ఈసీలో మళ్లీ అదే రచ్చ.. నాడు టీఎన్‌ శేషన్‌ ఏం చేశారో గుర్తుందా? | EC Power Row Returns: What Did the Supreme Court Tell TN Seshan? | Sakshi
Sakshi News home page

ఈసీలో మళ్లీ అదే రచ్చ.. నాడు టీఎన్‌ శేషన్‌ ఏం చేశారో గుర్తుందా?

Sep 25 2026 10:32 AM | Updated on Sep 25 2026 10:44 AM

EC Power Row Returns: What Did the Supreme Court Tell TN Seshan?

ఎన్నికల సంఘం.. దేశ ఎన్నికల ప్రక్రియకు కాపలాదారు. ఆ సంస్థలో ముగ్గురు సభ్యులు ఉంటే.. నిర్ణయం ఎవరిది? చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) మాటే తుది మాటా? లేదంటే ముగ్గురూ కలిసి నిర్ణయం తీసుకోవాలా? ఇప్పుడు ఈ ప్రశ్న మరోసారి చర్చకు వచ్చింది. కారణం.. ఈసీలోనే ఇద్దరు కమిషనర్లు వరుసగా తమ అభ్యంతరాలను నమోదు చేసినట్లు వచ్చిన తాజా కథనాలు. సరిగ్గా ఇలాంటి ప్రశ్నే మూడు దశాబ్దాల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకెళ్లింది. ఆ సమయంలో చీఫ్‌ కమిషనర్‌గా ఉన్న టీఎన్‌ శేషన్‌ ఈసీలో తనకే అధికారం ఉండాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

టీఎన్‌ శేషన్‌.. భారత ఎన్నికల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పేరు. ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ.. రాజకీయ నేతలు, మంత్రులు, అధికారులపై కూడా చర్యలకు వెనుకాడని అధికారిగా ఆయన గుర్తింపు పొందారు. దీంతో ఈసీకి గతంలో లేని స్థాయిలో ప్రాధాన్యం వచ్చింది. అయితే ఆ 1993లో పరిస్థితి మారింది. అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం ఎంఎస్‌ గిల్‌, జీవీజీ కృష్ణమూర్తిలను ఎలక్షన్‌ కమిషనర్లుగా నియమించింది. అప్పటివరకు సీఈసీ ఒక్కరితోనే నడిచిన ఈసీ మళ్లీ ముగ్గురు సభ్యుల సంస్థగా మారింది.

ఇక్కడే అసలు వివాదం మొదలైంది. కొత్తగా వచ్చిన ఇద్దరు కమిషనర్లకు సీఈసీతో సమాన నిర్ణయాధికారం ఉండటాన్ని ఈసీ బాస్‌ వ్యతిరేకించారు. వారి నియామకాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టులో కీలక ప్రశ్న
శేషన్‌ వాదనలో ప్రధాన అంశం ఒక్కటే.. సీఈసీకి రాజ్యాంగం ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు, మిగిలిన ఇద్దరు కమిషనర్లతో సమానంగా ఎలా పరిగణించగలరన్నది. ముఖ్యంగా బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు మెజారిటీతో తీసుకోవడాన్ని కూడా ఆయన సవాలు చేశారు. ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. 1995లో సంచలన తీర్పు వెలువడింది. బహుళ సభ్యుల ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు రాజ్యాంగబద్ధమేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

అంతేకాదు.. సీఈసీ కమిషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, మిగిలిన కమిషనర్లపై ఆయనకు తుది నిర్ణయాధికారం లేదని కోర్టు తేల్చింది. కమిషన్‌లో అభిప్రాయ భేదాలు వస్తే మెజారిటీ నిర్ణయమే అమలవుతుందని స్పష్టం చేసింది. అంటే.. సీఈసీ ‘ఫస్ట్‌ అమాంగ్‌ ఈక్వల్స్‌’ మాత్రమే. మిగిలిన ఇద్దరు కమిషనర్లు కూడా నిర్ణయ ప్రక్రియలో సమాన భాగస్వాములే అన్నది ఆ తీర్పు సారాంశం.

