గురుకులంలో గ్యాస్‌ మంటలు

Gas leaked fire  In Annapureddypalli Gurukula School - Sakshi

అన్నపురెడ్డిపల్లి భద్రాద్రి జిల్లా : స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం వంట గ్యాస్‌ లీకవడంతో మంటలు చెలరేగాయి. అక్కడి ఉపాధ్యాయులు, సిబ్బంది తెలిపిన వివరాలు... ఈ పాఠశాలలోని వంట గదిలో ఉదయం విద్యార్థినులకు టిఫిన్‌(పూరి)ను సిబ్బంది తయారు చేస్తున్నారు.

ఆ సమయంలో గ్యాస్‌ పైపు నుంచి ఒక్కసారిగా గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించాయి. దీనితో   సిబ్బంది వెంటనే అప్రమత్తులయ్యారు. స్థానికుల సాయంతో ఆ గ్యాస్‌ సిలెండర్‌ను బయటకు తీసుచ్చి మంటలను అదుపు చేశారు.

వంట గదిలో మంటలు వ్యాపించినప్పుడు అక్కడ నలుగురు  సిబ్బంది ఉన్నారు. వంట గదిలో మంటలు చెలరేగడంతో విద్యార్థినులు భయాందోళనతో పాఠశాల నుంచి బయటకు పరుగు తీశారు. ఈ పాఠశాలలో మొత్తం 230 మంది విద్యార్థినులు ఉన్నారు. 

ఆర్‌సీఓ సందర్శన 

గ్యాస్‌ లీకై మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న వెంటనే ఈ పాఠశాలను ఉమ్మడి జిల్లాల గిరిజన గురుకులాల రీజనల్‌ కో–ఆర్టినేటర్‌ బురాన్‌ సందర్శించారు. ఉపాధ్యాయులు, వంట సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్‌ లీకవడం, మంటలు చెలరేగడంపై పూర్తి స్థాయి నివేదికను ఐటీడీఏ పీఓకు, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శికి పంపనున్నట్టు విలేకరులతో చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top