breaking news
Annapureddy Palli
-
గురుకులంలో గ్యాస్ మంటలు
అన్నపురెడ్డిపల్లి భద్రాద్రి జిల్లా : స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం వంట గ్యాస్ లీకవడంతో మంటలు చెలరేగాయి. అక్కడి ఉపాధ్యాయులు, సిబ్బంది తెలిపిన వివరాలు... ఈ పాఠశాలలోని వంట గదిలో ఉదయం విద్యార్థినులకు టిఫిన్(పూరి)ను సిబ్బంది తయారు చేస్తున్నారు. ఆ సమయంలో గ్యాస్ పైపు నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీనితో సిబ్బంది వెంటనే అప్రమత్తులయ్యారు. స్థానికుల సాయంతో ఆ గ్యాస్ సిలెండర్‌ను బయటకు తీసుచ్చి మంటలను అదుపు చేశారు. వంట గదిలో మంటలు వ్యాపించినప్పుడు అక్కడ నలుగురు సిబ్బంది ఉన్నారు. వంట గదిలో మంటలు చెలరేగడంతో విద్యార్థినులు భయాందోళనతో పాఠశాల నుంచి బయటకు పరుగు తీశారు. ఈ పాఠశాలలో మొత్తం 230 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆర్సీఓ సందర్శన గ్యాస్ లీకై మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న వెంటనే ఈ పాఠశాలను ఉమ్మడి జిల్లాల గిరిజన గురుకులాల రీజనల్ కో–ఆర్టినేటర్ బురాన్ సందర్శించారు. ఉపాధ్యాయులు, వంట సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్ లీకవడం, మంటలు చెలరేగడంపై పూర్తి స్థాయి నివేదికను ఐటీడీఏ పీఓకు, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శికి పంపనున్నట్టు విలేకరులతో చెప్పారు. -
దేవాలయ భూముల్లో లొల్లి
-
దేవుడి భూముల్లో లొల్లి
భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లిలో ఉద్రిక్తత - 50 ఎకరాల్లో ఆదివాసీల పంటలు ధ్వంసం చేసిన అధికారులు - 20 ట్రాక్టర్లతో వరి, మిర్చి పంటల తొలగింపు - ఎదురుతిరిగిన ఆదివాసీలు.. విల్లంబులు, కారంతో ప్రతిఘటన అన్నపురెడ్డిపల్లి: అవి దేవాలయ భూములు.. ఆదివాసీలు అందులో పంటలు సాగు చేశారు.. అక్రమం అంటూ అధికారులు పొలాలపై పడ్డారు.. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో వచ్చి సుమారు 50 ఎకరాల్లో వరి, మిర్చి పంటలను 20 ట్రాక్టర్లతో తొక్కించేశారు! విషయం తెలుసుకున్న ఆదివాసీలు విల్లంబులు, కారంతో ఎదురుతిరిగారు. దీంతో పోలీసులు, ఆదివాసీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన అధికారగణం.. అన్నపురెడ్డిపల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి 2,308 ఎకరాల భూములు అగ్రహారంగా ఉన్నాయి. అందులో తొట్టిపంపు గ్రామానికి చెందిన ఆదివాసీలు 645 ఎకరాల్లో, గిరిజనేతరులు మరో 684 ఎకరాల్లో కౌలు సేద్యం చేస్తున్నారు. అయితే 1996–97 నుంచి ఆదివాసీలు కౌలు చెల్లించడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో కొందరు ‘ఆదివాసీ సేన ఉద్యమం’పేరిట గిరిజనేతర రైతుల ఆధీనంలో ఉన్న దేవాలయ భూముల్లో పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో ఘర్షణలు జరగడంతో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఇరువర్గాలతో చర్చించారు. ఎంజాయ్మెంట్ సర్వే జరిగే వరకు సదరు భూముల్లోకి రెండు వర్గాల వారు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదివాసీలు వెంకన్నస్వామికి చెందిన అన్నదైవం ప్రాజెక్ట్ ఆయకట్టులోని సుమారు 50 ఎకరాల భూముల్లో సేద్యం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ఆ పంటలను ధ్వంసం చేయాలని అటవీ, రెవెన్యూ, దేవాదాయ, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు మంగళవారం తెల్లవారుజామున వెళ్లి పంటలను తొక్కించేశారు. విల్లంబులు ఎక్కుపెట్టిన ఆదివాసీలు.. తమ పంటలను ధ్వంసం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆదివాసీలు విల్లంబులు, కారం తీసుకుని పొలాల్లోకి వచ్చారు. పంటల్ని నాశనం చేయొద్దంటూ అధికారులపై ఎదురుతిరిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు, తోపులాట చోటుచేసుకున్నాయి. ఒక దశలో ఆదివాసీలు అధికారులపై విల్లంబులు ఎక్కుపెట్టారు. కారం చల్లుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఘర్షణ అనంతరం పోలీసులు 62 మంది ఆదివాసీలను అదుపులోకి తీసుకుని చండ్రుగొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొత్తగూడెం డీఎస్పీ సురేందర్‌రావు పర్యవేక్షణలో జూలూరుపాడు, పాల్వంచ, అశ్వారావుపేట, కొత్తగూడెం సీఐలు, పది మంది ఎస్సైలు, 70 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, మరో 100 మంది పోలీసులు, 40 మంది అటవీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.