సముద్రం లోతుల్లో ‘పాట’.. తిమింగలాల రహస్యం వింటే షాకే! | Whale Song Humpback Whales Ocean Secret | Sakshi
Sakshi News home page

సముద్రం లోతుల్లో ‘పాట’.. తిమింగలాల రహస్యం వింటే షాకే!

Sep 19 2026 2:23 PM | Updated on Sep 19 2026 2:39 PM

Whale Song Humpback Whales Ocean Secret

సముద్రం లోతుల్లో నుంచి గంటల తరబడి ఓ వింత శబ్దం వినిపిస్తోంది.. విషాదంగానూ, అదే సమయంలో ఏదో తెలియని ఆకర్షణీయంగా ఉన్న ఆ శబ్దం ఏంటో తొలుత ఎవరికీ అర్థం కాలేదు. ఏదైనా యంత్రం నుంచి వస్తుందా? సముద్రంలో భూకంప కదలికలకు సంబంధించినదా? అనే అనుమానాలు కూడా వచ్చాయి. చివరకు ఆ శబ్దం ఓ భారీ జీవి నుంచి వస్తున్నట్లు తేలింది.

అది హంప్‌బ్యాక్‌ తిమింగలం. అంతేకాదు.. అది సాధారణ అరుపు కాదు, ఒక క్రమంలో సాగే ‘పాట’ అని గుర్తించారు. 1952లో అమెరికా సోనార్‌ ఇంజినీర్‌ ఫ్రాంక్‌ వాట్లింగ్టన్‌ బెర్ముడా సముద్ర తీరంలో హైడ్రోఫోన్‌తో శబ్దాలను రికార్డు చేస్తుండగా ఈ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.ఆ రికార్డింగులతో తిమింగలాలపై ప్రపంచం ఆలోచన మారిపోయింది.

వాట్లింగ్టన్‌ రికార్డు చేసిన శబ్దాలను 1967లో పరిశోధకులు రోజర్‌, కేటీ పేన్‌లు విన్నారు. శబ్దాలు ఒకే క్రమంలో పదేపదే పునరావృతమవుతున్నట్లు వారు గుర్తించారు. కొన్ని పాటలు అరగంట వరకు కొనసాగి, మళ్లీ మొదటి నుంచి వినిపించేవి. దీంతో తిమింగలాలు కేవలం శబ్దాలు చేయడం కాదని, పాటలు పాడుతున్నాయని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. అయితే, రోజర్‌ పేన్‌ ఈ రికార్డింగులను ప్రజలకు వినిపించడం మొదలుపెట్టారు. దీంతో సమావేశాల నుంచి తిమింగలాల సంరక్షణ ఉద్యమాల వరకు ఎక్కడ అవకాశం దొరికినా వాటిని వినిపించేవారు. సముద్రంలో కనిపించని ఓ జీవి చేస్తున్న ఆ వింత సంగీతం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ ఆసక్తి 1970లో మరో మలుపు తీసుకుంది. రోజర్‌, కేటీ పేన్‌, వాట్లింగ్టన్‌ కలిసి ‘Songs of the Humpback Whale’ పేరుతో ఐదు హంప్‌బ్యాక్‌ తిమింగలాల రికార్డింగులతో ఆల్బమ్‌ విడుదల చేశారు. అది ఊహించని స్థాయిలో ఆదరణ పొందింది. 1.25 లక్షలకు పైగా కాపీలు అమ్ముడై, అత్యధికంగా అమ్ముడైన ప్రకృతి సంబంధిత ఆల్బమ్‌గా నిలిచింది. అలాగే, నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సబ్‌స్క్రైబర్లకు కూడా రికార్డింగ్‌లోని కొంత భాగాన్ని పంపించారు. బీటిల్స్‌, బాబ్‌ డిలన్‌ వంటి ప్రముఖులకు ఆల్బమ్‌ కాపీలు చేరాయి. అదేవిధంగా జూడీ కాలిన్స్‌, కేట్‌ బుష్‌ తమ సంగీతంలోనూ తిమింగలాల శబ్దాలను ఉపయోగించారు. 1977లో వాయేజర్‌-1 అంతరిక్ష నౌకతో పంపిన ‘గోల్డెన్‌ రికార్డ్‌’లో కూడా ఈ పాటకు చోటు దక్కింది.

మరోవైపు అప్పట్లో తిమింగలాలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి. నూనె, సబ్బులు, సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగించే పదార్థాల కోసం శతాబ్దాలుగా వాటిని వేటాడేవారు. 1970ల ప్రారంభానికి హంప్‌బ్యాక్‌ తిమింగలాల సంఖ్య గతంలో ఉన్న స్థాయిలో ఐదు శాతానికంటే తక్కువకు పడిపోయింది. అయితే, ఇలాంటి సమయంలో తిమింగలాల పాటలు ప్రపంచవ్యాప్తంగా సంరక్షణ ఉద్యమానికి కొత్త ఊపునిచ్చాయి. దీంతె ప్రజలు తొలిసారిగా తమ ఇళ్లలోనే తిమింగలాల శబ్దాలను విని వాటితో ఓ అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. 1972లో అమెరికా ‘మెరైన్‌ మామల్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌’ను తీసుకురాగా, 1982లో వాణిజ్య తిమింగలాల వేటపై అంతర్జాతీయ నిషేధానికి మార్గం ఏర్పడింది. ఆ తర్వాత హంప్‌బ్యాక్‌ తిమింగలాల సంఖ్య అనేక ప్రాంతాల్లో గణనీయంగా పెరిగింది.

అయితే, ఇప్పటికీ తిమింగలాలు ఎందుకు పాడుతాయన్న ప్రశ్నకు పూర్తి సమాధానం లేదు. ప్రధానంగా మగ తిమింగలాలే పాటలు పాడుతుండటంతో ఆడ తిమింగలాలను ఆకర్షించడానికి లేదా ఇతర మగ తిమింగలాలతో పోటీ పడేందుకు ఈ పాటలను ఉపయోగిస్తుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సముద్రంలో దూర ప్రాంతాలకు సమాచారాన్ని పంపేందుకు కూడా వీటిని ఉపయోగించే అవకాశం ఉందని చెబుతున్నారు.

అంతేకాదు.. ఒక ప్రాంతంలోని తిమింగలాలు పాడే పాట కాలక్రమంలో మారుతుందని, ఆ మారిన పాటలు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తాయని పరిశోధనల్లో తేలింది. అంటే సముద్రంలోనూ ఒక రకమైన ‘సంస్కృతి’ మార్పు జరుగుతోందన్నమాట. అయితే నౌకల ఢీకొనడం, చేపల వలల్లో చిక్కుకోవడం, వేట, సముద్ర కాలుష్యం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వంటి ముప్పులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయినా 1970లో వినిపించిన ఆ ‘తిమింగలాల పాట’ మాత్రం వాటి రక్షణ కోసం ప్రపంచాన్ని కదిలించిన అరుదైన శబ్దంగా చరిత్రలో నిలిచిపోయింది.

ఇదీ చదవండి: భారతదేశవ్యాప్తంగా త్వరలో కళాకారిణి ప్రసన్న వెలగాల ప్రదర్శనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement