సాక్షి, ప్రకాశం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ హఠాన్మరణం.. ఏపీ రాజకీయ శ్రేణుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గుర చేసింది. గుండెపోటుతో హైదరాబాద్ నివాసంలో ఆయన కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపంగా పార్టీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలను వాయిదా వేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన పార్థివదేహానికి పార్టీ కీలక నేతలు నివాళులర్పించారు.
ఒంగోలులోని క్లోపేటలో రాజశేఖర్ భౌతికకాయానికి రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి నివాళులర్పించారు. కాకుమాను మృతి వైఎస్సార్‌సీపీకి తీరని లోటని చెప్పారాయన. పార్టీ బలోపేతానికి రాజశేఖర్ ఎంతో కృషి చేశారని, కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాజశేఖర్ పార్టీ వ్యవహారాల్లో అత్యంత క్రియాశీలకంగా పనిచేశారని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త(కోఆర్డినేటర్) సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. వ్యక్తిగతంగా తాను మంచి స్నేహితుడిని కోల్పోయానని, అలాగే పార్టీకి ఇది పూడ్చలేని లోటని అన్నారు. రాజశేఖర్ కుటుంబాన్ని త్వరలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శిస్తారని తెలిపారు.
పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించినందుకే..
ఇటీవల విజయవాడలో డీఎస్సీ అంశంపై పార్టీ చేపట్టిన నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై సజ్జల, వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. పోలీసులు కాకమాను రాజశేఖర్‌ను తోపులాట పేరిట ఛాతిపై బలంగా నొక్కారని.. కిందపడేసి మరీ ఆ పనే చేశారని అంటున్నారు. ఆ ఘటన తర్వాత ఒత్తిడికి గురై ఆయనకు గుండెపోటు వచ్చిందని పేర్కొన్నారు.