ఆయన అక్కడితో ఆగలేదు
సుప్రీంకోర్టు తీర్పుతో శేషన్‌ పూర్తిగా వెనక్కి తగ్గలేదు. తీర్పును సమీక్షించాలంటూ మరోసారి కోర్టును ఆశ్రయించారు. కమిషన్‌ సమావేశం ఎప్పుడు జరగాలి, ఎజెండాలో ఏ అంశాలు ఉండాలి వంటి విషయాల్లో సీఈసీకే ప్రధాన అధికారం ఉండేలా నిబంధనలు రూపొందించే ప్రయత్నం కూడా చేశారు. అయితే సుప్రీంకోర్టు సమీక్ష పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇప్పుడు మళ్లీ అదే చర్చ ఎందుకు?
మూడు దశాబ్దాల తర్వాత.. ఈసీలో అంతర్గత నిర్ణయాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిషన్‌లో ఎలక్షన్‌ కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి గత 10 నెలల్లో కనీసం 14సార్లు కొన్ని నిర్ణయాలపై లిఖితపూర్వకంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ నివేదించింది. ఓటర్ల జాబితా, ఫామ్‌–6 మార్పులు, ఈసీ ఐటీ వ్యవస్థ వంటి కీలక అంశాలపై తమకు సమాచారం లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది.

జ్ఞానేశ్‌కు రాజీనామా సెగ!
ఇదిలా ఉండగా.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ వ్యవహారశైలిపై ప్రతిపక్షాల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. ఈసీలోని ఇద్దరు కమిషనర్లు కీలక నిర్ణయాలపై పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న నివేదికల నేపథ్యంలో.. కాంగ్రెస్‌ సెప్టెంబర్‌ 25న దేశవ్యాప్తంగా ఈసీ కార్యాలయాల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) కూడా ఇదే అంశంపై ఉద్యమానికి సిద్ధమైంది. 48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయకపోతే ‘జంతర్‌ మంతర్‌ 2.0’ పేరుతో మరో భారీ ఆందోళన చేపడతామని ప్రకటించింది. అయితే ఈ ఆరోపణలను ఈసీ ఖండిస్తూ.. కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు సంస్థాగత చర్చల్లో సహజమేనని, గత ఏడాది తీసుకున్న తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే ఉన్నాయని స్పష్టం చేసింది.

భారత ఎన్నికల లెజెండ్‌గా టీఎన్‌ శేషన్‌ 

1932 డిసెంబర్‌ 15న కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో జన్మించారు. పాలక్కాడ్‌లోని గవర్నమెంట్‌ విక్టోరియా కాలేజీలో, ఆ తర్వాత చెన్నైలోని మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో చదువుకున్నారు. కొంతకాలం అక్కడే లెక్చరర్‌గా పనిచేసిన ఆయన.. అనంతరం సివిల్‌ సర్వీసెస్‌ వైపు అడుగులు వేశారు. 1955లో ఐఏఎస్‌లో చేరిన శేషన్‌.. కేరళ, కేంద్ర ప్రభుత్వాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్లానింగ్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1990 డిసెంబర్‌ 12న భారత 10వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటివరకు పెద్దగా ప్రజల దృష్టిలో లేని ఎన్నికల సంఘానికి తన కఠినమైన శైలితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. 

ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ, బూత్‌ క్యాప్చరింగ్‌, అధికార దుర్వినియోగం, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను గట్టిగా అమలు చేయడంతో పాటు.. ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు (EPIC) అందించే ప్రక్రియను దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లారు. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం జవాబుదారీతనాన్ని పెంచడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో రామన్‌ మెగసెసే అవార్డు లభించింది. 

1996లో సీఈసీ పదవి నుంచి వైదొలిగిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. అనంతరం ప్రజాజీవితం నుంచి క్రమంగా దూరమైన శేషన్‌.. 2019 నవంబర్‌ 10న చెన్నైలో 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఎన్నికల సంఘం అధికారాలను సమర్థంగా ఉపయోగించి.. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో కొత్త నమ్మకం కలిగించిన సీఈసీగా ఆయన పేరు మాత్రం ఇప్పటికీ భారత ఎన్నికల చరిత్రలో ప్రత్యేకంగానే నిలిచిపోయింది.

ఇదీ చదవండి: లడాఖ్‌ పాపాల భైరవుడు అమిత్‌ షానే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement