప్రాంతంలో పలుచోట్ల మంటలు ఎగసిపడి, కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. కొన్ని రోజుల తర్వాత లీక్ అదుపులోకొచ్చింది..ప్రపంచంలోనే పెద్దది.. పాశర్లపూడి బ్లోఅవుట్1995 జనవరి 8న మామిడికుదురు మండలం పాశర్లపూడిలో పెద్దఎత్తున గ్యాస్ లీకైంది. పాశర్లపూడిృ19 బావి వద్ద డ్రిల్లింగ్ సమయంలో ఏర్పడిన గ్యాస్ లీక్‌కు నిప్పురవ్వ తోడవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దాదాపు 65 రోజులపాటు కొనసాగాయి. ప్రమాదం సంభవించిన రిగ్గుకు రెండు కిలోమీటర్ల పరిధిలోని ఏడు గ్రామాలలో దాదాపు 5వేలకుపైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. ఓఎన్జీసీ అంతర్జాతీయ నిపుణులను సంప్రదించింది. చివరకు స్థానిక నిపుణుల బృందమే బావిని మూసివేయగలిగింది. మార్చి 15న మంటలు అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీకి రూ.16 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రమాద ప్రదేశంలో ధ్వంసమైన రిగ్గు ఖరీదు రూ.9కోట్లు. రూ.7 కోట్ల విలువైన ఇతర పరికరాలు ధ్వంసమయ్యాయి. వీటికి క్రైసిస్ మేనేజ్మెంట్ ఖర్చులు అదనం. ప్రపంచంలోనే పెద్ద బ్లోఅవుట్‌గా పేరు తెచ్చుకున్న ఈ ప్రమాదంలో రోజుకు వంద క్యూబిక్ మిలియన్ల గ్యాస్ వృథాగా మండిపోయింది. బ్లో అవుట్ జరిగేది ఇలా.. భూగర్భంలో ఉండే విపరీతమైన గ్యాస్ ఒత్తిడిని నియంత్రించలేని పరిస్థితుల్లో గ్యాస్బావిలోని పైప్లైన్లు లేదా ఇతర పరికరాల రాపిడి వల్ల నిప్పురవ్వలు ఏర్పడి మంటలు చెలరేగుతాయి. బావులు తవ్వుతున్నప్పుడు ఓఎన్జీసీ సిబ్బంది పైపులను దింపడం.. అవసరమైతే పైకి తీయడం చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలోనే నిప్పురవ్వలు రాజుకుంటాయి. గ్యాస్ బావుల తవ్వకంలో సాంకేతిక లోపాలు, పైప్లైన్ల నిర్వహణలో లోపాలు లేదా తుప్పుపట్టడం వంటి పరిస్థితులు బ్లోఅవుట్లకు కారణమవుతాయని నిపుణులంటున్నారు. పాశర్లపూడి గ్యాస్ బావి నుంచి పైపులను పైకి తీస్తున్న సమయంలో ఒక పరికరం జారి బోర్‌వెల్‌లో ఇరుక్కుపోయింది. అది పైపులకు అడ్డుపడగా.. అవి ఎక్కడికక్కడ బిగుసుకుపోయాయి. వీటిని బయటకు తీయటానికి లాగే క్రమంలో ఒరిపిడికి పుట్టిన నిప్పు రవ్వలతో గ్యాస్ అంటుకుంది. ఆ మంట బోర్వెల్లోకి దూసుకెళ్తున్న సమయంలో పాశర్లపూడి ప్రాంతంలో భూమి పెద్దగా కంపించింది. బోర్‌వెల్‌లో ఉన్న పైపులు పెద్ద శబ్దంతో పైకి ఎగిరి కొన్ని కిలోమీటర్ల దూరంలో పడ్డాయి. ప్రాణాలు పోతాయనుకున్నా డ్వాక్రా సంఘం డబ్బులు రూ.30 వేలు మోటార్ సైకిల్ బ్యాగులో పెట్టుకుని బ్యాంకులో కట్టేందుకు సిద్ధమవుతున్నాను. ఇంతలో గ్యాస్ ఎగజిమ్మి శబ్దం రావడంతో గ్రామంలో యువకులు హెచ్చరించారు. ఆందోళనతో మోటార్ సైకిల్ స్టార్ట్ చేయలేక కట్టుబట్టలతో పారిపోయా. పరుగెడుతుండగానే ప్రాణాలు పోతానుకున్నా. ఇలా బతికి వస్తాననుకోలేదు. మోటార్ సైకిల్‌ను దొంగలు పట్టుకుపోతుంటే యువకులు అడ్డుకుని నాకు తెచ్చి ఇచ్చారు. – వలవల సత్యనారాయణ, ఇరుసుమండభయంతో పారిపోయా.. బ్లో అవుట్ భయంతో ఇల్లు విడిచి పారిపోయాను. వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఏ వస్తువులు పోయాయో చూసుకుంటున్నాను. ఎవరు సాయం చేస్తారో తెలియడం లేదు. ఇంకా ఆ భయం వీడడం లేదు. చుట్టూ ఓఎన్జీసీ బావులే ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి మా ప్రాణాలకు రక్షణ కలి్పంచాలి. – చేట్ల రామలక్ష్మి, ఇరుసుమండబతుకుతామనుకోలేదు ఇంట్లో పని చేసుకుంటున్నాను. ఇంతలో భారీ శబ్దం వచ్చింది. బయటకు వచ్చేసరికి గ్యాస్ ఎగదన్నుతోందని పక్కవాళ్లు చెప్పారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. పెద్ద శబ్దం వచ్చేసరికి ఇంటికి తాళం వేసే ధైర్యం కూడా చేయలేకపోయాను. అందరూ పరుగులు తీస్తుండడంతో నేనూ అడ్డదారిలో పరుగులు పెట్టాను. బతుకుతామనుకోలేదు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. – ముగ్గు లక్ష్మి, ఇరుసుమండవారం రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతాం ఇరుసుమండ ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి ఎగసిపడుతున్న మంటల్ని పూర్తిగా అదుపు చేసేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మంటల తీవ్రత చాలావరకు తగ్గింది. మా సిబ్బంది బావికి దగ్గరగా చేరుకోగలిగారు. అక్కడి నుంచి శిధిలాలు తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. బావికి మరింత సమీపంగా చేరుకున్నాక పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం క్యాప్ ఎలా బిగించాలి అనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. హైడ్రో కార్బన్స్ మండేటప్పుడు దాని తీవ్రత అడుగున ఉన్న గ్యాస్ నిల్వలపైన ఆధారపడి ఉంటుంది. నిపుణులైన సిబ్బందిని, అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నాం. – విక్రం సక్సేనా, శాంతనూర్‌దాస్, ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు -
అన్నా క్యాంటీన్లో భారీ పేలుడు..
సాక్షి, వైఎస్సార్: అన్నా క్యాంటీన్ తయారీ వంటశాలలో భారీ పేలుడు ఘటన సంభవించింది. పేలుడు థాటికి వంటశాల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. భారీ పేలుడుతో కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అయితే, పేలుడు ఘటన బయటకు రాకుండా పచ్చ మీడియా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.వివరాల ప్రకారం.. కడపలో అన్నా క్యాంటీన్ తయారీ వంటశాలలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ వంటశాలలో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పేలుడు సంభవించింది. వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పేలుడు థాటికి వంటశాల షెడ్ ధ్వంసమైంది. 200 అడుగుల మేరా ఎగిరిపడ్డ బాయిలర్, వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి.పేలుడు రాత్రి సమయంలో సంభవించడంతో ప్రాణ నష్టం తప్పింది. వంటలు వండకపోవడం.. సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, భారీ పేలుడుతో కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. పేలుడు ఘటనను ఎవరి కంట పడకుండా పచ్చ నేతలు కప్పి ఫుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. -
గ్యాస్ లీకేజీ : మూడు ఇళ్లు ధ్వంసం
రామసముద్రం : గ్యాస్ సిలిండర్ లీకై వచ్చిన పెను శబ్దానికి మూడు ఇళ్లు ధ్వంసమైన సంఘటన శుక్రవారం మండలంలోని కుదురు చీమనపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామంలోని ఆర్.ఈశ్వర్‌రెడ్డి ఇంట ఉదయం వంట చేసి, సిలిండర్ రెగ్యులేటర్ ఆ ఫ్ చేయడం మరచారు. తలుపులు వేసుకుని పొలం పనులకు వెళ్లిపోయారు. ఆ సమయంలో రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీకైంది. తలుపులన్నీ మూసి ఉండడంతో అది బయటకు వెళ్లే మార్గం లేక ఇల్లంతా వ్యాపిం చింది. బెలూన్ను అదే పనిగా ఊదుతూ ఉంటే ఒక స్థితికి వచ్చేసరికి అది ఢామ్మనడం విదితమే. అదే తరహాలో ఈ ఇంట గ్యాస్ ఇల్లంతా వ్యాపించి ప్రమాదానికి దారితీసింది. గ్యాస్ ఇల్లంతా వ్యాపించి ఒత్తిడి ఎక్కువై ఉన్న తరుణంలో కరెంటు వచ్చింది. దీంతో పేలుడు తరహాలో ఆ ఇంట పెద్దపెట్టున శబ్దం వచ్చింది. దీని ధాటికి ఇంటి గోడలు, పైకప్పులతో కూలిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లోని వస్తుసామగ్రి మొత్తం ధ్వంసమైంది. అలాగే పక్కనే ఉన్న ఈశ్వర్‌రెడ్డి సోదరుడు రామచంద్రారెడ్డి ఇంటి గోడలు, పొరుగునే ఉన్న ఎన్.శ్రీనివాసులురెడ్డి ఇంటి గోడలు సైతం కూలిపోయాయి. అతని ఇంటి ఆవరణలోని ద్విచక్రవాహనం సైతం ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇక, పెద్దపెట్టున శబ్దం రావడంతో గ్రామస్తులు హడలిపోయారు. పరుగున అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఈశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నారు. భూకంపం వస్తే నేలమట్టమైన తరహాలో ఉన్న తమ ఇంటిని చూసి భోరున విలపించారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని వాపోయారు. గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎస్ఐ శివశంకర్, తహసీల్దార్ రామచంద్రయ్య, ఎంపీడీఓ మస్తాన్‌వల్లి, పంచాయతీ కార్యదర్శి వసుంధర, వీఆర్ఓ రామ్మూర్తి తదితరులు అక్కడికి చేరుకుని ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ చేశారు. సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. బాధితుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : ఎమ్మెల్యే డిమాండ్ కుదురుచీమనపల్లెలో గ్యాస్ లీకై సంభవించిన ప్రమాదాన్ని తెలుసుకున్న మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి బాధితులను పరామర్శించారు. కూలిపోయిన గృహాలను పరిశీలించారు. బాధితులు, అధికారులతో ఆయన మాట్లాడారు. రూ.60 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుం బాలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కడికక్కడే అగ్నిమాపక సిబ్బంది ఆస్తి నష్టంపై ఫోన్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపి ఆదుకోవాలని సూచించారు. ఇక, గ్రామస్తులు పుంగనూరు ఇండేన్ గ్యాస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ కన్వీనర్ భాస్కర్‌గౌడు, సింగిల్‌విండో చైర్మన్ కేశవరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వెంకట్ర మణ, నాయకులు కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ వాడకంపై అవగాహన పుంగనూరు అగ్నిమాపకాధికారి బాలసుబ్రమణ్యం, సిబ్బంది సుబ్బరాజు, లక్ష్మీనారాయణ, ఆనంద్ గ్యాస్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్యాస్ వాడకంలో అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలూ సంభవించవన్నారు. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రదేశంలో ధారాళంగా వెలుతురూ, గాలి ప్రసరించేలా వెంటిలేటర్లు ఉండాలన్నారు. గ్యాస్ పొయ్యి మీద వంట పనులు పూర్తి అయ్యాక రెగ్యులెటర్ ఆఫ్ చేయాలన్నారు. ఆన్‌లో పెట్టి ఆదమరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. -
గురుకులంలో గ్యాస్ మంటలు
అన్నపురెడ్డిపల్లి భద్రాద్రి జిల్లా : స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం వంట గ్యాస్ లీకవడంతో మంటలు చెలరేగాయి. అక్కడి ఉపాధ్యాయులు, సిబ్బంది తెలిపిన వివరాలు... ఈ పాఠశాలలోని వంట గదిలో ఉదయం విద్యార్థినులకు టిఫిన్(పూరి)ను సిబ్బంది తయారు చేస్తున్నారు. ఆ సమయంలో గ్యాస్ పైపు నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీనితో సిబ్బంది వెంటనే అప్రమత్తులయ్యారు. స్థానికుల సాయంతో ఆ గ్యాస్ సిలెండర్‌ను బయటకు తీసుచ్చి మంటలను అదుపు చేశారు. వంట గదిలో మంటలు వ్యాపించినప్పుడు అక్కడ నలుగురు సిబ్బంది ఉన్నారు. వంట గదిలో మంటలు చెలరేగడంతో విద్యార్థినులు భయాందోళనతో పాఠశాల నుంచి బయటకు పరుగు తీశారు. ఈ పాఠశాలలో మొత్తం 230 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆర్సీఓ సందర్శన గ్యాస్ లీకై మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న వెంటనే ఈ పాఠశాలను ఉమ్మడి జిల్లాల గిరిజన గురుకులాల రీజనల్ కో–ఆర్టినేటర్ బురాన్ సందర్శించారు. ఉపాధ్యాయులు, వంట సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్ లీకవడం, మంటలు చెలరేగడంపై పూర్తి స్థాయి నివేదికను ఐటీడీఏ పీఓకు, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శికి పంపనున్నట్టు విలేకరులతో చెప్పారు. -
గ్యాస్ పేలుళ్లు : 15 మంది మృతి
తైపీ: తైవాన్ కోషియంగ్ నగరంలో గ్యాస్ పేలుడు సంభవించింది. ఆ ప్రమాదంలో 15 మంది మరణించారు. 233 మంది గాయపడ్డారని నగర మేయర్ చెన్ చు వెల్లడించారు. మృతుల్లో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. గ్యాస్ పేలుడు వల్ల ఆ పక్కనే ఉన్న నివాసాలకు మంటలు వ్యాపించాయని... దాంతో అగ్నికీలలు భారీగా ఎగసి పడ్డాయని చెప్పారు. మంటలార్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ మంటలకు ఆహుతి అయ్యారని వివరించారు. నిన్న రాత్రి చోటు చేసుకున్న ఆ దుర్ఘటనలో సహాయక చర్యలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ దశాబ్ద కాలంలో జరిగిన అత్యంత దారుణ సంఘటన అని చెన్ అన్నారు.


