పెట్రోల్‌తో ఒంటికి నిప్పు.. ఠాణాలోకి పరుగు! | Incident in Warangal | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌తో ఒంటికి నిప్పు.. ఠాణాలోకి పరుగు!

Sep 12 2026 5:49 AM | Updated on Sep 12 2026 5:49 AM

Incident in Warangal

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వరంగల్‌ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఘటన

ఖిలా వరంగల్‌: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకొని పోలీస్‌ స్టేషన్‌లోకి పరుగులు పెట్టాడు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం వరంగల్‌ మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్‌ కరీమాబాద్‌ లక్ష్మీనగర్‌కు చెందిన కట్ల హరీశ్, అదే ప్రాంతానికి చెందిన వైష్ణవిని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. తన భర్త హరీశ్‌ మద్యం సేవించి తరుచూ గొడవ పడేవాడని, తనపై, తన తల్లిపై దాడి చేశాడని, ఆ క్రమంలో తన తల్లి చేయి విరిగిందని గతంలో వైష్ణవి మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యా దు చేసింది. ఈ క్రమంలో హరీశ్‌కు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు. 

అతడిలో మార్పువస్తుందని భావించి వైష్ణవి భర్తతో కలిసి వెళ్లింది. అయినా అతడిలో మార్పు రాలేదు. మళ్లీ అదే తరహాలో ప్రవర్తించడంతో విసుగు చెందిన వైష్ణవి ఇక భర్తతో తాను కలిసి జీవించడం సాధ్యం కాదంటూ కరీమాబాద్‌లోని పుట్టింటికి వెళ్లడమే కాకుండా విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈనెల 7వ తేదీన వాయిదా ప్రకారం కోర్టుకు వైష్ణవి హాజరై పుట్టింటికి చేరుకుంది. ఈ సమయంలో హరీశ్‌ ఆమెను వెంబడించి ఇంటికి వెళ్లి విడాకులు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడమే కాకుండా ఆమెపై చేయిచేసుకున్నాడు. ఇంట్లో తల్లి లేకపోవడంతో ఏమీ అనకుండా వైష్ణవి ఉండిపోయింది. గురువారం మళ్లీ హరీశ్‌ వచ్చి అదే పద్ధతిలో ప్రవర్తించడమే కాకుండా వైష్ణవి, ఆమె తల్లిని కొట్టాడు. 

ఈ విషయమై అదేరోజు మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో వైష్ణవి మళ్లీ ఫిర్యాదు చేసింది. భర్తతో తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరింది. దీంతో శుక్రవారం ఉదయమే పోలీస్‌ స్టేషన్‌కు రావాలని పోలీసులు హరీశ్‌కు సమాచారం అందించారు. మధ్యాహ్నం మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌కు రాగానే హరీశ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పు అంటించుకుని ఒక్కసారిగా స్టేషన్‌లోకి దూసుకొచ్చాడు. 

మంటలు ఆర్పే ప్రయత్నంలో రైటర్‌ ప్రవీణ్, కానిస్టేబుల్‌ ముగ్ధుమ్‌ చేతులు కాలిపోయాయి. ముప్పై శాతానికిపైగా కాలిన హరీశ్‌తోపాటు గాయపడిన పోలీసు సిబ్బందిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, తన భార్య మంచిదేనని, అత్త వేధింపులతోనే వైష్ణవి తన నుంచి దూరమవుతుందని, కుమారుడిని కూడా దూరం చేశారని... ఈ నిర్ణయం తీసుకున్నానని ఎంజీఎంలో జడ్జి ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ స్వామి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement