సాక్షి, కృష్ణా: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఎయిడెడ్ జూనియర్ కాలేజీల పార్ట్‌టైమ్ లెక్చరర్లు గన్నవరం ఎయిర్‌పోర్టులో కలిశారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని వైఎస్ జగన్‌కు వారంతా విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం తమను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
ఈ సందర్భంగా ఏపీ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల పార్ట్‌టైమ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరిగ జోషి మాట్లాడుతూ.. ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ లెక్చరర్లను శాశ్వత ఉద్యోగులుగా (పర్మినెంట్) చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తమ సమస్యలను వైఎస్ జగన్‌కు వివరించామని, తమ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
పార్ట్‌టైమ్ లెక్చరర్లకు మినిమమ్ టైమ్ స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ జూనియర్ కాలేజీల పార్ట్‌టైమ్ లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు న్యాయం చేయాలని అసోసియేషన్ నాయకులు కోరారు.


