సాహిల్‌ వాకోడే మృతిపై రాజ్‌ఠాక్రే కీల‌క వ్యాఖ్య‌లు | Raj Thackeray comments on IIT Bombay Student Sahil Wakode Case | Sakshi
Sakshi News home page

కులం కన్నా కారణం ముఖ్యం: రాజ్‌ఠాక్రే

Sep 24 2026 7:54 PM | Updated on Sep 24 2026 8:14 PM

Raj Thackeray comments on IIT Bombay Student Sahil Wakode Case

అధికార, కుల రాజకీయాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని హితవు

ముంబై: అధికార రాజకీయాల కోసం పాకులాడే వారికి కులం ఒక ‘ఇష్టమైన అంశం‘ అని, విద్యార్థులు వారికి దూరంగా ఉండాలని ఎమ్మెన్నెస్‌ అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే హితవు పలికారు. కుల వివక్ష, దూషణల వల్లే  ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్‌ వకోడే ఆత్మహత్య కు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాహిల్‌ వాకోడే మరణం అత్యంత దురదృష్టకరమని, అయితే కులం కన్నా ముందుగా అతను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే కారణం గురించి ఎవరూ ఆలోచిస్తున్నట్లు కనిపించడంలేదంటూ  ‘ఎక్స్‌’ పోస్ట్‌లో పేర్కొన్నారు.

పరీక్ష సమయంలో మొబైల్‌ ఫోన్, చాట్‌జీపీటీని ఉపయోగించాడంటూ సాహిల్‌పై ఆరోపణలు వచ్చాయని, ఈ విషయాన్ని దర్యాప్తు పూర్తికాకముందే వెల్లడించడం సరికాదని ఐఐటీ యంత్రాంగం అనంతరం అంగీకరించి క్షమాపణలు చెప్పిందని రాజ్‌ఠాక్రే పేర్కొన్నారు. మరోవైపు సాహిల్‌ కుటుంబ సభ్యులు కులపరమైన వేధింపుల ఆరోపణలు చేశారని, దీనిపై కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. సంబంధిత అధ్యాపకులు కూడా తమ వాదనను వెల్లడించారని పేర్కొన్నారు.

విద్యార్థి పరీక్షలో అక్రమాలకు పాల్పడితే అడ్డుకోవడం, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం అధ్యాపకుల బాధ్యతేనని, అయితే ఆరోపణలు రుజువు కాకముందే విద్యార్థిని దోషిగా తేల్చడం సరికాదన్నారు. అదే విధంగా కుల వేధింపుల ఆరోపణలపై విచారణ పూర్తికాకముందే అధ్యాపకులను దోషులుగా నిర్ధారించడం కూడా తగదని పేర్కొన్నారు.

‘విద్యా వ్యవస్థలోని లోపాల కారణంగా వాకోడే మరణించాడు. మిమ్మల్ని చిక్కుల్లో పడేయడానికి, ప్రధాన సమస్యల నుంచి మీ దృష్టిని మళ్లించడానికి కులం, మతం అనే ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మన ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలకు వ్యతిరేకంగా మాట్లాడకుండా లేదా నిరసన తెలపకుండా నిరోధించడానికే ఇలా చేస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.

ఐఐటీలో అయినా, మరే ఇతర క్యాంపస్‌లో అయినా ఏ సమస్యలూ  విద్యార్థుల మధ్య అసమ్మతిని లేదా విభజనను సృష్టించడకూడదని అన్నారు. విద్యార్థులు కుంగుబాటుకు గురికాకుండా  సరైన కౌన్సెలింగ్‌ వ్యవస్థ, వైద్య సహాయం, ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత ఉండే వ్యవస్థకు రూపకల్పన చేయాలని రాజ్‌ఠాక్రే డిమాండ్‌ చేశారు.  

లోపాలను సరిదిద్దుకోవడమే నిజమైన నివాళి  
ఒక యువకుడు మనకు దూరమయ్యాడు.. అతడికి ఆత్మహత్యే మార్గమని ఎందుకు అనిపించిందనే ప్రశ్నకు సమాధానం వెతకాలని రాజ్‌ఠాక్రే పేర్కొన్నారు. 20 ఏళ్ల యువకుడికి ఒక ఘటన తర్వాత జీవితంలో ఇక మార్గాలేవీ లేవనే భావన ఎందుకు కలిగిందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనలో ‘కులం’ అనే అంశం ముందుకొచ్చినప్పటికీ.. విద్యార్థులపై ఉన్న ఒత్తిడి, విద్యా వ్యవస్థలోని లోపాలు, ఇలాంటి పరిస్థితుల్లో వారికి అందాల్సిన సహాయంపై కూడా చర్చ జరగాలని రాజ్‌ఠాక్రే పేర్కొన్నారు. సాహిల్‌ వాకోడేతో పాటు ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నిజమైన నివాళి విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు కృషి చేయడమేనని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement