సీజేపీ సరికొత్త ఉద్యమం.. మోదీ పుట్టినరోజే ఎందుకు? | On PM Modis Birthday Cockroach Janta Party Launches New Campaign | Sakshi
Sakshi News home page

సీజేపీ సరికొత్త ఉద్యమం.. మోదీ పుట్టినరోజే ఎందుకు?

Sep 17 2026 1:48 PM | Updated on Sep 17 2026 2:38 PM

On PM Modis Birthday Cockroach Janta Party Launches New Campaign

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం రోజే కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల పరిస్థితి, విద్యార్థుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘ఆదివాసీ స్కూల్‌ ఠీక్‌ కరో’ పేరుతో ఈ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. గురువారం తన స్వరాష్ట్రం మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఈ పోరాటాన్ని ప్రారంభించారు.

ఆదివాసీ స్కూల్‌ ఠీక్‌ కరో (Adivasi School Thik Karo)లో భాగంగా.. గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లలో మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత, వసతి పరిస్థితులను సీజేపీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ఉద్దేశమని దీప్కే తెలిపారు. ఇప్పటికే CJP దేశవ్యాప్తంగా స్కూల్‌ ఠీక్‌ కరో (School Thik Karo) పేరుతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి కొనసాగింపుగానే గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపింది.

వందల మంది మృతి!
గిరిజన విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ దీప్కే.. సంచలన ఆరోపణలకు దిగారు. మహారాష్ట్రలో గత రెండేళ్లలో 590 మందికి పైగా గిరిజన విద్యార్థులు మరణించారని ఆయన పేర్కొన్నారు. పాముకాట్లు వంటి నివారించగల ప్రమాదాలతోనూ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లోనూ ఇటీవల గిరిజన విద్యార్థుల మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపారు.

ఏకలవ్య పాఠశాలలపైనా ప్రశ్నలు
ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల పరిస్థితిపైనా సీజేపీ ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేశవ్యాప్తంగా మంజూరైన 720 పాఠశాలల్లో 477 పనిచేయడం లేదని దీప్కే ఆరోపించారు. గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యలో ప్రవేశాలపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

‘అన్ని ప్రభుత్వాలూ నిర్లక్ష్యం చేశాయి’
గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను గత 80 ఏళ్లుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని దీప్కే ఆరోపించారు. పెద్ద నగరాల్లోని విద్యార్థులకు లభించే విద్యా సదుపాయాలు, భద్రత, నాణ్యమైన విద్య గిరిజన ప్రాంతాల పిల్లలకూ అందాలని అన్నారు. కేవలం ఆర్థిక వృద్ధి గణాంకాలు చెప్పడం సరిపోదని.. గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వాలను కోరారు.

మోదీ బర్త్‌డే రోజే ఎందుకు?
మోదీ జన్మదినం సెప్టెంబర్‌ 17నే సీజేపీ ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జెన్‌ జీ పోరాట వేదిక కావాలనే ఇలా చేసిందా? అని నెట్టింట చర్చ నడిచింది. అయితే ఇదేం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని దీప్కే స్పష్టత ఇచ్చారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే తాము  ఉద్యమం మొదలుపెట్టామని అంటున్నారు.

అంతకు ముందు.. ఆశుతోష్‌ రాంకా చేసిన ఓ పోస్ట్‌ మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఈ ఉదయం ‘ఆశీర్వాద్‌ కా దియా’ పేరుతో దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు ఇచ్చింది. అయితే ఇలా ఎందుకు అంటూ రాంకా ఓ ట్వీట్‌ చేశాడు. “గాయిస్‌‌.. చెప్పండి, దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఆశీర్వాద దీపం వెలిగించమని ఎందుకు చెప్పారు?  ఎవరి పుట్టినరోజో చెప్పండి?” అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు.

ఇదీ చదవండి: మోదీ గుండె ధైర్యానికి ఇదే ఎగ్జాంపుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement