మై హూ నా.. కొత్త మిత్రులకు మోదీ అభయం | PM Modi Assures New NDA MPs: "Do Not Worry, I Am With You" | Sakshi
Sakshi News home page

మై హూ నా.. కొత్త మిత్రులకు మోదీ అభయం

Aug 7 2026 12:57 PM | Updated on Aug 7 2026 1:07 PM

Do not Worry I Am With You: Modi to Uddhav Rebels TMC Turncoats

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభనతో కొనసాగుతున్న వేళ.. ఎన్డీయేలో కొత్తగా చేరిన ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ ఉదయం కొత్త మిత్రులతో ప్రత్యేక అల్పాహార సమావేశం నిర్వహించిన ప్రధాని.. వారిలో నెలకొన్న సందేహాలు, ఆందోళనలకు తెరదించే ప్రయత్నం చేశారు. “ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎన్డీయే ఒక కుటుంబం.. మీకు మేమంతా అండగా ఉంటాం” అంటూ భరోసా ఇచ్చారు.

ఇటీవల ప్రతిపక్ష పార్టీల నుంచి విడిపోయి ఎన్డీయేలో చేరిన 26 మంది ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాలు, సభా చర్చల్లో చురుగ్గా పాల్గొనే విధానం, తమ నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. వీరిలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి షిండే వర్గంలో చేరిన ఆరుగురు ఎంపీలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నుంచి బయటకు వచ్చి ఎన్డీయేలో చేరిన 20 మంది ఎంపీలు ఉన్నారు.

ముఖ్యంగా ఉద్ధవ్‌ శివసేన నుంచి షిండే శివసేనలోకి వచ్చిన ఎంపీలకు ప్రధాని ప్రత్యేక భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లతో మరాఠీలో పలకరించిన ఆయన.. కొత్తగా కూటమిలోకి వచ్చిన వారంతా ఎన్డీయేలో సమాన భాగస్వాములేనని, వారికి పూర్తి గౌరవం, అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం.

పార్లమెంట్‌ చరిత్రపై అవగాహన పెంచుకోండి
కొత్తగా ఎన్డీయేలోకి వచ్చిన ఎంపీలను ఉద్దేశించి ప్రధాని.. సభా చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పార్లమెంట్‌ చరిత్ర, సంప్రదాయాలు, విధివిధానాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. “పార్లమెంట్‌ చరిత్రకు సంబంధించిన అపారమైన సమాచారం అందుబాటులో ఉంది. దానిని చదివి చర్చలకు సిద్ధం కావాలి” అని ఎంపీలకు సూచించారు.

టీఎంసీ నుంచి వచ్చిన ఎంపీలకు కూడా.. 
టీఎంసీ నుంచి విడిపోయి ఎన్డీఏలో చేరిన 20 మంది ఎన్సీపీ(ఐ) ఎంపీలతో కూడా ప్రధాని మాట్లాడారు. కొత్తగా వచ్చిన సభ్యులు కూటమిలో భాగమని, వారికి తగిన గౌరవం, అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు, నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ వనరులను వినియోగించుకోవాలని చెప్పారు.

ఎన్డీయే బలం పెంచుకునే వ్యూహం
కీలక రాజ్యాంగ సవరణ బిల్లులకు రెండు సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం ఉండటంతో బీజేపీ ఎన్డీయే విస్తరణపై దృష్టి పెట్టింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల తొలగింపు నిబంధనలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రతిపాదిత బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు కొత్త మిత్రుల చేరిక కీలకంగా మారింది. ఇటీవల ప్రతిపక్ష పార్టీల నుంచి 26 మంది ఎంపీలు ఎన్డీయేలో చేరడంతో లోక్‌సభలో ఎన్డీఏ బలం 293 నుంచి 319కి పెరిగింది. అయినప్పటికీ ప్రత్యేక మెజారిటీకి ఇంకా 41 స్థానాల కొరత ఉంది.

‘కొత్తవారూ మా కుటుంబ సభ్యులే’
కొత్తగా చేరిన ఎంపీలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చూపించేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితురాలిగా ఉన్న కాకోలి ఘోష్‌ దస్తిదార్‌కు ప్రధాని మోదీ.. అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీలతో పాటు ముందు వరుసలో స్థానం కల్పించడం కూడా ఈ వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement