బలూచ్‌కు భారత్‌ మద్దతు.. ఉలిక్కిపడిన పాక్‌! | Baloch leader pushes for international recognition of Republic of Balochistan | Sakshi
Sakshi News home page

బలూచ్‌కు భారత్‌ మద్దతు.. ఉలిక్కిపడిన పాక్‌!

Aug 12 2026 8:34 AM | Updated on Aug 12 2026 8:34 AM

Baloch leader pushes for international recognition of Republic of Balochistan

క్వెట్టా: బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందాలని కోరుతూ బలూచ్ వేర్పాటువాద నేత మిర్ యార్ బలూచ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 11న నిర్వహించిన ‘బలూచిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం’ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా ఈ ప్రకటన చేశారు. బలూచిస్థాన్‌ను ఇకపై పాకిస్థాన్ ప్రావిన్స్‌గా కాకుండా, స్వతంత్ర దేశంగానే పరిగణించాలని ఆయన అంతర్జాతీయ సంస్థలను కోరారు.

తమ ఉద్యమం ఇప్పుడు దౌత్యపరమైన, రాజకీయ గుర్తింపును పొందే లక్ష్యంతో కొత్త దశలోకి ప్రవేశించిందని మిర్ యార్ బలూచ్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి, ఆసియాన్ , ఆఫ్రికన్ యూనియన్, ఇస్లామిక్ సహకార సంస్థ, ఐరోపా దేశాలు బలూచిస్థాన్ స్వేచ్ఛకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బలూచిస్థాన్ అంశాన్ని ప్రపంచ దృష్టికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన భారత మీడియాకు, పరిశోధకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పాకిస్థాన్‌ను ‘క్యాన్సర్‌’తో పోల్చిన బలూచ్ నేత ఆ దేశం నుంచి తమ భూభాగాన్ని విముక్తి చేసేందుకు అంతర్జాతీయ నైతిక మద్దతు అవసరమని నొక్కి చెప్పారు. 1947 ఆగస్టు 11న బ్రిటీష్ ఇండియా విభజనకు కొద్ది రోజుల ముందే బలూచిస్థాన్ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుందని, ఆ చారిత్రక వాస్తవం ఆధారంగానే తాము స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నామని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో బలూచిస్థాన్ సొంత కరెన్సీ, పాస్‌పోర్టులు, దౌత్య కార్యాలయాలు, రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ వేడుకలను అడ్డుకోవడానికి పాకిస్థాన్ అధికారులు బలూచిస్థాన్‌లో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసినట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ పరిణామాలు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.

ఇది కూడా చదవండి: అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక.. క్షిపణి ప్రయోగంతో షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement