సాక్షి, అమరావతి: డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తున్నాయి. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ రాజీనామా చేయాలని, అలాగే సీబీఐతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్‌లకు ఇటు డీఎస్సీ అభ్యర్థులు, సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో కూటమి పెద్దలు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో దుష్ట రాజకీయానికి తెర తీశారు.
ఏపీవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ రెండో రోజు కూడా పలు చోట్ల దీక్షను భగ్నం చేసే కుట్రలు కొనసాగుతున్నాయి. ఓవైపు పోలీసుల రూపంలో ఆటంకాలు కలిగిస్తున్న కూటమి ప్రభుత్వం.. మరోవైపు టీడీపీ గూండాలతో దౌర్జన్యకాండకు దిగుతోంది. ఈ రాక్షస క్రీడపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
డీఎస్సీ వ్యవహారంపై దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మాదేపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా టెంట్‌ను టీడీపీ గూండాలు తొలగించారని తెలుస్తోంది. ఆపై వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించగా.. అబ్బయ్య చౌదరి నేలపై బైఠాయించి నిరసన కొనసాగించారు.
తునిలో ఎండలోనే దీక్షలు
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షల టెంట్లను పోలీసులు తొలగించారు. రాత్రి కార్పొరేషన్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్‌ను, అనంతరం ఉదయం జియో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మరో టెంట్‌ను తొలగించినట్లు తెలిపింది. టీడీపీ నేతల సూచనతోనే పోలీసులు ఈ పని చేశారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే టెంట్లు తొలగించినా వెనక్కి తగ్గేది లేదని వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఎండలోనే బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు.
విజయవాడ వెస్ట్‌లో ఉద్రిక్తత!
విజయవాడ వెస్ట్‌లో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత బుద్ధా వెంకన్న దీక్షా ప్రదేశానికి చేరుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవ సృష్టించే ప్రయత్నం చేశారు. నిన్న మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన దీక్ష వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నది తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అక్కడికి రావడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మహిళలపై దాడులు జరగ్గా.. బోండా అనుచరుడు ఒకడు జుగుప్పాసకంగా వ్యవహరించాడు. మహిళా జర్నలిస్టుల మీద దాడి జరుగుతున్నా కూడా.. పోలీసులు చూస్తూ ఉండిపోయారు.
కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. టీడీపీ శ్రేణులు ఎంత బరితెగించినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవినీతి, అవకతకవలకు నారా లోకేశ్ కచ్చితంగా రాజీనామా చేయాలని, జాతీయ దర్యాప్తు సంస్థతో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతోంది.


