ఇరాన్‌ చుట్టూ ఉచ్చు.. మూడు వైపులా టెన్షన్‌ | Iran Tensions Escalate: US Threats Houthi Strikes on Riyadh Fresh Clash With France | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ చుట్టూ ఉచ్చు.. మూడు వైపులా టెన్షన్‌

Sep 21 2026 6:54 AM | Updated on Sep 21 2026 8:26 AM

Iran Tensions Escalate: US Threats Houthi Strikes on Riyadh Fresh Clash With France

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు అమెరికా–ఇరాన్‌ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరగా.. మరోవైపు ఇరాన్‌ మద్దతున్న హౌతీలు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి దిగారు. ఇదే సమయంలో ఇరాన్‌–ఫ్రాన్స్‌ మధ్య దౌత్య వివాదం కూడా ముదురుతోంది. దీంతో ఇప్పటికే నెలలుగా కొనసాగుతున్న ప్రాంతీయ సంక్షోభం కొత్త మలుపు తీసుకుంటోంది.

అమెరికా కొత్త దాడికి సిద్ధమవుతోందన్న సమాచారం తమ వద్ద ఉందని ఇరాన్‌ సైన్యం ప్రకటించింది. అమెరికా లేదా దాని మిత్రదేశాలు మరోసారి దాడి చేస్తే.. ఈసారి ప్రతిస్పందన పరిమితం కాదని, అమెరికా స్థావరాలు.. ప్రయోజనాలపై సుదీర్ఘంగా దాడులు కొనసాగిస్తామని ఇరాన్‌ సైనిక కమాండ్‌ హెచ్చరించింది. అమెరికా మిత్రదేశాలను కూడా ఈ ఘర్షణలో భాగస్వాములుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇరాన్‌పై ఒత్తిడి పెంచారు. ఒప్పందానికి ముందుకు రావాలని.. లేదంటే ఇరాన్‌ ఆర్థికంగా మరింత కుదేలవుతుందని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ఈ వారంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి న్యూయార్క్‌ వెళ్లనున్న నేపథ్యంలో ఆయనతో భేటీకి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్‌ చెప్పడం గమనార్హం. 

రియాద్‌పై హౌతీల మెరుపుదాడి
ఇదిలా ఉండగానే యెమెన్‌లోని ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీలు సౌదీ రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. సెప్టెంబర్‌ 19న క్షిపణి, డ్రోన్లతో దాడి ప్రయత్నం జరిగినట్లు సౌదీ అరేబియా ధ్రువీకరించింది. రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడుతో దట్టమైన పొగ అలుముకుంది. అయితే సౌదీ నేతృత్వంలోని కూటమి ఆ దాడిని అడ్డుకున్నట్లు తెలిపింది. పెద్దగా నష్టమూ జరగలేదని వెల్లడించింది. 

హౌతీలు రియాద్‌తో పాటు యాన్‌బు, తాయిఫ్‌, బైష్‌, ఫరాసాన్‌ ప్రాంతాల్లోనూ దాడులకు ప్రయత్నించినట్లు సమాచారం. యాన్‌బు సౌదీ చమురు ఎగుమతులకు కీలక కేంద్రం కావడంతో ఈ దాడులు మరింత ఆందోళనకు కారణమయ్యాయి. 

ఎందుకంత కీలకం బాబ్-ఎల్-మండేబ్..
యెమెన్‌లో హౌతీల దూకుడు ఇటీవలి రోజుల్లో మరింత పెరిగింది. వ్యూహాత్మకమైన మొఖా ప్రాంతంతో పాటు బాబ్‌ ఎల్‌ మందెబ్‌ జలసంధికి సమీప ప్రాంతాలపై వారి పట్టు పెరిగింది. ఈ మార్గం ఎర్ర సముద్రాన్ని గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌తో కలుపుతుంది. ఆసియా–యూరప్‌ మధ్య నౌకాయానానికి ఇది కీలకమైన మార్గం.

ఇప్పటికే హర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ ఆంక్షల కారణంగా ఇంధన రవాణాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పుడు బాబ్‌ ఎల్‌ వద్ద కూడా భద్రతా సమస్యలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళన మరింత పెరిగింది. హౌతీల దాడుల నేపథ్యంలో సౌదీ చమురు ఎగుమతుల మార్గాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా పరిణామాల్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగానే కొనసాగుతోంది. 

