బిట్టూ… నువ్వు సూపర్ రా! | Bittu Tabahi Takes on Yamuna Removes 585 Kg of Waste in Nearly 5 Hours | Sakshi
Sakshi News home page

బిట్టూ… నువ్వు సూపర్ రా!

Sep 22 2026 11:51 AM | Updated on Sep 22 2026 12:01 PM

Bittu Tabahi Takes on Yamuna Removes 585 Kg of Waste in Nearly 5 Hours

నదులు, చెరువుల్లో చెత్త పారబోయడం ఒక ఎత్తయితే.. పేరుకుపోయిన ఆ చెత్తకంపుతో ముక్కు మూసుకుని పట్టించుకోకుండా వెళ్లిపోతుంటాం మనం. కానీ సురేంద్ర అలాంటోడు కాదు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూడడం అతనికి చేత కాదు. చిన్నప్పటి నుంచే నీళ్లలోకి దిగి.. తన చేతులతోనే చెత్తను తొలగిస్తూ పర్యావరణ పరిరక్షణకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. అలా సోషల్‌ మీడియాలో ‘బిట్టూ తబాహీ’గా గుర్తింపు పొందిన అతడు.. ఇప్పుడు యమునా నదిని శుభ్రం చేసే మిషన్‌ చేపట్టాడు. 

సెప్టెంబర్‌ 20న ప్రపంచ శుభ్రత దినోత్సవం సందర్భంగా.. యమునా నదిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని బిట్టూ తబాహీ చేపట్టారు. అతడి వెంట వచ్చిన వాలంటీర్లు సుమారు నాలుగున్నర గంటలపాటు యమునా ఒడ్డును శుభ్రం చేశారు. ఈ సమయంలో ఏకంగా 585 కిలోల చెత్తను తొలగించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పాటు పూలు, దండలు, పూజా సామగ్రి, ఇతర చెత్తను ఒడ్డునుంచి సేకరించారు. స్థానికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అతడికి సహకరించారు. 

బిట్టూ తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్‌ చౌదరి. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా బియోరాకు చెందిన అతడు స్కూల్‌ పిల్లాడిగా ఉన్నప్పుడే నదులు, బహిరంగ ప్రదేశాల శుభ్రతపై దృష్టి పెట్టాడు. అతడి సోషల్‌ మీడియా ఖాతాల్లో చెత్తతో నిండిన ప్రాంతాల్లోకి వెళ్లి స్వయంగా శుభ్రం చేస్తున్న వీడియోలు కనిపిస్తాయి. పెద్ద యంత్రాలు, భారీ సిబ్బంది లేకుండానే సాధారణ పరికరాలతో చెత్తను తొలగించడం అతడి ప్రత్యేకతగా మారింది. 

అజ్నార్‌ నదితోనే అసలు గుర్తింపు..
బిట్టూకు భారీగా గుర్తింపు తెచ్చింది మధ్యప్రదేశ్‌లోని అజ్నార్‌ నది. ప్లాస్టిక్‌, చెత్త, ఆల్గీతో నది దాదాపు డంపింగ్‌ యార్డులా మారిన పరిస్థితిని చూసి.. జనవరి 26న అక్కడ శుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించాడు. తొలుత కొందరు స్నేహితులు అతడితో కలిసి పనిచేసినా.. ఆ తర్వాత వారు తప్పుకోవడంతో బిట్టూ ఒంటరిగానే నదిలోకి దిగి చెత్త తొలగించడం కొనసాగించాడు. వారాలపాటు ఈ పని చేస్తూ ప్లాస్టిక్‌, సీసాలు, ఇతర వ్యర్థాలను బయటకు తీశాడు. అతడు చేస్తున్న పనిని వీడియోలుగా సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌ అయ్యాయి. నదిని శుభ్రం చేయడానికి బిట్టూ తన సొంత డబ్బుతో అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశాడు. కొందరు మాత్రం పిల్లాడు సోషల్‌ మీడియా ప్రచారం కోసమే చేస్తున్నాడంటూ విమర్శించారు. కానీ బిట్టూ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయాడు. 

ఆయన ప్రశంసతో వెలుగులోకి
అజ్నార్‌ నదిని శుభ్రం చేస్తున్న బిట్టూ వీడియోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ కావడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కూడా స్పందించారు. బియోరాకు చెందిన ఈ యువకుడిని తన ‘మండే మోటివేషన్‌’గా పేర్కొంటూ ఆయన బిట్టూ చేసిన పనిని ప్రశంసించారు. దీంతో బిట్టూ కథ దేశవ్యాప్తంగా మరింతగా వైరల్‌ అయింది. జెన్‌జీకి ఇలాంటి కుర్రాళ్ల స్ఫూర్తి కచ్చితంగా ఉండాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. 

విదేశీ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్‌!
బిట్టూ చేసిన పని అంతర్జాతీయ స్థాయిలోనూ దృష్టిని ఆకర్షించింది. నెదర్లాండ్స్‌కు చెందిన పర్యావరణ సంస్థ ది ఓషన్‌ క్లీనప్‌ వ్యవస్థాపకుడు, సీఈవో బోయన్‌ స్లాట్‌.. సోషల్‌ మీడియాలో బిట్టూ పనిపై స్పందిస్తూ అతడిని తమ సంస్థలో పనిచేయాలని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ తర్వాత బిట్టూ తన శుభ్రత కార్యక్రమాన్ని ఒక్క నదికే పరిమితం చేయకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఏ రాష్ట్రానికి వెళ్లాలి, ఎక్కడి నదిని శుభ్రం చేయాలి అంటూ సోషల్‌ మీడియాలో ప్రజలను సూచనలు కూడా కోరాడు.

ఇప్పుడు యమునా! తర్వాత ఎక్కడంటే..
అజ్నార్‌ నది తర్వాత బిట్టూ దృష్టి మధ్యలో చిన్నాచితకా కాలువలు, చెరువులపై పడింది. ఆ తర్వాత దేశ రాజధానికి చేరి .. యమునా నదిని శుభ్రం చేయాలని డిసైడ్‌ అయ్యాడు. ఈ క్రమంలోనే అతని పిలుపునకు వందల మంది వలంటీర్లు ముందుకు వచ్చారు. మూడు రోజులపాటు యమునా పరిసరాల్లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. తొలి రోజే.. అదీ నాలుగు గంటల్లోనే వందల కిలోల చెత్తను తొలగించడంతో ఈ కార్యక్రమం మరోసారి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. తదుపరి తన శుభ్రత కార్యక్రమాన్ని గురుగ్రామ్‌లోని ఖేడ్కీ దౌలాకు తీసుకెళ్లనున్నట్లు బిట్టూ వెల్లడించాడు. 

ఒక చిన్న పట్టణానికి చెందిన యువకుడు.. ప్రభుత్వ యంత్రాంగం కోసం ఎదురుచూడకుండా తన చేతులతోనే నదిలోని చెత్తను తొలగించడం మొదలుపెట్టాడు. ఆ పని వీడియోలుగా మారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇప్పుడు అదే వైరల్‌ ప్రయాణం అతడిని యమునా ఒడ్డుకు, అక్కడి నుంచి దేశవ్యాప్తంగా శుభ్రత కార్యక్రమాల వైపు తీసుకెళ్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement