నేపాల్‌లో వరదలు ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అకస్మాత్తుగా వచ్చిన వరదలు భయానక ప్రళయాన్ని సృష్టించి 1400 మందికి పైగా పొట్టన పెట్టుకున్నాయి. అయితే వరదల బీభత్సం సృష్టించి నాలుగు వారాలు గడుస్తోన్నా అందులో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో బాధితుల ఉనికిపై ఆందోళన వ్యక్తమవుతుంది.
నేపాల్‌లో గత నెల సంభవించిన ఆకస్మిక వరదలకు నాలుగు వారాలు గడిచినా సహాయక, గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సుమారు 6,000 మంది ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.నేపాల్-టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉద్భవించిన ఈ భారీ వరదలు ఉత్తర, మధ్య నేపాల్‌లోని పట్టణాలు, గ్రామాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇళ్లు, భవనాలు, వాహనాలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. భోటేకోశి నది ఉప్పొంగి భారీగా వరద నీటిని దిగువ ప్రాంతాలకు తీసుకెళ్లడంతో కొన్ని నిమిషాల్లోనే అనేక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి.
1,450 దాటిన మృతుల సంఖ్య
నేపాల్ పోలీసుల ప్రకటన ప్రకారం, ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1,451కి చేరింది. ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయడంతో మృతుల సంఖ్య పెరిగింది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా చిత్వన్ జిల్లాలో 367 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. రసువా జిల్లాలో 236, నావల్‌పరాసి ఈస్ట్‌లో 232, నావల్‌పరాసి వెస్ట్‌లో 222 మృతదేహాలు లభించాయి. అదేవిధంగా నువాకోట్ జిల్లాలో 203, గోర్ఖాలో 79, ధాదింగ్‌లో 72, తనహున్‌లో 38 మృతదేహాలను వెలికితీశారు. చికిత్స పొందుతూ కాఠ్మాండు ఆసుపత్రిలో మరో ఇద్దరు మరణించారు.
6,000 మంది ఆచూకీ కోసం గాలింపు
అధికారుల అంచనా ప్రకారం సుమారు 6,000 మంది ఇప్పటికీ గల్లంతైన వారి జాబితాలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రసువా, దాని పొరుగు జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాలు, వరదలతో పేరుకుపోయిన శిథిలాల ప్రాంతాలు, దెబ్బతిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులను సహాయక బృందాలు విస్తృతంగా పరిశీలిస్తున్నాయి. వరదలు నేపాల్‌ను తీవ్రంగా దెబ్బతీసి దాదాపు నెలరోజులు గడిచినా గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది.
రసువాలోని అప్పర్ త్రిశూలీ-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో కూడా 17 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. అవి రీన్‌ఫోర్స్‌మెంట్ మెష్‌లో చిక్కుకుని, బురదలో కూరుకుపోయి కనిపించాయి. ఈ మృతదేహాలను బయటకు తీయడానికి రెస్క్యూ సిబ్బంది గ్రైండర్లు, గ్యాస్ కట్టర్లు, రోటరీ పరికరాలను ఉపయోగించారు.
మృతదేహాల గుర్తింపులో ఇబ్బందులు
రెస్క్యూ, గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ మృతదేహాలను గుర్తించడం అధికారులకు మరో పెద్ద సవాలుగా మారింది. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన అనేక మృతదేహాలు చాలాకాలం నీటిలో, బురదలో ఉండటంతో కుళ్లిపోయాయి. కొన్ని మృతదేహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, మరికొన్ని పూర్తిగా కాకుండా శరీర భాగాల రూపంలో మాత్రమే లభించాయి. దీంతో వాటిని గుర్తించడం కష్టంగా మారింది.