చైనాకు కూడా టెన్షన్‌.. ఇరాన్‌పై ఒత్తిడి
హౌతీల దూకుడుతో సౌదీ మాత్రమే కాకుండా చైనా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. సౌదీ విజ్ఞప్తి నేపథ్యంలో హౌతీలను అదుపులో ఉంచేందుకు ఇరాన్‌పై చైనా ప్రైవేటుగా ఒత్తిడి తెచ్చినట్లు మూడు ఇరాన్‌ వర్గాలను ఉటంకిస్తూ ఆ వార్తను ప్రచురించింది. ఎర్ర సముద్ర మార్గం చైనా వాణిజ్యానికి కూడా కీలకం కావడంతో ఈ పరిణామాలను బీజింగ్‌ నిశితంగా గమనిస్తోంది. 

ఇటు ఫ్రాన్స్‌తోనూ కొత్త వివాదం
ఇక ఇరాన్‌–ఫ్రాన్స్‌ సంబంధాల్లోనూ కొత్త చిచ్చు రేగింది. టెహ్రాన్‌లో ఫ్రెంచ్‌ రాయబార కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ఫ్రెంచ్‌ భాషా కేంద్రాన్ని ఇరాన్‌ అధికారులు మూసివేశారు. సరైన లైసెన్స్‌ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు జాతీయ భద్రతకు వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిందని ఇరాన్‌ ఆరోపించింది. వ్యక్తుల నెట్‌వర్క్‌లను నిర్మించడం, నైపుణ్యం ఉన్న ఇరానియన్లు దేశం విడిచి వెళ్లేందుకు సహకరించడం వంటి ఆరోపణలను కూడా చేసింది. 

అయితే ఫ్రాన్స్‌ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ సాంస్కృతిక సంస్థలపై మరో దాడిగా అభివర్ణించింది. ఇరాన్‌ రాయబారిని పిలిపించి వివరణ కోరనున్నట్లు ప్రకటించింది. ఈ వివాదం ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉన్న దౌత్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. 

‘మొసలి కన్నీరు’ అంటూ ఫైర్‌
ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జీన్‌-నోయెల్‌ బారో ఇరాన్‌లో మానవ హక్కుల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. ఫ్రాన్స్‌ గతంలో అల్జీరియాలో చేసిన చర్యలను ప్రస్తావిస్తూ.. ఇరాన్‌పై ఇప్పుడు సానుభూతి చూపడం ‘మొసలి కన్నీరు’ అంటూ బారోను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా దాడుల్లో ఇరాన్‌ పాఠశాల విద్యార్థులు చనిపోయిన సమయంలో ఫ్రాన్స్‌ మౌనం వహించిందని కూడా అరాఘ్చీ ఆరోపించారు.

ఒకవైపు చర్చలు.. మరోవైపు దాడులు
ఇలా చూస్తే ప్రస్తుతం ఇరాన్‌ చుట్టూ ఒకేసారి పలు స్థాయిల్లో ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణ మళ్లీ ముదిరే సంకేతాలు, సౌదీపై హౌతీల దాడులు, హర్ముజ్‌–బాబ్‌ ఎల్‌ మండేబ్‌ జలమార్గాలపై ఒత్తిడి, ఫ్రాన్స్‌తో దౌత్య వివాదం.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడుతున్నాయి.

అయితే ఇదే సమయంలో చర్చలకు అవకాశం పూర్తిగా మూసుకుపోలేదు. ట్రంప్‌–ఇరాన్‌ మధ్య కఠిన ప్రకటనలు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్‌ అధ్యక్షుడితో భేటీకి ట్రంప్‌ సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం దౌత్య మార్గం ఇంకా తెరిచే ఉందనే సంకేతంగా నిలుస్తోంది. మరోవైపు హౌతీలను నియంత్రించేందుకు చైనా ప్రయత్నాలు కూడా తెరవెనుక దౌత్యం కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఆ ఏడు కండీషన్స్‌తో ఇరాన్‌ యుద్ధం ముగిసేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement