మానవాళికి సహాయకరంగా ఉండాలి
మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ వెల్లడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత భద్రత చర్చనీయాంశంగా మారిన తరుణంలో ఈ టెక్నాలజీ మనుషుల నియంత్రణలోనే ఉండాలని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. ఏఐ అనేది మానవాళికి సహాయకరమైన సాధనంగానే ఉండాలనుకుంటోంది. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ ఈ విషయాలు తెలిపారు. ‘ప్రయోగశాలలు ఏం చెబుతున్నాయనే దానిపై నేను వ్యాఖ్యానించబోను. కాకపోతే మైక్రోసాఫ్ట్ సిద్ధాంతం ఒక్కటే.
ఏఐ అనేది మానవాళికి సేవ చేసే విధంగా, సహాయకరంగా ఉండాలి. ఎల్లవేళలా అది మనుషుల నియంత్రణలోనే ఉండాలి‘ అని ఆయన చెప్పారు. ఇందుకోసం తగినంత స్థాయిలో ఏఐ సిస్టంల టెస్టింగ్, కస్టమర్ల మేధో హక్కులకు భద్రత, సురక్షితమైన..విశ్వసనీయమైన మౌలిక సదుపాయాలు, బహుళ మోడల్స్‌తో ఓపెన్ ఏఐ వ్యవస్థ అవసరమని చందోక్ వివరించారు. మైక్రోసాఫ్ట్ అదే పనిలో ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ సోమవారం భారత్‌లో తమ నాలుగో క్లౌడ్ రీజియన్‌ను హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించింది.
వినూత్న సాంకేతికతలకు దన్ను...
భారత్ ఏఐని వినియోగించుకోవడమే కాకుండా వినూత్న సాంకేతికతలను కూడా ఆవిష్కరిస్తోందని చందోక్ పేర్కొన్నారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కంపెనీకి దేశీయంగా 10 నగరాలవ్యాప్తంగా 23,000 మంది ఇంజనీర్లు ఉన్నారని, ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో భారత్ కీలకంగా ఎదుగుతోండటాన్ని ఇది సూచిస్తోందని చందోక్ వివరించారు. ప్రస్తుతం రొటీన్‌గా నిర్వహిస్తున్న ఉద్యోగ విధుల స్వరూపం మారుతోండటంతో పాటు కృత్రిమ మేథతో ఏఐ ఇంజినీర్లు, ఏజెంట్ ఆర్కె్రస్టేటర్లలాంటి కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు.
ప్రపంచం మొత్తం మీద జనరేట్ అయ్యే డేటాలో 20 శాతం..భారత్ నుంచే ఉంటుందని, కానీ డేటా సెంటర్లపరంగా సామర్థ్యంలో దేశ వాటా కేవలం సుమారు మూడు శాతమేనని పునీత్ తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలను కలి్పంచేందుకు ఈ దశాబ్దపు అవకాశం భారత్ ముంగిట్లో ఉందన్నారు. వచ్చే కొన్నేళ్లలో భారత డేటా సెంటర్ సామర్థ్యాలు 2 గిగావాట్ల నుంచి 12–14 గిగావాట్లకు పెరుగుతాయన్నారు. తద్వారా ఆసియాకి ఏఐ ఇన్‌ఫ్రా హబ్‌గా దేశం ఎదుగుతుందని చెప్పారు.


