ముంబై: మహారాష్ట్రలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలుకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలో విభేదాలు చోటుచేసుకున్నాయి. కమిటీ సభ్యుడు, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) ఆర్.సి. చవాన్ తన పదవికి రాజీనామా చేశారు. కమిటీ పనిచేస్తున్న విధానం, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పద్ధతిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో UCC అమలుకు అవసరమైన నిబంధనలు, సూచనలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్ దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. సెప్టెంబర్ 19న కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత జస్టిస్ చవాన్ తన రాజీనామాను ఈమెయిల్ ద్వారా చైర్‌పర్సన్‌కు పంపించారు.
ఈ సమావేశంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు రూపొందించిన ప్రశ్నావళిని ఖరారు చేయడం ప్రధాన అంశంగా ఉంది. దీనిపై జస్టిస్ చవాన్ కొన్ని సూచనలు చేశారు. ప్రజలు కేవలం ‘అవును’ లేదా ‘కాదు’ అని మాత్రమే సమాధానం ఇచ్చేలా ప్రశ్నలు ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ అభిప్రాయాలను వివరంగా చెప్పే అవకాశం ఉండాలని సూచించారు. అలాగే ప్రశ్నావళిని నిపుణులతో పరిశీలింపజేసిన తర్వాత ఖరారు చేయాలని కోరారు.
అయితే అప్పటికే చైర్‌పర్సన్ జస్టిస్ రంజనా దేశాయ్ ప్రశ్నావళిని సిద్ధం చేసి సభ్యులకు పంపించినట్లు జస్టిస్ చవాన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. వెబ్‌సైట్ సిద్ధమైన తర్వాత దాన్ని అందులో పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదే సమావేశంలో కమిటీలో సభ్యుడు కానటువంటి ఓ వ్యక్తి కూడా పాల్గొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వెబ్‌సైట్‌లో కొన్ని మార్పులు చేయాలని ఆ వ్యక్తి సూచించగా.. వారం రోజుల్లో అవసరమైన పనులు పూర్తి చేయాలని చైర్‌పర్సన్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఈ క్రమంలో.. కమిటీ ఉద్దేశం మహారాష్ట్ర ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, వివిధ అంశాలపై ఏకాభిప్రాయం తీసుకురావడమేనని తాను భావించానని జస్టిస్ చవాన్ చెప్పారు. ఆలస్యంగా జరిగే వివాహాలు, కుటుంబ సమస్యలు, అస్థిరమైన వివాహ బంధాలు, వివాదాల పరిష్కారంలో జాప్యం వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రజల నుంచి కేవలం ‘అవును’, ‘కాదు’ అనే సమాధానాలను తీసుకుని వాటిని గణాంకాలుగా విశ్లేషించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తనకు అనిపించిందని తెలిపారు. ఈ విధానం తన ఆలోచనలకు భిన్నంగా ఉండటంతో కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో UCC ఎలా ఉండాలనే దానిపై కూడా జస్టిస్ చవాన్ తన అభిప్రాయాలను రాజీనామా లేఖలో పేర్కొన్నారు. చట్టం లింగ భేదం లేకుండా అందరికీ సమానంగా వర్తించేలా ఉండాలని సూచించారు. వివాహం, విడిపోవడం, ఆస్తి పంపకం, వారసత్వం, పిల్లల సంరక్షణ వంటి అంశాలపై స్పష్టమైన నిబంధనలు ఉండాలని తెలిపారు.
అలాగే, వ్యక్తిగత సంబంధాలకు సంబంధించి పెద్దలకు తమ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. పిల్లలందరికీ సమాన హక్కులు కల్పించాలని, 18 ఏళ్ల వయసు వచ్చే వరకు వారి చదువు, సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులదే కావాలని సూచించారు. అయితే కమిటీ పనితీరు, విధానాలపై తన అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు జరుగుతున్నందునే రాజీనామా చేస్తున్నట్లు జస్టిస్ చవాన్ తెలిపారు.
ఇదీ చదవండి: ప్రముఖ స్టాండప్ కమెడియన్ షోలు రద్దు.. రాహుల్ కారణమా?


