పెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక హవా
‘ఎలక్ట్రిక్ మోబిలిటీ ఇండెక్స్ 2025’ సర్వే వెల్లడి
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) వాడకం, మౌలిక వసతుల కల్పనలో దేశ రాజధాని ఢిల్లీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ (ఐఈఎంఐ) 2025’ నివేదిక ప్రకారం... ఢిల్లీ అత్యధికంగా 84 స్కోరు సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర (78), కర్ణాటక (73), చండీగఢ్ (71), గోవా (65) ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ రవాణాకు సంబంధించిన విధాన రూపకల్పనతో పాటు క్షేత్రస్థాయి అమలు ఫలితాలను అంచనా వేసేందుకు ఈవీ ఇండెక్స్‌ని రూపొందించారు. ట్రాన్స్‌పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ పురోగతి (50% వెయిటేజీ), ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సన్నద్ధత (30% వెయిటేజీ), ఈవీ పరిశోధన, ఆవిష్కరణలు (20% వెయిటేజీ) అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా రాష్ట్రాలకు స్కోరింగ్ ఇచ్చారు.
ఈవీ ఇండెక్స్ నివేదికలో ముఖ్యాంశాలు...
పెద్ద రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర, కర్ణాటక ముందంజలో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల విభాగంలో మణిపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్రపాలిత ప్రాంతాలు, సిటీ స్టేట్లలో ఢిల్లీ, చండీగఢ్, గోవాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. 2024తో పోలిస్తే 2025 నాటికి మధ్యప్రదేశ్ గణనీయమైన వృద్ధిని సాధించి 23వ స్థానం నుంచి ఏకంగా 7వ స్థానానికి ఎగబాకింది. ఛార్జింగ్ వసతుల కల్పనలో కర్ణాటక దేశంలోనే అత్యధికంగా 97 స్కోరు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. డిసెంబర్ 2022 నాటికి దేశంలో 5,151గా ఉన్న పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య జూన్ 2025 నాటికి ఏకంగా 29,000 దాటింది.
పర్యావరణం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
దేశీయ రవాణా రంగాన్ని కార్బన్ రహితంగా మార్చేందుకు ఈవీల విప్లవం అత్యంత కీలకమైనదని నివేదిక స్పష్టం చేసింది. రోడ్డు రవాణా రంగం వల్ల దేశంలో ఇంధన ఆధారిత కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 12%, నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలు 18% వెలువడుతున్నాయి. ఈవీల వినియోగం పెరగడంతో ఈ ఉద్గారాలు గణనీయంగా తగ్గనున్నాయని నివేదిక తెలిపింది. దేశ జీడీపీలో ఆటోమొబైల్ రంగం వాటా 7.1 శాతం కాగా, తయారీ రంగ ఉత్పత్తుల్లో సగానికి పైగా వాటా ఉంది. ఇది సుమారు 1.9 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తోంది. ఈవీ మార్పు ఆటో మొబైల్ రంగానికి సుస్థిర భవిష్యత్తును అందిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది.
పశ్చిమాసియా సంక్షోభం ఈవీలకు కీలక మలుపు
నివేదికను విడుదల చేసిన నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా మాట్లాడుతూ... అమెరికాలో కొత్త కార్ల విక్రయాల్లో ఈవీల వాటా 10 శాతం, యూరప్‌లో 25 శాతం, చైనాలో 50 శాతానికి పైగా ఉందన్నారు. 1970ల నాటి చమురు సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సామర్థ్యానికి ఎలా కారణమైందో, ఇటీవలి పశ్చిమాసియా సంక్షోభం కూడా ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి పెద్ద మార్పుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. 2018 నాటికి భారత వాహన విక్రయాల్లో ఈవీల వాటా కేవలం 0.5 శాతంగా ఉండగా, 2025–26 నాటికి అది 8.25 శాతానికి చేరిందని, ప్రస్తుతం రోడ్లపై 87 లక్షలకు పైగా ఈవీలు తిరుగుతున్నాయని గౌబా తెలిపారు.
ఇదీ చదవండి: వెళ్లిపోయాడనుకునేలోపే మళ్లీ ఐదేళ్ల పదవి!


