వాషింగ్టన్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తారాస్థాయికి చేరడంతో వైట్‌హౌస్ తీవ్ర అప్రమత్తమైంది. ఈ భద్రతా సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వీకెండ్ క్యాంప్ డేవిడ్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. హుటాహుటిన రాజధాని వాషింగ్టన్‌కు తిరుగుపయనమయ్యారు.
ఉద్రిక్తతల తీవ్రత దృష్ట్యా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తన టెక్సాస్ పర్యటనతో పాటు, ఎలాన్ మస్క్‌తో జరగాల్సిన కీలక భేటీని కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం అనంతరం తిరిగి ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
మరోవైపు, మేరీలాండ్‌లోని క్యాంప్ డేవిడ్ నిర్బంధ గగనతలంలోకి అనుమతి లేకుండా ఒక సాధారణ విమానం ప్రవేశించడం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు, ఫ్లేర్లను వదులుతూ ఆ విమానాన్ని అడ్డగించి, పైలట్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాయి.
9 దేశాల్లో అమెరికా హై-అలర్ట్
పశ్చిమాసియాలో ఎప్పుడైనా భారీ సైనిక ఘర్షణ చెలరేగే ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఓమాన్, లెబనాన్, జోర్డాన్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాతో సహా మొత్తం తొమ్మిది దేశాల్లోని తమ పౌరులకు అమెరికా రాయబార కార్యాలయాలు అత్యవసర భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. గగనతలాలు అకస్మాత్తుగా మూతపడే అవకాశం ఉన్నందున, విమాన సర్వీసుల రద్దుకు సిద్ధంగా ఉండాలని సూచించాయి.
సౌదీపై హూతీల దాడి.. రియాద్‌లో ఎయిర్ అలర్ట్
యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుదారులు హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని సున్నితమైన ప్రాంతాలపై, ఎర్రసముద్ర తీరంలోని ఇంధన కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సౌదీ రక్షణ దళాలు ఒక బాలిస్టిక్ క్షిపణిని గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో సౌదీ సివిల్ డిఫెన్స్ చరిత్రలోనే మొదటిసారిగా రియాద్, అల్-ఖర్జ్ నగరాల్లో వైమానిక దాడుల హెచ్చరికల సైరన్లు మోగించింది.
రూ.26 వేల కోట్ల భారీ ఆయుధ ప్యాకేజీ
పశ్చిమాసియా ఘర్షణల వేళ.. ఇజ్రాయెల్‌కు సుమారు రూ.26 వేల కోట్ల భారీ ఆయుధ ప్యాకేజీని అమెరికా ఆమోదించింది. ఇందులో ఒక్కొక్కటి టన్ను బరువున్న సుమారు 40 వేల అత్యాధునిక బాంబులు ఉన్నాయి. అమెరికా ఆయుధాగారంలో ఉన్న అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల్లో 'ఎంకే-84' ఒకటి. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌కు 20 వేల 'ఎంకే-84' బాంబులతో పాటు మరో 20 వేల 'బీఎల్‌యూ-117' బాంబులను పంపేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. వీటితో పాటు 20 వేల 'ఐ-2000' పెనెట్రేటర్ వార్‌హెడ్స్‌ను కూడా ఈ ప్యాకేజీలో చేర్చారు. ఈ 'ఎంకే-84' బాంబులు విస్ఫోటనం చెందితే, వాటి లోహపు శకలాలు వేలాది అడుగుల దూరం వరకు ఎగిరిపడి తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి.


