హరిద్వార్: దేశంలోని విద్యా వ్యవస్థపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కూడా ఉండడం లేదని ఆవేదన చెందారు. విద్యుత్, నీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేక.. విద్యార్థులు ఉపాధ్యాయులు, ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాను నిరసన చేపడతానని హెచ్చరించారు.
హరిద్వార్‌లో శనివారం ఆయన స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. “దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది” అని పేర్కొన్నారు. “పుస్తకాలు ఉన్నాయి, కానీ ఉపాధ్యాయులు లేరు; ఉపాధ్యాయులు ఉన్నారు, కానీ పుస్తకాలు లేవు. పుస్తకాలు ఉన్నా ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. సరైన మౌలిక వసతులు, బోధనా వనరులు లేకపోవడంతో విద్యార్థులు చిన్న పాఠశాలలను వదిలి వెళ్లిపోతున్నారని తెలిపారు.
ప్రశ్నపత్రాల లీకేజీపైనా విమర్శలు
పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని కూడా రామ్‌దేవ్ ప్రస్తావించారు. ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం విద్యార్థులు క్రమంగా పోటీ పరీక్షలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. 10, 12 తరగతుల బోర్డు పరీక్షల ప్రస్తుత ప్రాధాన్యతపైనా ప్రశ్నలు లేవనెత్తారు. విద్యార్థుల ఉన్నత విద్య ప్రవేశాలు ఎక్కువగా పోటీ ప్రవేశ పరీక్షల ఆధారంగా నిర్ణయించబడుతున్న పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
చదవండి: అన్నాడీఎంకేకు మరో దెబ్బ.. అప్సరా రెడ్డి రాజీనామా
జెన్‌జీ బాగానే ఉన్నారు కానీ..
దేశంలోని అనేక మంది యువత మంచి మార్గంలో రాణిస్తున్నప్పటికీ.. కొందరు హింస, ధూమపానం, మద్యపానం, అస్థిర సంబంధాల వంటి ధోరణుల్లో చిక్కుకుంటున్నారని రామ్‌దేవ్ అన్నారు. జెన్‌జీ యువత అందరినీ ఒకే కోణంలో చూడకూడదని సూచించారు. “చాలా మంది జెన్‌జీ యువత బాగా రాణిస్తున్నారు. అయితే కొందరు హింసకు పాల్పడుతున్నారు, పలువురు బాయ్‌ఫ్రెండ్లు లేదా గర్ల్‌ఫ్రెండ్లను కలిగి ఉంటున్నారు. మరికొందరు బీడీలు, సిగరెట్లు కాల్చడం, మద్యం సేవించడం చేస్తున్నారు” అని రామ్‌దేవ్ అన్నారు.
రాహుల్ గాంధీకి కౌంటర్
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బాబా రామ్‌దేవ్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి సంయమనంతో వేచిచూడాలని హితవు పలికారు. కులం, వర్గం, సమాజం పేరుతో ప్రజల మధ్య విభజనలు సృష్టించరాదని పేర్కొన్నారు. “దేశం మిమ్మల్ని ప్రధానమంత్రిని చేయాలనుకుంటే, కొంత ఓపిక పట్టండి” అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విభేదాలు సహజమేనని, అయితే అవి వ్యక్తిగత శత్రుత్వంగా మారకూడదని ఆయన ఆకాంక్షించారు.


