లోక్‌సభలో కొనసాగిన ప్రతిష్టంభన | Parliament Deadlock Over NEET paper leak, Opposition Mps slogans | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో కొనసాగిన ప్రతిష్టంభన

Aug 13 2026 5:22 AM | Updated on Aug 13 2026 5:22 AM

Parliament Deadlock Over NEET paper leak, Opposition Mps slogans

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో చివరి దశలోనూ ప్రతిష్టంభనకు తెరపడలేదు. నీట్‌ పేపర్‌ లీకేజీపై నిరసనకు దిగిన విద్యార్థులపై పోలీసుల దమనకాండ పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాలని లోక్‌సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తంచేశారు.

 కేంద్ర హోంమంత్రి సభకు రావాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ.. అధికార పక్షంతో ప్రతిపక్షానికి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ సభ సజావుగా సాగాలని దేశం కోరుకుంటోందని అన్నారు. నిరసనలు, నినాదాలతో సభ ప్రతిష్టను దెబ్బతీయడం సరైంది కాదని సూచించారు. 

సభలో కార్యకలాపాలకు సహకరించాలని, చర్చలో పాల్గొనాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.అయినప్పటికీ ప్రతిపక్షాలు వినిపించుకోకపోవడంతో సభను మధ్యా హ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లును జేపీసీ పరిశీలనకు పంపించే తీర్మానాన్ని ఆమోదించారు. ప్రతిపక్షాల నినాదాలు ఆగకపోవడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారంభమైంది. ‘గనులు, ఖనిజాల బిల్లు’ను ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు.  

ప్రతిపక్షం పారిపోకూడదు: రిజిజు  
నీట్‌ పేపర్‌ లీక్‌తోపాటు విద్యార్థుల నిరసనపై తక్షణమే చర్చను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి సంబంధించి కేంద్ర హోమంత్రి అమిత్‌ షా ఇప్పటికే స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి హోంమంత్రి సిద్ధంగా ఉన్నప్పుడు, చర్చ నుంచి ప్రతిపక్షం పారిపోకూడదని అన్నారు. జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనల అంశాన్ని అధికార ఎన్డీయే సభ్యులు లేవనెత్తడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. 

దాంతో సభను గురువారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అంతకుముందు ఉదయం లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు మూడు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ముగిశాయి. జూలై 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా ప్రశ్నోత్తరాలు పూర్తిగా జరగలేదు. విద్యార్థుల నిరసనలు, అయోధ్య రామాలయ విరాళాల చోరీ వంటి అంశాలపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ కారణంగా ఈసారి వర్షాకాల సమావేశాలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement