సిలికానాంధ్ర మన బడి 20వ విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టింది. గత వారాంతంలో అమెరికా, కెనడాలోని దాదాపు 250 నగరాల్లో ఉన్న మనబడి కేంద్రాల్లో కొత్త విద్యా సంవత్సరం ఉత్సాహంగా ప్రారంభమైంది. సుమారు 12,200 మంది విద్యార్థులు మనబడిలో చేరగా.. తొలి రోజున దాదాపు 20,000 మంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ పిల్లలతో కలిసి కేంద్రాలకు హాజరయ్యారు. దీంతో ఉత్తర అమెరికాలోని మనబడి కేంద్రాలు సందడి, ఆనందంతో కళకళలాడాయి.
విద్యా సంవత్సరం సజావుగా ప్రారంభమయ్యేలా సుమారు 2,500 మంది స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు, కేంద్ర సమన్వయకర్తలు, ఇతర సమాజ సేవకులు తమ సేవలను అందించారు. తెలుగు భాషను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో వీరంతా సమష్టిగా పనిచేస్తున్నారు. సిలికానాంధ్ర మన బడి 20వ సంవత్సరం ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం కేవలం 150 మంది విద్యార్థులతో ప్రారంభమైన మనబడి, నేడు భారతదేశం వెలుపల కొనసాగుతున్న అతిపెద్ద తెలుగు భాషాభ్యాస ఉద్యమాల్లో ఒకటిగా ఎదిగింది.
ఉత్తర అమెరికా వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు చేరువైన మనబడి, ఎన్నో సంవత్సరాలుగా తరతరాల పిల్లలకు తెలుగు మాట్లాడటం, చదవటం, రాయటం నేర్పిస్తూ, వారి భాష, సంస్కృతి, వారసత్వంతో అనుబంధాన్ని బలోపేతం చేస్తోంది. మన బడి ప్రయాణానికి మరో ప్రత్యేకమైన ఉదాహరణ ప్రస్తుతం తరగతి గదుల్లో కనిపిస్తోంది. మన బడి తొలి బ్యాచ్‌లలో చదువుకున్న కొంతమంది విద్యార్థులు నేడు తల్లిదండ్రులుగా మారి, తమ పిల్లలను తెలుగు నేర్చుకోవడానికి మనబడికి తీసుకువస్తున్నారు. కేవలం రెండు దశాబ్దాల్లోనే ఒక తరం నుంచి మరో తరానికి తెలుగు భాషా వారసత్వాన్ని అందించే వేదికగా మనబడి నిలిచింది.
మన బడి అభివృద్ధి వెనుక ఉపాధ్యాయులు, కేంద్ర సమన్వయకర్తలు, తల్లిదండ్రులు, నిర్వాహకులు, శ్రేయోభిలాషులతో కూడిన విస్తృత స్వచ్ఛంద సేవా సమాజం ఉంది. ఉత్తర అమెరికాలో భవిష్యత్ తరాల మధ్య తెలుగు భాష జీవించి, అభివృద్ధి చెంది, వికసించేలా చేయాలనే లక్ష్యంతో వారు ఎన్నో సంవత్సరాలుగా తమ సమయాన్ని, సేవలను అందిస్తున్నారు.
మూడో దశాబ్దంలోకి అడుగుపెడుతున్న మనబడి లక్ష్యం కేవలం తెలుగు భాషను పరిరక్షించడం మాత్రమే కాదు. పిల్లలకు తమ సాంస్కృతిక మూలాలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, రాబోయే తరాల కుటుంబాల్లో తెలుగు ఒక సజీవ భాషగా కొనసాగేందుకు అవసరమైన సమాజాన్ని నిర్మించడం కూడా మనబడి లక్ష్యంలో భాగమని నిర్వాహకులు తెలిపారు.
కొత్త విద్యా సంవత్సరానికి మనబడి ప్రవేశాలు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగనున్నాయి. తమ పిల్లలకు తెలుగు భాషను పరిచయం చేయాలనుకునే కుటుంబాలు సమీపంలోని మనబడి కేంద్రాన్ని సందర్శించి.. కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి అధ్యక్షులు, డీన్ చమర్తి రాజు మాట్లాడుతూ.. ‘‘మీ మద్దతే మన సమాజం అభివృద్ధి చెందడానికి ఉత్తమ మార్గం. మీ స్నేహితులు తమ పిల్లలను మన బడిని ప్రత్యక్షంగా అనుభవించేలా ప్రోత్సహించండి. మరో కుటుంబాన్ని మన బడికి అనుసంధానించి, వారి పిల్లలను ఈరోజే మనబడిలో నమోదు చేయమని ప్రోత్సహించండి” అంటూ ఆయన పిలుపునిచ్చారు.


