హౌతీల దాడులను ఖండించిన భద్రతా మండలి
దుబాయ్: శత్రువు నుంచి వైమానిక దాడి జరిగే ప్రమాదముందంటూ ప్రజలను హెచ్చరిస్తూ శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం సౌదీ అరేబియా వ్యాప్తంగా సైరన్లు మోగాయి. హౌతీల దాడులు మొదలైన తర్వాత రాజధాని రియాద్‌లో ఇలాంటి సైరన్లు మోగడం ఇదే మొదటిసారి. రియాద్ విమానాశ్రయానికి సమీపంలో పేలుడు సంభవించిందని, విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిందని వార్తలు వచ్చాయి.
అయితే, ఎవరూ మరణించలేదని, ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుళ్లకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. యెమెన్‌లోని హౌతీ రెబెల్స్ పొరుగుదేశాలకు హెచ్చరికలు చేయడం, దాడులకు పాల్పడటాన్ని శుక్రవారం ఐరాస భద్రతామండలి ఖండించింది. ఇలాంటి పరిణామాలు ప్రాంతీయ భద్రతకు, అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర విఘాతం కల్గిస్తాయని పేర్కొంది. హౌతీలకు సైనికపరమైన ఎలాంటి సాయం అందకుండా చేసేందుకు సంబంధిత దేశాల మధ్య ఆచరణాత్మక సహకారం అవసరమని పేర్కొంది.


