మహానగరానికి కొత్త రూపు | Hyderabad civic map could change: CURE Bill in Telangana Assembly | Sakshi
Sakshi News home page

మహానగరానికి కొత్త రూపు

Sep 12 2026 5:33 AM | Updated on Sep 12 2026 5:33 AM

Hyderabad civic map could change: CURE Bill in Telangana Assembly

ఆస్తిపన్ను, టౌన్‌ప్లానింగ్, విపత్తు నిర్వహణలో కీలక మార్పులు

జీహెచ్‌ఎంసీలో భారీగా పెరగనున్న ఆస్తిపన్ను  

2015 అక్టోబర్‌ 28కి ముందున్న అక్రమ నిర్మాణాల 

క్రమబద్దీకరణకు చాన్స్‌ హైడ్రాకు మరింత బలం 

అసెంబ్లీలో ‘క్యూర్‌’బిల్లు

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని మహానగర భవిష్యత్తు రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌) బిల్లు–2026 (టీక్యూర్‌ బిల్లు)ను ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో సభ్యులకు పంపిణీ చేసింది. ఈ బిల్లుపై శనివారం సమగ్ర చర్చ జరగనుంది. 1956లో అప్పటి నగర అవసరాలకు అనుగుణంగా రూపొందిన మున్సిపల్‌ చట్టాల స్థానంలో ఆధునిక నగర అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర పాలనా వ్యవస్థను తీసుకురావడం బిల్లు ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం విస్తరించిన హైదరాబాద్‌ భౌగోళిక, జనాభా, ఆర్థిక అవసరాలకు పాత చట్టాలు సరిపోవడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. పాత జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు చుట్టుపక్కల విలీన ప్రాంతాలను సమన్వయంతో అభివృద్ధి చేయడం, ప్రభుత్వ శాఖలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం, పౌర సేవలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఉంది.  

మూడు కార్పొరేషన్లు.. ఒకే సమన్వయం 
క్యూర్‌లోని ప్రాంతాల్ని జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలుగా మూడు కార్పొరేషన్లుగా నిర్వహించే ప్రతిపాదనకు చట్టబద్ధ రూపం లభించనుంది. వీటి సమన్వయం కోసం ‘క్యూర్‌ అపెక్స్‌ గవర్నెన్స్‌ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేయనున్నారు. మహానగర స్థాయి వ్యూహాత్మక ప్రాధాన్యాలను ఈ కౌన్సిల్‌ నిర్దేశించనుంది.

సామాన్యుల నెత్తిన బాంబు
సామాన్య ప్రజలపై నేరుగా ప్రభావం చూపే అంశాల్లో ఆస్తిపన్ను మార్పు ప్రధానమైనది. ప్రస్తుతం అమల్లో ఉన్న సంవత్సర అద్దె విలువ (ఏఆర్‌వీ) విధానానికి బదులుగా ఆస్తి మూలధన/రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా క్యాపిటల్‌ వాల్యూ సిస్టమ్‌ (సీవీఎస్‌) తేనున్నారు. దీనిద్వారా పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను రెట్టింపు, అంతకంటే ఎక్కువ కానుంది. ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నును ‘బేస్‌ ప్రాపర్టీ ట్యాక్స్‌’, కొత్త విధానంలో లెక్కించే పన్నును ‘బెంచ్‌మార్క్‌ ప్రాపర్టీ ట్యాక్స్‌’గా పరిగణించే విధానం ఉంది. కొత్త లెక్క ప్రకారం పన్ను ఎక్కువగా వస్తే ఒక్కసారిగా మొత్తం భారాన్ని మోపకుండా, క్రితం ఏడాది పన్నుపై ఏటా గరిష్టంగా 20 శాతం చొప్పున పెంచుతూ బెంచ్‌మార్క్‌ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు ప్రస్తుతం రూ.10వేలు పన్ను ఉండి, కొత్త విధానంలో రూ.20వేలు వస్తే.. మొదటి ఏడాది రూ.12,000, రెండో ఏడాది రూ.14,400, మూడో ఏడాది రూ.17,280 చొప్పున పెరుగుతూ చివరకు రూ.20వేలు స్థాయికి చేరుతుంది. కొత్త విధానంలో పన్ను తక్కువగా వచ్చినా వెంటనే ఆ తగ్గింపు ప్రయోజనం అందదు. బేస్‌ ట్యాక్స్‌నే కొనసాగిస్తూ భవిష్యత్‌లో క్యాపిటల్‌ వాల్యూ ఆధారంగా లెక్కించిన పన్ను దానికంటే ఎక్కువైనప్పడు కొత్త విధానాన్ని వర్తింపచేయనున్నారు. ప్రతి ఆస్తికి యూనిక్‌ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (యూపీఐఎన్‌) కేటాయించడం ద్వారా ఆస్తుల గుర్తింపు, పన్నుల నిర్వహణ, కొనుగోలు–అమ్మకాల్లో పారదర్శకత పెరగనుంది.

ఒక్క చాన్స్‌
సెక్షన్‌ 160 కింద 2015, అక్టోబర్‌ 28 నాటికి పూర్తయిన, కొన్ని నిబంధనలకు విరుద్ధమైన లేదా అనుమతి లేని నిర్మాణాలకు జరిమానాతో ఒకసారి క్రమబద్ధికరణకు అవకాశం కల్పించే నిబంధన ఉంది. ఆ తేదీ నాటికే నిర్మాణం పూర్తయిందని అఫిడవిట్‌ ఇవ్వాలి. తప్పుడు అఫిడ విట్‌ సమర్పిస్తే క్రిమినల్‌ చర్యలకు అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటు భవిష్యత్తులో చేపట్టే అక్రమ నిర్మాణాలకు వర్తించదు. అక్రమ నిర్మాణాలను నిలిపివేయడం, వివరణ కోరడం, నిర్మాణ సామగ్రిని స్వా«దీనం చేసుకోవడం, కూల్చివేతకు ఆదేశించడం వంటి అధికారాలు కమిషనర్‌కు ఉంటాయి. 

సాధారణంగా భవనా న్ని సీజ్‌ చేయడానికి 24 గంటల ముందస్తు నోటీసు అవసరం కాగా, ప్రజా భద్రతకు అత్యవ సర ముప్పు ఉన్న పరిస్థితుల్లో ముందస్తు నో టీసు లేకుండానే సీజ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఆక్యుపెన్సీ సరి్టఫికెట్‌ లేని భవనాలకు నీరు, విద్యుత్, మురుగునీటి కనెక్షన్లు ఇవ్వకుండా ని బంధనలు కఠినతరం చేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్లు ఇచ్చిన అధికారులపైనా చర్యలకు అవకాశం ఉంటుంది. నిబంధనలకు విరుద్ధమైన ఆస్తుల అమ్మకం, బహుమతి, లీజ్, తనఖా, మారి్పడి వంటి బదలాయింపులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అవసరమైతే వాటిని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చవచ్చు.

సింగిల్‌ విండో.. నైట్‌ ఎకానమీ 
వ్యాపారాలకు వివిధ శాఖల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సింగిల్‌ విండో ఆన్‌లైన్‌ లైసెన్సింగ్‌ వ్యవస్థను తేనున్నారు. ఎంపిక చేసిన నైట్‌ ఎకానమీ జోన్లలో రాత్రివేళల్లో వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలకు చట్టబద్ధమైన అవకాశం కల్పించడం ద్వారా నగర ఆర్థిక వ్యవస్థను 24 గంటల కార్యకలాపాల దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు తదితర మౌలిక సదుపాయాల నిర్వహణకు ఏఐ, డిజిటల్‌ మ్యాపింగ్, సాంకేతిక పర్యవేక్షణను విస్తరించనున్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగ నియంత్రణ, ఆహార విక్రయ కేంద్రాల తనిఖీలు, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.  

భవనాలు, లేఅవుట్ల అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు నిర్ణీత వ్యవధిలో దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకపోతే అది పైస్థాయి అధికారుల వద్దకు వెళ్లే విధానం ఉంటుంది. అక్కడ కూడా నిర్ణయం రాకపోతే డీమ్డ్‌ అప్రూవల్‌కు అవకాశం కల్పించే నిబంధనలు ఉన్నాయి. అయితే ఇది నిబంధనలను పక్కన పెట్టే ‘ఆటోమేటిక్‌ అనుమతి’కాదు.  

‘హైడ్రా’కు మరిన్ని అధికారాలు 
వరదలు, చెరువులు, నాలాలు, ఆక్రమణల నియంత్రణలో హైడ్రాకు కీలక అధికారాలను కల్పించే నిబంధనలు ఉన్నాయి. ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్, నాలా ప్రాంతాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై కఠిన చర్యలకు వీలు కలి్పస్తున్నారు. మున్సిపల్‌ వివాదాల త్వరిత పరిష్కారానికి ప్రత్యేక అప్పిలేట్‌ వ్యవస్థ, ప్రత్యేక మేజి్రస్టేట్‌ కోర్టుల ఏర్పాటుకు కూడా బిల్లు మార్గం చూపుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement