ముఖంతో సంపాదన.. రూ.14 లక్షల వరకు! | People Earn Up To Rs 14 Lakh by Licensing Their Faces for AI Videos and Ads | Sakshi
Sakshi News home page

ముఖంతో సంపాదన.. ఏకంగా రూ.14 లక్షల వరకు!

Sep 21 2026 6:28 PM | Updated on Sep 21 2026 6:43 PM

People Earn Up To Rs 14 Lakh by Licensing Their Faces for AI Videos and Ads

ఏఐతో ఉద్యోగాలు పోతాయని ఎంతోమంది భయపడుతున్న వేళ.. చైనాలో మాత్రం కొందరు తమ ముఖాలనే అద్దెకిచ్చి లక్షలు సంపాదిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో.. ఏఐ కాలంలో మన ముఖానికి కూడా ఒక విలువ ఉంది. చైనాలో కొంతమంది తమ ముఖాలను ఏఐ ద్వారా తయారు చేసే వీడియోలు, ప్రకటనలు, గేమ్స్, షార్ట్ డ్రామాల్లో ఉపయోగించుకోవడానికి లైసెన్స్ ఇస్తున్నారు. దీంతో డబ్బు సంపాదిస్తున్నారు.

సింపుల్‌గా చెప్పాలంటే, ఒక వ్యక్తి తన ముఖాన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో రిజిస్టర్ చేసుకుంటాడు. ఆ తర్వాత వీడియో లేదా ప్రకటన తయారు చేసే వాళ్లు తమకు నచ్చిన ముఖాన్ని ఎంచుకుని, డబ్బు చెల్లించి ఆ ముఖాన్ని AI కంటెంట్‌లో ఉపయోగించుకోవచ్చు.

రూ.700 నుంచి రూ.14 లక్షలు
కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ముఖాన్ని ఉపయోగించడానికి ధర 50 యువాన్ నుంచి 99,999 యువాన్ చెల్లిస్తున్నారు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.700 నుంచి రూ.14 లక్షలు.

ఉదాహరణకు, చెన్ అనే 34 ఏళ్ల వ్యక్తి తన ముఖాన్ని ఒక్కసారి ఉపయోగించుకోవడానికి 99 యువాన్ తీసుకుంటున్నాడు. తన ముఖాన్ని ప్రేమకథలు, కుటుంబ కథల్లో ఉపయోగించుకోవచ్చని, కానీ హారర్ లేదా లైంగిక కంటెంట్‌లో ఉపయోగించకూడదని అతను నిబంధన పెట్టుకున్నాడు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక బ్యాంక్ ఉద్యోగి ముఖాన్ని ఒక ప్రకటన సంస్థ మూడు రోజుల్లో ఏడు సార్లు ఉపయోగించుకుని అతనికి దాదాపు 2,500 యువాన్ చెల్లించినట్లు సమాచారం.

ఇలా చేయడం వల్ల వ్యక్తులు ప్రతి షూటింగ్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. వాళ్ల ముఖాన్ని ఏఐ ద్వారా ఉపయోగించుకుంటారు కాబట్టి, ఇంట్లోనే ఉండి కూడా కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, తమ ముఖాన్ని ఎంతకాలం ఉపయోగించాలి, ఏ రకమైన కంటెంట్‌లో ఉపయోగించకూడదు అనే విషయాలను కూడా కొంతవరకు నిర్ణయించుకోవచ్చు.

సమస్యలు ఇవే
అయితే దీంతో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గోప్యత, అనుమతి, ముఖ డేటా భద్రతకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. ఒకసారి మన ముఖం డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లిన తర్వాత అది ఎక్కడెక్కడ ఉపయోగించబడుతుందో పూర్తిగా తెలుసుకోవడం కష్టం కావచ్చు.

పిల్లల ముఖాలను ఏఐలో ఉపయోగించడం గురించి కూడా న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లల కోసం ప్రత్యేక కేటగిరీలు కూడా ఉన్నాయి. మరో సమస్య.. ఒప్పందాలకు సంబంధించినది. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వ్యక్తి తన అనుమతిని ముందుగానే రద్దు చేస్తే భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చని వార్తలు చెబుతున్నాయి. కానీ అదే సమయంలో ప్లాట్‌ఫారమ్‌ నుంచి చెల్లింపు ఆలస్యం అయితే వారి బాధ్యత తక్కువగా ఉండవచ్చనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి: వయసు 15.. పెట్టుబడులు రూ.13 లక్షలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement