సాక్షి, ఏలూరు: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తాజాగా మాట్లాడుతూ.. డీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ (SCERT) ద్వారా రూపొందించారని, వాటిని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది కూడా అదే సంస్థేనని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడే పనిచేస్తున్న ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి మెరిట్ జాబితాలో తొలి ర్యాంకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. దీనివల్ల ప్రశ్నాపత్రం లీకైందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు.
ఏళ్ల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోగా, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ వెంట నడిచిన వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆరోపించారు. ఇంటర్ కాలేజీ, ఇంటర్ స్టేట్ స్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి కూడా డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారని, ఇందుకోసం ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) సైతం మార్చారని విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అంశాలపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన రూ.15 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని ఫోన్, వీడియో కాల్ సంభాషణలు జరిగాయా లేదా అనే అంశంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి అన్యాయం జరిగినా ప్రతిపక్షంగా వారి తరఫున గళం వినిపిస్తాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థ ద్వారా 1.20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని, ఆ నియామకాల్లో ఎక్కడైనా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. ఉద్యోగ నియామకాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమపై కేసులు నమోదు చేస్తున్నారని, ఇంటి వద్ద సమావేశం నిర్వహించుకున్నా సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారని ఆరోపించారు. దెందులూరులో నిరసనలు ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

విజయవాడలో జరిగిన ఘటన దారుణమని వ్యాఖ్యానించిన అబ్బయ్య చౌదరి, బోండా ఉమా అనుచరులు రౌడీయిజానికి పాల్పడ్డారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగి ఉంటే అప్పటి ప్రతిపక్షం ధర్నాలు చేసేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే ప్రతిపక్షంగా తాము కూడా అభినందిస్తామని ఆయన అన్నారు.


