తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు కీలక బిల్లులు..! ముందున్నవి ఇవే! | Telangana Assembly Key Bills Section 22A El Nino Discussion | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు కీలక బిల్లులు..! ముందున్నవి ఇవే!

Sep 12 2026 12:45 AM | Updated on Sep 12 2026 12:45 AM

Telangana Assembly Key Bills Section 22A El Nino Discussion

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రభుత్వం ముఖ్యమైన బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. ప్రజా విశ్వాసం సవరణ బిల్లు–2026తో పాటు కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వీటితోపాటు రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22ఏ, ఎల్‌నినో ప్రభావం, నివారణ చర్యలపై కూడా స్వల్పకాలిక చర్చలు జరగనున్నాయి.

అయితే, ప్రజా విశ్వాసం సవరణ బిల్లు–2026ను మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లులోని ప్రతిపాదనలు, వాటి వల్ల కలిగే మార్పులపై సభ్యులు చర్చించనున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందేలా తీసుకురానున్న మార్పులపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.

మరో కీలక బిల్లుగా కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌ బిల్లు అసెంబ్లీ ముందుకు రానుంది. ఈ బిల్లును సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో పట్టణాభివృద్ధి, పాలనను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం, వివిధ సంస్థల మధ్య సమన్వయం వంటి అంశాలు ఇందులో ప్రధానంగా ఉండనున్నాయి.

రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22ఏ అంశంపైనా ఈరోజు అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. 22ఏ కింద భూముల రిజిస్ట్రేషన్లకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై సభ్యులు చర్చించనున్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. దీంతో 22ఏపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక ఎల్‌నినో ప్రభావం, దాని వల్ల రాష్ట్రంలో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు, ముందస్తు నివారణ చర్యలపైనా అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై సభ్యులు చర్చించనున్నారు. దీంతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు పలు కీలక నిర్ణయాలు, చర్చలకు వేదిక కానున్నాయి.

ఇవి కూడా చదవండి: బీసీల జనాభా లెక్కలు తేల్చాలి.. కులగణన తప్పనిసరి: మంత్రి శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement