క్రెడిట్ కార్డులు సులభంగా లభ్యం కావడం..‘ఇప్పుడే కొనండి, తర్వాత చెల్లించండి’ లాంటి సరికొత్త చెల్లింపు విధానాలు అందుబాటులో ఉండటం నేటి యువతను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. సంగీత కచేరీలు, విదేశీ ప్రయాణాలు, విలాసవంతమైన జీవనశైలి కోసం ‘జెన్ జీ’ అంటే నేటి తరం యువత ఆలోచించకుండా ఖర్చు చేస్తుండటం దేశ ఆర్థిక భవిష్యత్తుగా ముప్పగా పరిణిమిస్తోంది. రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకోకుండా క్షణికానందం కోసం చేస్తున్న ఈ అప్పుల ప్రయాణంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిఘా పెట్టింది.
విలాసాల కోసం పెరిగిన అప్పుల భారం
నేటి యువత తమ జీవనశైలిని మెరుగుపరచుకునే పేరుతో భారీగా అప్పులు చేస్తోంది. ముంబైకి చెందిన ఇద్దరు యువతులు తమ తల్లితో కలిసి దక్షిణ కొరియాలో జరిగిన ‘బీటీఎస్’ సంగీత కచేరీకి వెళ్లేందుకు క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా ఉపయోగించారు. అదేవిధంగా గతంలో థాయ్‌లాండ్ విహారయాత్రకు వెళ్లిన ఒక జంట తమ బడ్జెట్‌కు మించి ఖర్చు చేసి, ఆ తర్వాత నగదు సర్దుబాటు కోసం నానా ఇబ్బందులు పడ్డారు. చిన్న విలాసాల కోసం రుణాలపై ఆధారపడటం భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది.
రికార్డు స్థాయిలో పెరుగుతున్నరుణాలు
దేశంలో గృహ రుణాలు సాధారణ వృద్ధిని కనబరుస్తున్నప్పటికీ, వినియోగం కోసం తీసుకునే గృహేతర రిటైల్ రుణాల జోరు అంతా ఇంతా కాదు. మార్చి 2026 నాటికి ఈ రుణాలు మొత్తం గృహ రుణాల్లో ఏకంగా 58.4 శాతానికి చేరుకున్నాయి. కేవలం ఏడేళ్ల వ్యవధిలో ప్రతి రుణగ్రహీతపై సగటు బకాయి రుణం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలు, ఇతర వ్యక్తిగత రుణాల పరిమాణం కోట్లాది రూపాయలకు ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ నిపుణులు అప్రమత్తమయ్యారు.
ఫిన్‌టెక్ సంస్థల ఆధిపత్యం
రూపాయి నోట్లతో పని లేకుండా కేవలం ఒక్క క్లిక్‌తో లభించే చిన్న వ్యక్తిగత రుణాలను ఫిన్‌టెక్ కంపెనీలు విరివిగా అందిస్తున్నాయి. యాభై వేల రూపాయల కంటే తక్కువ రుణాలు ఇచ్చే ఈ రంగంలో ఫిన్‌టెక్ సంస్థలు భారీ మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నాయి. అయితే, ఈ రుణాల్లో సకాలంలో చెల్లించకపోవడంతో ఏర్పడే డిఫాల్ట్ లేదా డెలిన్క్వెన్సీ రేటు ఆందోళనకరంగా మారుతోంది. ఈ రుణగ్రహీతలలో సగానికి పైగా 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారే ఉండటం గమనార్హం.
చిన్న వయస్సులోనే రుణభారం
గతంతో పోలిస్తే నేటి యువత చాలా చిన్న వయస్సులోనే రుణాల వలలో చిక్కుకుంటున్నారు. 1960, 70లలో ప్రజలు తమ ముప్ఫైల చివరలో మొదటిసారిగా గృహ లేదా ఇతర రుణాల ద్వారా క్రెడిట్ వ్యవస్థలోకి ప్రవేశించేవారు. కానీ, నేటి జెన్ జీ యువత 22 ఏళ్ల ప్రాయంలోనే మొబైల్ గ్యాడ్జెట్లు, చిన్న రుణాలు, క్రెడిట్ కార్డుల వాడకంతో ఆర్థిక వ్యవస్థలోకి అడుగుపెడుతున్నారు. దీనివల్ల ఆర్థిక పరిపక్వత లేని వయస్సులోనే వారు భారీ వడ్డీ భారాలను మోయాల్సి వస్తోంది.
విదేశీ పర్యటనల కోసం..
దేశంలో గత కొద్ది సంవత్సరాలుగా పెద్ద ఎత్తున జరుగుతున్న మ్యూజిక్ కాన్సర్ట్‌లు, విదేశీ పర్యటనల వెనుక యువత క్రెడిట్ కార్డుల హస్తం బలంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అంచనాల ప్రకారం, గత రెండు సంవత్సరాల్లో కేవలం సంగీత కచేరీల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఎయిర్‌బీఎన్బీ నివేదిక ప్రకారం, 60 శాతానికి పైగా యువకులు విహారయాత్రలు, ఈవెంట్లలో పాల్గొనేందుకు తమ నెలవారీ సంపాదనలో గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు.
ఆర్‌బీఐ హెచ్చరికలు.. భవిష్యత్తు ముప్పు
తక్కువ రేటింగ్ ఉన్న రుణగ్రహీతలు, అసురక్షిత రిటైల్ రుణాల పెరుగుదలపై ఆర్‌బిఐ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఆర్థిక వాతావరణం దెబ్బతింటే, అప్పులు తీసుకున్న వారి నగదు ప్రవాహం పూర్తిగా నిలిచిపోయి అసెట్ క్వాలిటీ తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్షణ ఆనందాల కోసం అప్పులు చేసే ఈ ధోరణిని యువత నియంత్రించుకోకపోతే వ్యక్తిగత ఆర్థిక జీవితం ఛిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రైల్వేశాఖ నిధులతో తీసిన ఏకైక సీరియల్ చూశారా?


