సాక్షి, విజయవాడ: సాయం పేరుతో ప్రకటనలు.. కెమెరా ముందు హామీలు.. ఆ తర్వాత పట్టించుకోని పరిస్థితులు చాలానే చూస్తుంటాం. కానీ ఓ చిన్నారికి అత్యంత ఖరీదైన వైద్యం అవసరమైనప్పుడు.. కుటుంబం ఆ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్న వేళ జగనన్న సాయం ఆదుకుంది. ఇప్పుడు అదే చిన్నారి ఆరోగ్యంగా ఎదుగుతుండగా.. సాయం మరువని ఆమె తల్లిదండ్రులు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆ భావోద్వేగ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నూజివీడు నియోజకవర్గంలోని కొర్లగుంటకు చెందిన మహేష్, వినీల దంపతుల కుమార్తె ధన్సిక. చిన్నతనంలోనే ఆమె అనారోగ్యానికి గురైంది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో 2019లో న్యూరో సర్జన్ పర్యవేక్షణలో అత్యంత క్లిష్టమైన, ఖరీదైన శస్త్రచికిత్స అవసరమైంది. ఆ సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం అమలు చేసిన ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా ఆ వైద్యాన్ని కుటుంబానికి ఉచితంగా అందించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఖరీదైన ఆపరేషన్ ఖర్చును భరించే పరిస్థితి తమకు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ తమకు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు.

వైఎస్ జగన్‌ను కలిసిన దంపతులు
ప్రస్తుతం ధన్సిక పూర్తిగా కోలుకుని ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉందని మహేష్, వినీల తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలసి.. తమ కుమార్తెకు అందిన వైద్య సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

చిన్నారితో ముచ్చటించిన జగన్
ధన్సికను చూసిన వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో ఆ చిన్నారి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. ఓదార్చిన ఆయన ఆమెతో కొద్దిసేపు ముచ్చటించి.. బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. అనంతరం స్వయంగా సెల్ఫీ కూడా తీశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు గతంలో ఎదుర్కొన్న పరిస్థితులను, ఆరోగ్యశ్రీ ద్వారా అందిన వైద్యాన్ని గుర్తుచేసుకున్నారు.
చిన్నతనంలోనే తీవ్రమైన అనారోగ్య సమస్యను ఎదుర్కొన్న ధన్సిక.. ఖరీదైన శస్త్రచికిత్స అనంతరం ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉండటం కుటుంబానికి ఊరటనిచ్చిందని తల్లిదండ్రులు తెలిపారు. ఒకప్పుడు చికిత్స కోసం ఆందోళన చెందిన కుటుంబం.. ఇప్పుడు అదే చిన్నారి ఆరోగ్యంగా ఉండటాన్ని చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా అందిన చికిత్సకు కృతజ్ఞతగా జగన్‌ను కలిసిన ఈ కుటుంబం భేటీకి సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


