జెన్‌జీ ఎఫెక్ట్‌తో కొత్త పార్టీ.. నేతాజీ వారసుడి సంచలన ప్రకటన | Netaji grandnephew Chandra Kumar Bose plans Azad Hind Party | Sakshi
Sakshi News home page

జెన్‌జీ ఎఫెక్ట్‌తో కొత్త పార్టీ.. నేతాజీ వారసుడి సంచలన ప్రకటన

Aug 12 2026 7:26 AM | Updated on Aug 12 2026 7:39 AM

Netaji grandnephew Chandra Kumar Bose plans Azad Hind Party

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మరోసారి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నేతాజీ మనవడి తరానికి చెందిన చంద్ర కుమార్ బోస్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తన రాజకీయ ప్రయాణాన్ని ముగించిన ఆయన.. ఇప్పుడు ‘ఆజాద్ హింద్ పార్టీ’ పేరుతో సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన జెన్-జెడ్ యువత నిరసనలు తనకు స్ఫూర్తినిచ్చాయని చంద్ర కుమార్ బోస్ చెబుతున్నారు. దేశంలో యువతలో పెరుగుతున్న అసంతృప్తికి రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన.. దేశంలో అవినీతి విస్తృతంగా పెరిగిపోయిందని ఆరోపించారు. రాజకీయాలు మాత్రమే కాకుండా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు వంటి రంగాల్లోనూ అవినీతి వ్యవస్థలో భాగమైందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు, పాలనా వ్యవస్థలు, ఇతర సంస్థలపై యువతలో అసంతృప్తి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. తమ హక్కుల కోసం పోరాడేందుకు యువతకు ప్రత్యేక రాజకీయ వేదిక అవసరమని అన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ స్ఫూర్తితో ‘ఆజాద్ హింద్ పార్టీ’ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

బీజేపీ నుంచి టీఎంసీ.. ఇప్పుడు సొంత పార్టీ
చంద్ర కుమార్ బోస్ రాజకీయ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే ఉంది. 2016లో ఆయన బీజేపీలో చేరారు. దాదాపు ఏడేళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగారు. తనకు బీజేపీ నాయకత్వం ‘ఆజాద్ హింద్ మోర్చా’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, దానికి తానే నాయకత్వం వహిస్తానని భావించానని బోస్ తెలిపారు. అయితే ఏడేళ్లు ఎదురుచూసినా ఆ వేదిక ఏర్పడలేదని, అందుకే బీజేపీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. 2023లో బీజేపీకి రాజీనామా చేసిన ఆయన.. అనంతరం 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు. నేతాజీ సిద్ధాంతాలపై పనిచేసేందుకు టీఎంసీ తనకు అవకాశం ఇచ్చిందని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. అయితే టీఎంసీలో ఆయన ప్రయాణం కూడా ఎక్కువ కాలం సాగలేదు. వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

నేతాజీ సిద్ధాంతాలే పునాది?
కొత్త పార్టీకి యువతే ప్రధాన బలంగా ఉండాలని బోస్ భావిస్తున్నారు. ప్రగతిశీల, సమగ్ర, లౌకిక భావజాలం ఉన్న యువతను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్నారు. నేతాజీ రాజకీయ ఆలోచనల్లోని జాతీయవాదం, సమగ్రత, మత సామరస్యం, దేశ నిర్మాణం వంటి అంశాలను కొత్త రాజకీయ వేదిక ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు.

పేరు నేతాజీది.. ఓట్లు యువతవేనా?
ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. నేతాజీ పేరు, యువతలో ఉన్న అసంతృప్తి, అవినీతిపై వ్యతిరేకత.. ఈ మూడు అంశాలను కలిపి చంద్ర కుమార్ బోస్ ఒక కొత్త రాజకీయ శక్తిగా మార్చగలరా?. బీజేపీ, టీఎంసీ వంటి ప్రధాన పార్టీల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉన్నప్పటికీ.. సొంత పార్టీని నిర్మించడం మాత్రం పూర్తిగా భిన్నమైన సవాలు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలమైన కేడర్, నాయకత్వం, ఆర్థిక వనరులు, స్పష్టమైన విధానాలు, ఎన్నికల్లో పోటీ చేసే సామర్థ్యం ఇవన్నీ కొత్త పార్టీకి అవసరం. అందుకే ‘ఆజాద్ హింద్ పార్టీ’ ప్రకటన కేవలం మరో రాజకీయ పార్టీ ఆవిర్భావమా? లేక యువత అసంతృప్తికి కొత్త రాజకీయ చిరునామాగా మారుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement