సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని కమ్మర్లపల్లి వద్ద రైతుల ధర్నా
విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం
సాక్షి, నెట్‌వర్క్: వ్యవసాయ కనెక్షన్లకు 24గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో 12 గంటలు సరఫరా చేస్తున్నట్టు చెబుతున్నా, అవాంతరాలతో అది అమలుకావడం లేదు. దీంతో వరి పంటకు నీరందక ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
⇒ వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల విద్యుత్ ఇచ్చి పంటలను కాపాడాలని, లో ఓల్టేజీ సమస్య పరిష్కరించాలని సీపీఎం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం జిల్లా కూసుమంచిలోని విద్యుత్ శాఖ ఏడీఏ కార్యాలయం ఎదుట నిరసన రైతులు తెలిపారు.
⇒ సిద్దిపేట జిల్లాలో అనధికారిక కరెంట్ కోతలు విధిస్తున్నారంటూ రైతులు రోడ్డెక్కారు. పలు చోట్ల రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. ఏడు గంటలు మాత్రమే త్రీఫేజ్ కరెంటు ఇస్తున్నారని, అందులోనూ కోతలు విధిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు.
⇒ అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలోని ఇల్లందు–మహబూబూబాద్ రహదారిపై ఏఐకేఎంఎస్, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
⇒ ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం సబ్‌స్టేషన్ పరిధిలోని రైతులు ఏడీఈ ఉమారావుకు వినతిపత్రం అందజేశారు. రోజువారీగా ఇచ్చే విద్యుత్‌తోపాటు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు అదనంగా త్రీఫేజ్ విద్యుత్ ఇవ్వాలని కోరారు.
⇒ విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల రైతులు ఆందోళనలకు దిగారు. పాల్వంచ మండలం ఇసాయిపేట, దోమకొండ మండలంలోని సీతారాంపల్లి, భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి విద్యుత్ సబ్‌స్టేషన్‌లను ముట్టడించారు. రామారెడ్డి మండలం రెడ్డిపేటలో రాస్తారోకో చేశారు.
సాగుకు అంతరాయం లేకుండా సరఫరా: సీఎండీ కే.వరుణ్‌రెడ్డి
రాష్ట్రంలో వేసవి కాలాన్ని మించి విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తున్నా వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నామని ఎనీ్పడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఎల్‌నినో కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రస్తుతం విద్యుత్ వినియోగం క్రిటికల్‌గా మారిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా వినియోగం పెరుగుతూ వస్తోందని తెలిపారు. సాగుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేపడుతున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


