టాంజానియాలోని యునెస్కో గుర్తింపు పొందిన న్గోరోంగోరో పరిరక్షణ ప్రాంతంలో విషప్రయోగం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో 10 సింహాలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. న్గోరోంగోరో పరిరక్షణ ప్రాంత ప్రాధికార సంస్థ (ఎన్‌సీఏఏ) శనివారం (సెప్టెంబర్ 19) రాత్రి విడుదల చేసిన ప్రకటనలో.. సెప్టెంబర్ 18న న్డుటు ప్రాంతంలో 10 సింహాలు మృతి చెందినట్లు ప్రజలకు తెలియజేసింది.
ప్రాథమిక పరిశీలనలో సింహాలు విషం తీసుకోవడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోందని అధికారులు తెలిపారు. ఘటనకు కారణం ఏంటో, బాధ్యులు ఎవరో గుర్తించేందుకు నిపుణుల దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. న్గోరోంగోరో ప్రాంతంలో అధికారులు, స్థానిక సంచార సమాజం మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 2022లో ప్రభుత్వం ఖాళీ చేయించే కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ ఘర్షణలు ప్రాణాంతకంగా మారాయి.
జనాభా పెరుగుదల వల్ల వన్యప్రాణుల ఆవాస ప్రాంతాలు ఆక్రమణకు గురవుతున్నాయని టాంజానియా ప్రభుత్వం చెబుతోంది. 1959లో న్గోరోంగోరోలో సుమారు 8,000 మంది నివసించగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 1,00,000 దాటిందని పేర్కొంది. జూన్ నుంచి టాంజానియా సరిహద్దుకు సమీపంలోని కెన్యాలోని అంబోసెలి పర్యావరణ వ్యవస్థలో దాదాపు 20 ఏనుగులు అనుమానిత పురుగుమందు విషప్రయోగంతో మృతి చెందాయి. అయితే ఆ మరణాలు ప్రమాదవశాత్తూ జరిగాయా, ఉద్దేశపూర్వకంగా జరిగాయా అనేది అధికారులు నిర్ధారించలేకపోయారు.


