మోదీ, అమిత్ షా, సీఈసీలపై రాహుల్ ధ్వజం
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి..
అప్రూవర్‌గా మారాలని డిమాండ్
2024 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని మండిపాటు
న్యూఢిల్లీ: ప్రజల ఓటు హక్కును కాలరాసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ముమ్మాటికీ దేశద్రోహులేనని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటు హక్కుపై దాడి చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను మూలాల నుంచే ధ్వంసం చేసేవారు దేశద్రోహులే అవుతారని పేర్కొన్నారు. సీఈసీ పదవికి జ్ఞానేశ్ కుమార్‌వెంటనే రాజీనామా చేయాలని, అప్రూవర్‌గా మారాలని డిమాండ్ చేశారు.
ఓట్ల చోరీ జరుగుతోందన్న విషయాన్ని అంగీకరించడం ద్వారా ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీ మంచి పని చేశారని ప్రశంసించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఎన్నికలు పూర్తిగా బూటకం అంటూ ధ్వజమెత్తారు. అంతకు ముందు జరిగిన ఎన్నికలు కూడా బూటకమేనని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగిందని అన్నారు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. మోదీ, అమిత్ షాలు విచారణ ఎదుర్కోక తప్పదని తేల్చిచెప్పారు. సీఈసీ చేసిన పని కచ్చితంగా దేశ వ్యతిరేక చర్య అని స్పష్టంచేశారు. రాహుల్ గాంధీ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఓట్లను తొలగించడం రాజ్యాంగంపై, చట్టపరమైన వ్యవస్థపై జరిగిన దాడిగా అభివరి్ణంచారు.
వారు కుట్రదారులు.. వీరు పావులు
‘కుట్రదారులు’అనే శీర్షికతో మోదీ, అమిత్ షా, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా, జ్ఞానేష్ కుమార్ చిత్రాలను తెరపై రాహుల్ గాంధీ ప్రదర్శించారు. ‘పావులు’అనే శీర్షిక కింద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ చిత్రాలను ప్రదర్శించారు. అలాగే, కొన్ని వీడియోలను కూడా ప్రదర్శించారు. మోదీ, అమిత్ షాల మాటల ధోరణిని గమనించాలని ప్రజలను కోరారు. బీజేపీ 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని అమిత్ షా చెప్పడం, ‘అబ్ కీ బార్ 400 పార్’అనే నినాదాన్ని ప్రధానమంత్రి వినిపించడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వాతావరణంలో పనిచేసే ఏ రాజకీయ నాయకుడూ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేరని రాహుల్ గాంధీ అన్నారు.
ఓట్ల చోరీ నుంచి కానూన్ చోరీ
ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలు పార్లమెంట్‌లో చేసిన చట్టాల చట్టబద్ధతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని రాహుల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఓట్ల చోరీ నుంచి కానూన్(చట్టం) చోరీ, ఆ తర్వాత సంస్థల చోరీ పుట్టుకొస్తాయని అన్నారు. ఈ రోజు ఓటు పోయిందంటే చట్టాలు చేసే వ్యవస్థ కూడా పోయినట్లేనని తెలిపారు. ‘‘కుట్రదారులు ఓట్లను దొంగిలించారు, ఆ ఓట్ల దొంగతనం ద్వారా చట్టాలను దొంగిలించారు, దేశంలోని వ్యవస్థలను దొంగిలించారు. అంతేకాదు, ఓట్ల దొంగతనం తర్వాత చేసిన చట్టాలు చట్టవిరుద్ధమైనవి’’అని స్పష్టంచేశారు. ఓట్ల చోరీ ద్వారా పార్లమెంట్‌కు ఎన్నికైన చట్టసభ సభ్యులు చేసిన ఏ చట్టమైనా, ఏ సంస్థాగత మార్పు అయినా చట్టవిరుద్ధమే అవుతుందన్నారు. ఓటు అనేది మన దేశానికి పునాది అని తెలిపారు. ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాల గురించి ప్రస్తావించారు. ఓటు వ్యవస్థ దెబ్బతింటోందని అన్నారు. ఇది కేవలం ఓటుపై దాడి మాత్రమే కాదని, ప్రతి భారతీయుడి భావ వ్యక్తీకరణపై జరిగిన దాడి అని స్పష్టంచేశారు.


