అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గులు, రీఫైనింగ్ మార్జిన్లలో మార్పుల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి ఎగుమతి అయ్యే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం(ఏటీఎఫ్)పై విండ్‌ఫాల్ టాక్స్ (ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం)ను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సవరించిన పన్ను వివరాలు
సమీక్షలో భాగంగా డీజిల్‌పై గతంలో ఉన్న లీటరుకు రూ.25 సుంకాన్ని రూ.20కి తగ్గించారు. డీజిల్‌పై ప్రత్యేకదనపు ఎక్సైజ్ సుంకాన్ని రూ.20గా నిర్ణయించగా, రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ (ఆర్‌ఐసీ)ను పూర్తిగా సున్నాకు తగ్గించారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ ఎగుమతులపై లీటరుకు రూ.19గా ఉన్న పన్నును రూ.15కు కుదించారు. పెట్రోల్‌పై గతంలో ఉన్న లీటరుకు రూ.1.5 సుంకాన్ని రూ.0.50 (50 పైసలు)కు తగ్గించారు. స్థానిక మార్కెట్లో విక్రయించే పెట్రోల్, డీజిల్‌పై ఉన్న ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పు లేదని, ఇవి యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
నిర్ణయానికి గల కారణాలు.. మార్కెట్ విశ్లేషణ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మూలంగా ముడిచమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ సౌదీ అరేబియా ఆసియా రిఫైనరీలకు అదనపు చమురు సరఫరాను ప్రారంభించడంతో బ్రెంట్ క్రూడ్, డబ్ల్యూటీఐ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ విపణిలో డిమాండ్, రిఫైనింగ్ లాభాల సమీక్ష ఆధారంగా దేశీయ ఎగుమతిదారులపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ సవరణ చేసింది. దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా చూడటంతో పాటు, విదేశీ మార్కెట్లలో అధిక లాభాల కోసం మాత్రమే ఎగుమతి చేయడాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ తరహా పన్నులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. ప్రస్తుత కోత వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్, నాయరా ఎనర్జీ, ఓఎన్‌జీసీ వంటి దిగ్గజ చమురు శుద్ధి, ఉత్పత్తి సంస్థల లాభదాయకత మెరుగయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: నగవులు నిజమని నమ్మేదా?


