స్టాక్‌హోమ్ సిటీ నియోజకవర్గం నుంచి గెలిచిన నీలా
ముంబై: మహారాష్ట్రలో ప్రముఖ విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖే పాటిల్ గత వారం జరిగిన స్వీడన్ పార్లమెంట్ ఎన్నికల్లో స్టాక్‌హోమ్ సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఆ దేశ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ‘‘349 మంది సభ్యులున్న పార్లమెంట్‌కు ఎన్నికవ్వడం సంతోషంగాఉంది. తమ కష్టాలను చెప్పుకోలేకపోయిన వాళ్లకు గొంతుక అవుతా. ప్రతి చిన్నారికి మంచి భవిష్యత్తు ఉండేలా మెరుగైన సమాజం కోసం కృషిచేస్తా’’అని నీల తెలిపారు.
41 ఏళ్ల నీలా పాటిల్ ఆసియాలోనే మొట్టమొదటి సహకార చక్కెర ఫ్యాక్టరీని స్థాపించిన విఠల్‌రావ్ విఖే పాటిల్ మునిమనవరాలు. నీలా తాత బాలాసాహెబ్ విఖే పాటిల్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ‘‘మా తాత గర్వపడేలా ఎంపీగా పనిచేస్తా. టీనేజర్‌గా ఉన్నప్పుడు తాత నాతో రాష్ట్ర బడ్జెట్ చదివించారు’’అని నీల గుర్తుచేసుకున్నారు. నీల గతంలో నాటి ప్రధానమంత్రి స్టీఫన్ లోవెన్ హయాంలో ప్రధాని కార్యాలయంలో ఆర్థికం, పన్నులు, గృహాలకు సంబంధించి రాజకీయ సలహాదారుగా సేవలందించారు.
నీల గతంలో స్టాక్‌హోమ్ మున్సిపల్ కార్పొరేషన్ సిటీ కౌన్సిల్‌లో సభ్యురాలిగా ఉన్నారు. స్వీడన్‌లో పుట్టిన నీల చిన్నతనంలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో పెరిగారు. నీల పెదనాన్న రాధాకృష్ణ విఖే పాటిల్ ప్రస్తుతం మహారాష్ట్రలో మంత్రిగా కొనసాగుతున్నారు. గోథన్‌బర్గ్ బిజినెస్ స్కూల్‌లో ఈమె ఎంబీఏ చేశారు. మాడ్రిడ్‌లోనూ విద్యనభ్యసించారు. స్వీడన్‌లోని విపక్ష గ్రీన్‌పారీ్టలో గత పాతికేళ్లుగా నీల క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.


