ఒక్క ఆటోలో 17 మంది స్కూల్‌ పిల్లల ‍ప్రయాణం | Maharashtra man stops auto carrying 17 school children | Sakshi
Sakshi News home page

ఒక్క ఆటోలో 17 మంది స్కూల్‌ పిల్లల ‍ప్రయాణం

Sep 25 2026 5:02 AM | Updated on Sep 25 2026 5:05 AM

 Maharashtra man stops auto carrying 17 school children

ముంబై: మహారాష్ట్రలోని భివాండీలో 17 మంది పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోను ఓ వ్యక్తి అడ్డుకుని డ్రైవర్‌ను ప్రశ్నించాడు. ముగ్గురు ప్రయాణికుల కోసం రూపొందించిన ఆటోలో ఇంతమంది పిల్లలను ఎందుకు తీసుకెళ్తున్నావని నిలదీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వీడియోలో కొందరు పిల్లలు డ్రైవర్ చుట్టూ ఇరుకుగా కూర్చుని కనిపించారు. మరో ఆరు-ఏడుగురు వెనుక సీటులో ఉన్నట్లు కనిపించగా.. మరో ఇద్దరు-ముగ్గురు వెనుక సీటు వెనుక ఉన్న సామాను ఉంచే ప్రదేశంలో కూర్చున్నట్లు వీడియోలో కనిపించింది. ఆటోను ఆపిన వ్యక్తి పిల్లలను వాహనం నుంచి దించి ఒకవైపు నిలబెట్టాడు. అనంతరం డ్రైవర్‌ను పదేపదే ప్రశ్నించాడు.  

డ్రైవర్ తొలుత ఆటోలో ఉన్న ఓ పట్టీని చూపిస్తూ పిల్లలను ఎలా తీసుకెళ్తున్నానో వివరించేందుకు ప్రయత్నించాడు. ఇకపై ఇలా చేయబోనని ఆ వ్యక్తికి హామీ ఇచ్చాడు. సాధారణంగా 15 మంది పిల్లలను తీసుకెళ్తానని, ఆ రోజు అదనంగా కొందరు రావడంతో వారినీ ఎక్కించుకున్నానని చెప్పాడు. ఇంతమంది పిల్లలను ఒకే ఆటోలో తరలించడం వారి భద్రతపై ఆందోళనలకు దారితీసింది. ప్రమాదం జరిగినా, అత్యవసర పరిస్థితి ఎదురైనా పిల్లలు త్వరగా వాహనం నుంచి బయటకు రావడం కష్టం అవుతుంది.

ఈ వీడియో వైరల్ కావడంతో భివాండీ ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నారు. నగరంలో పిల్లలను అధిక సంఖ్యలో ఎక్కించుకుని తిరిగే ఆటోలు సాధారణంగా కనిపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని పాఠశాలలు బస్సు సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ, బస్సు ఛార్జీలను తప్పించుకునేందుకు కొందరు తల్లిదండ్రులు ప్రైవేట్ ఆటోలను ఆశ్రయిస్తున్నారు. పాఠశాలల్లో రవాణా సౌకర్యం లేని చోట కుటుంబాలు స్థానిక ఆటో డ్రైవర్లపై ఆధారపడుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement